అటు కేంద్ర ప్రభుత్వం కానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ గడచిన ఐదేళ్లుగా ప్రవేశపెడుతున్న 'విద్యా పాలసీలను' నిశితంగా పరిశీలిస్తే విద్య అంతిమ లక్ష్యం కేవలం 'స్కిల్స్’ను పెంపొందించడమేనా? అనే అనుమానం వస్తుంది.
ప్రస్తుత పరిస్థితులలో ఏ ప్రభుత్వ విద్యా పాలసీలు చూసినా కేవలం 'స్కిల్స్' చుట్టూనే ముడిపడి ఉన్నాయి. ఉన్నత విద్యా పాలసీలు కేవలం స్కిల్ డెవలప్‌మెంట్‌కే ప్రాధాన్యం ఇస్తున్నాయి.
స్కిల్ డెవలప్‌మెంట్ కోర్స్ లు ప్రవేశపెట్టి విద్యార్థులకు ప్రస్తుత మార్కెట్ అవసరాలకు తగ్గట్టుగా స్కిల్స్ నేర్పించడం, ఫలితంగా విద్యార్థికి ఉద్యోగ అవకాశాలు పెరిగేలా చూడడం ఆహ్వానించదగినదే. కానీ, కేవలం స్కిల్స్ పెంపొందించడం మాత్రమే విద్య అంతిమ లక్ష్యం కాకూడదు. ప్రస్తుత పారిశ్రామిక, ఏఐ ఆధారిత కంప్యూటర్ యూగంలో విద్యకు ‘స్కిల్’ అనే లక్ష్యంను చేర్చడం మంచిదే. విద్యార్థి భవిష్యత్‌కి కావలసిన కీలకమైన ‘గుణాత్మక’ అంశాలను పట్టించుకోవడంలేదు.
కేవలం స్కిల్స్ నేర్చుకొని విద్యార్థి ఉద్యోగం సంపాదిస్తే సరిపోతుందా? జీవితం అంటే ఏమిటి? జీవితం లో ఎదురయ్యే సమస్యల ను ఎలా ఎదుర్కోవాలి? ముఖ్యంగా, మానసిక ఒత్తిడిని ఎలా అధిగమించాలి? కుటుంబ, నైతిక విలువలు, సమాజం పట్ల బాధ్యత ఏమిటి? అనే విషయాలు నేటి ‘జెన్ జి’ యువతకు తెలియాల్సిన అవసరం ఉంది.
సోషల్ రెస్పాన్స్‌బిలిటీస్ నేర్పాలి
యువతలో విశ్వవిద్యాలయాల ద్వారా నిర్దిష్ట రంగంలో స్కిల్స్, డిగ్రీలు, పరిశోధనలకు సంబంధించిన విద్యను అందించేది ఉన్నత విద్య దశ. అటు ఇంజినీరింగ్‌లో, ఇటు సాంప్రదాయ డిగ్రీ కోర్సులలో కేవలం స్కిల్ డెవలప్మెంట్కు మాత్రమే ప్రాధాన్యతను ఇచ్చి నూతన కోర్సులను డిజైన్ చేస్తున్నారు.
ఒక విధంగా సాంప్రదాయ కోర్సుల స్వరూపాన్ని సైతం మార్చేస్తున్నారు. డిగ్రీ కోర్స్ ల ద్వారా కేవలం విద్యార్థికి ఇండస్ట్రియల్ స్కిల్స్ అందించే ప్రయత్నమే జరుగుతోంది. కానీ ‘ఎథికల్’, ‘సైకలాజికల్’ స్కిల్స్, ‘సోషల్ రెస్పాన్స్‌బిలిటీస్’ వంటి వాటిని బోధించడం లేదు.
ప్రస్తుత 'జెన్- జి' యువతకు జీవితం అంటే ఏమిటి? జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎలా ఎదుర్కోవాలి? ఉద్యోగంలో, జీవితంలో ఎదురయ్యే మానసిక ఒత్తిడిని ఎలా అధిగమించాలి? కుటుంబ, నైతిక విలువలు, సమాజం పట్ల ఎలా మెలగాలి వంటివి ఎవరు నేర్పుతారు? ఒత్తిడిని తట్టుకోలేక, పరీక్షలలో ఫెయిల్ వంటి ఇతర చిన్న చిన్న కారణాలకు ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారో తెలియంది కాదు.
ప్రొఫెషనల్ ఎథిక్స్ సబ్జెక్టు ఏది ?
స్కిల్‌కు మాత్రమే ప్రాముఖ్యతను ఇవ్వకుండా ఉన్నత విద్యలో విద్యార్థిలో గుణాత్మక అంశాలను కూడా పెంపొందించేలా విద్యా పాలసీలు ఉండాలి. ఒకప్పుడు డిగ్రీ కోర్స్ లలో ‘హ్యూమన్ వాల్యూస్ అండ్ ప్రొఫెషనల్ ఎథిక్స్’ సబ్జెక్టు ఉండేది. దానిని తీసివేశారు. అలాగే ప్రస్తుతం ప్రొఫెషనల్ కమ్యూనికేషన్ స్కిల్ అనే పేపర్ ఉన్నా అది కేవలం రెండు క్రెడిట్‌లకు మాత్రమే పరిమితం చేశారు.
నైపుణ్యాలతో పాటు ఉద్యోగ, కుటుంబ విషయాలలో ఒత్తిడిని తట్టుకొని, మానసిక దృఢత్వంతో తన జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించేలా, సమాజంలో ఉన్నతమైన పౌరుడిగా మెలిగేలా చేయగలిగేలా చేయడమే విద్య. నేటి ప్రపంచంలో విద్యా రంగం వేగంగా మారుతోంది.
సాంకేతిక పరిజ్ఞానం, పారిశ్రామిక అవసరాలు, ప్రపంచీకరణ ప్రభావంతో సంప్రదాయ విద్యతో పాటు స్కిల్ కోర్స్‌లు అవసరమే. వాటితో పాటు వివేకం, నైతిక విలువలు, సామాజిక బాధ్యత, సృజనాత్మకత, విమర్శనాత్మక ఆలోచన, నాయకత్వ లక్షణాలు ముఖ్యంగా మానసిక దృఢత్వం పెరిగే విధంగా కొన్ని సబ్జెక్టులను తయారుచేసి విద్యార్థులకు బోధించాలి. స్కిల్స్ ఉన్న విద్యార్థి మంచి ఉద్యోగి కావచ్చు. కానీ సమాజానికి బాధ్యతాయుతమైన పౌరుడిగా ఎదగడానికి విలువలతో కూడిన సమగ్ర విద్యా విధానం అవసరం.
డాక్టర్ రామకృష్ణ బండారు అసిస్టెంట్ ప్రొఫెసర్, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కేరళ
- ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ఐడీ openpage@v6velugu.com
- రచయితలు ‘వెలుగు’కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి.
- స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.
