- ఆలిండియా ర్యాంకులు సాధించడం రాష్ట్రానికి గర్వకారణం: మంత్రి అడ్లూరి
హైదరాబాద్, వెలుగు: యూపీఎస్సీ ప్రకటించిన సివిల్ తుది ఫలితాల్లో తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్‌కు చెందిన ఇద్దరు విద్యార్థులు జాతీయ స్థాయిలో ర్యాంకులు సాధించినట్లు ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. దళిత వర్గాల యువతకు నాణ్యమైన శిక్షణ అందించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల ఫలితంగా ఈ విజయాలు సాధ్యమయ్యాయని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హనుమకొండ జిల్లాకు చెందిన ఏ.ఆశిష్ ఆలిండియా 676 ర్యాంక్ సాధించగా, ములుగు జిల్లాకు చెందిన డి.ప్రవీణ్ కుమార్ 793 ర్యాంక్ సాధించారన్నారు.
గతేడాది మే నెలలో నిర్వహించిన సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షల్లో తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్‌కు చెందిన 27 మంది విద్యార్థులు అర్హత సాధించగా, గత ఆగస్టులో జరిగిన మెయిన్స్ పరీక్షలకు హాజరయ్యారని తెలిపారు. అందులో ఏడుగురు విద్యార్థులు ఇంటర్వ్యూకు అర్హత సాధించగా, ఇద్దరు అభ్యర్థులు ఎంపిక కావడం గర్వకారణమన్నారు. ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగ యువతకు ఉన్నత స్థాయి శిక్షణ అందించి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎక్కువ మంది ఎంపిక కావడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఈ సందర్భంగా సివిల్స్ సాధించిన ఆశిష్, ప్రవీణ్ కుమార్‌కు మంత్రి అభినందనలు తెలిపారు.
