బీజింగ్: బంగారు బాతు అని మనం ఇప్పటివరకు కథల్లోనే విని ఉంటాం. కానీ చైనాకు చెందిన ఓ వ్యక్తికి బాతు కడుపులో లక్షల విలువైన బంగారం దొరికింది. హునాన్ప్రావిన్స్లోని లాంగ్హుయ్కౌంటీకి చెందిన లుయ్అనే వ్యక్తి తాను పెంచిన బాతును వండుకునేందుకు కోశాడు. అయితే దాని కడుపులో చిన్నచిన్న బంగారు రేణువులు ఉన్నట్లు గుర్తించాడు. వాటిని కరిగించగా సుమారు 10 గ్రాముల బంగారం బయటపడింది.
దాని విలువ 12 వేల యువాన్లు(దాదాపు రూ.1.65 లక్షలు) ఉంటుందని అంచనా. ఆ ప్రాంతంలో పెరిగే బాతులు బంగారు నిక్షేపాలకు ప్రసిద్ధి చెందిన సమీప చెన్షుయ్నదీ తీరంలో తిరుగుతూ బురదను తింటాయని, ఈ క్రమంలో బంగారు రేణువులను మింగి ఉండొచ్చని లుయ్ పేర్కొన్నాడు.
గతంలో కూడా తమ గ్రామస్తులకు బాతుల కడుపులో బంగారం దొరికిందని, కానీ అది చాలా తక్కువ అని, తనకు దొరికింది మాత్రం ఎక్కువ అని పేర్కొన్నాడు. కొత్త సంవత్సరం ప్రారంభంలో బంగారం దొరకడం శుభసూచకమని లుయ్ తండ్రి ఆనందం వ్యక్తం చేశాడు. చట్టాల ప్రకారం భూమిలో దొరికేవి ప్రభుత్వానికే సొంతం. దీంతో ఆ బంగారం ఎవరికి దక్కుతుందా అని ఆసక్తి నెలకొంది.
