
ముంబైలో దారుణం జరిగింది. పాడైపోయిన చికెన్ తో తయారు చేసిన షవర్మా తిని 19 ఏళ్ల యువకుడు మృతి చెందాడు. ఇదే షవర్మా తిన్న మరో ఐదుగురు కూడా ఫుడ్ పాయిజన్ కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందతున్నారు. మే 3న ప్రతిమేశ్ భోక్సే అనే యువకుడు తన స్నేహితులతో కలిసి ఓ షాపులో షావర్మా తిన్నాడు. ఆ తర్వాత కడుపునొప్పితో వాంతులు చేసుకున్నాడు. మరుసటి రోజు వాంతులు ఆగకపోవడంతో అతని తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు.
అక్కడ చికిత్స పొందతూ ప్రతిమేశ్ మృతి చెందాడు. ఈ ఘటనపై ప్రతిమేశ్ భోక్సే కుటుంబ సభ్యులకు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో షవర్మా షాపు నడుపుతున్న ఆనంద్ కాంబ్లే, మహ్మద్ అహ్మద్ రెజా షేక్ అనే ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. షావర్మా శాంపిల్‌ను ల్యాబ్ కు పంపారు. గత నెల ఏప్రిల్ లో గోరేగావ్‌లోని చికెన్ షావర్మా తిన్న 12 మంది ఫుడ్ పాయిజన్‌తో ఆసుపత్రి పాలయ్యారు. కేరళలో కూడా ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి. కాబట్టి స్ట్రీట్ ఫుడ్ తినేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు.