హైదరాబాద్: ఏటీఎంలకు డబ్బు సరఫరా చేస్తున్న వాహనం నుంచి.. ఆ వాహనం డ్రైవర్ అజిత్(34) డబ్బులు ఎత్తుకెళ్లిన ఘటన కలకలం రేపింది. గచ్చిబౌలి పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడి దగ్గర నుంచి రూ.34 లక్షల 90 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. నార్సింగి డివిజన్ ఏసీపీ రమణ గౌడ్ ఈ కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. ఫిబ్రవరి 12న గోపన్ పల్లి తండాలో సంగం ఏజెన్సీకి సంబందించిన వెహికల్ ఏటీఎంలో డబ్బులు లోడ్ చేయడానికి వెళ్లింది.
డబ్బులు ఏటీఎంలో లోడ్ చేయడానికి సిబ్బంది వెళ్లారు. వాహనంలో మిగతా డబ్బులు ఉండడంతో అదే అదునుగా భావించి డబ్బుతో వెహికల్ డ్రైవర్ అజిత్ పరారయ్యాడు. తోటి సిబ్బంది అరా తీయగా దాదాపు రెండు గంటల పాటు వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ అజిత్ తప్పించుకున్నాడు. తెల్లాపూర్లోని గద్దర్ చౌరస్తా దగ్గర ఆటో మాట్లాడుకొని RTC క్రాస్ రోడ్డులోని ఓ లాడ్జిలో నిందితుడు తలదాచుకున్నాడు.
►ALSO READ | పాపం ఛాయ్ లవర్స్.. హైదరాబాద్లో టీ పొడిని ఎలా కల్తీ చేసి అమ్ముతున్నారో చూడండి !
ట్రంక్ పెట్టెలో ఉన్న డబ్బును బ్యాగ్లో వేసుకొని లాడ్జికి వెళ్లాడు. అనంతపురం నుంచి బళ్లారి, పూణె, బెంగుళూరు తదితర ప్రాంతాలకు నిందితుడు పారిపోయాడు. 3 బృందాలుగా ఏర్పడి శంషాబాద్ ఎయిర్ పోర్ట్లో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.22 లక్షల డబ్బును నిందితుడు జల్సాలకు ఖర్చు చేశాడు.
నిందితుడి దగ్గర నుంచి రూ.34 లక్షల 90 వేల డబ్బును స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. నిందితుడిని ట్రాక్ చేయడం చాలా ఇబ్బందిగా మారిందని, నిందితుడికి ఎవరితో సంబంధాలు లేకపోవడంతో పట్టుకోవడానికి సమయం పట్టిందని పోలీసులు పేర్కొన్నారు. అజాగ్రత్త వహించిన సంగం ఏజెన్సీపై కూడా చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.
