పాపం ఛాయ్ లవర్స్.. హైదరాబాద్లో టీ పొడిని ఎలా కల్తీ చేసి అమ్ముతున్నారో చూడండి !

 పాపం ఛాయ్ లవర్స్.. హైదరాబాద్లో టీ పొడిని ఎలా కల్తీ చేసి అమ్ముతున్నారో చూడండి !

హైదరాబాద్: కల్తీ టీ పొడి ముఠాను కమిషనర్ టాస్క్ ఫోర్స్, వెస్ట్ జోన్ పోలీసులు అరెస్ట్ చేశారు. టాస్క్ ఫోర్స్ (వెస్ట్ జోన్) బృందం, సనత్ నగర్ పోలీసులతో కలిసి సనత్ నగర్ పరిధిలోని ఓ ప్రాంతంలో తనిఖీలు చేశారు. సింథటిక్ రసాయనాలను ఉపయోగించి టీ పొడిని కల్తీ చేస్తున్న ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో నిందితుడు జగన్నాథ్ బిష్ణోయ్ అక్రమ లాభాల కోసం టీ పొడిని కల్తీ చేస్తున్నట్లు అంగీకరించాడు. కోకోపీట్ (కొబ్బరి పీచు పొడి)ను కొనుగోలు చేసి, అందులోని వ్యర్థాలను తొలగించి, వేడి బెల్లం నీటితో కలిపి రెండు మూడు రోజుల పాటు ఎండబెట్టేవాడు.

ఆ తర్వాత దానికి 'సన్‌సెట్ ఎల్లో', 'టార్ట్రాజైన్ ఆరెంజ్' లాంటి సింథటిక్ ఫుడ్ కలర్స్‌ను కలిపేవాడు. ఈ రంగులను పీల్చుకున్న మిశ్రమాన్ని తిరిగి ఎండబెట్టి కల్తీ ప్రక్రియలో ఉపయోగించేవాడు. ఒక కిలో కల్తీ టీ పొడిని తయారు చేయడానికి, నిందితుడు 450 గ్రాముల నాణ్యత లేని టీ డస్ట్, 500 గ్రాముల నాణ్యత లేని టీ గ్రాన్యూల్స్, 50 గ్రాముల రంగు కలిపిన కోకోపీట్‌ను మిక్స్ చేసేవాడు. ఈ కల్తీ టీ పొడిని అసలైన టీ పొడిగా నమ్మించి స్థానిక టీ స్టాళ్లకు, ఇతర డీలర్లకు భారీ ధరలకు విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

►ALSO READ | 10 నెలల్లో 14 వేల నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ పుల్ బాటిల్స్ సీజ్

ప్రజలు టీ పొడిని కేవలం గుర్తింపు పొందిన విక్రేతల వద్దే కొనుగోలు చేయాలని మరియు ఆహార కల్తీకి సంబంధించి ఏవైనా అనుమానాలు ఉంటే అధికారులకు ఫిర్యాదు చేయాలని పోలీసులు కోరారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ఆహార కల్తీకి పాల్పడే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు, క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.