కాలేజీల తప్పులకు విద్యార్థులను బలిచేయొద్దు.. పరీక్షలకు అనుమతించండి ..ఇంటర్‌ బోర్డుకు హైకోర్టు ఆదేశం

కాలేజీల తప్పులకు విద్యార్థులను బలిచేయొద్దు.. పరీక్షలకు అనుమతించండి ..ఇంటర్‌ బోర్డుకు హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: కాలేజీల  తప్పుకు విద్యార్థులను బలి చేయడం సరికాదని, వారికి పరీక్షలు రాసే అవకాశం కల్పించాలని ఇంటర్‌ బోర్డుకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థులకు కేవలం తమ చదువులపై ధ్యాస తప్ప కాలేజీలు, ఇంటర్‌ బోర్డు పనితీరుపై అవగాహన ఉండదని, కాలేజీలకు పరీక్ష ఫీజు చెల్లించినందున కాలేజీ హాల్‌టిక్కెట్‌లు అందిస్తుందనే భావనతోనే ఉంటారని తెలిపింది.

రాత పరీక్షలకు కొంత సమయం ఉన్నందున విద్యార్థుల ఆందోళనలోని వాస్తవికతను ధ్రువీకరించుకుని హాల్‌టిక్కెట్‌లు జారీ చేయడం బోర్డుకు పెద్ద సమస్య కాదని వ్యాఖ్యానించింది. పిటిషనర్లయిన విద్యార్థుల అంశాల్లోని వాస్తవికతను ధ్రువీకరించుకుని వారిని ఈ నెల 25 నుంచి మొదటి, 26 నుంచి రెండో సంవత్సరం ఇంటర్‌ పరీక్షలకు అనుమతించాలని ఇంటర్‌ బోర్డును ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అదేవిధంగా ఇప్పటికే ముగిసిన ప్రాక్టికల్స్‌ను ప్రత్యేక కేసుగా పరిగణించి మళ్లీ నిర్వహించడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.