మెహిదీపట్నం డిపో ముందు ఆర్టీసీ జేఏసీ ఆందోళన

మెహిదీపట్నం డిపో ముందు ఆర్టీసీ జేఏసీ ఆందోళన

హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ అధికారుల వేధింపుల వల్లే కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, వేధింపులకు పాల్పడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ జేఏసీ డిమాండ్​ చేసింది. మెహిదీపట్నం డిపో డ్రైవర్ అశోక్ ఆత్మహత్యకు కారణమైన అధికారులను సస్సెండ్ చేసి అరెస్ట్ చేయాలంటూ మంగళవారం మెహిదీపట్నం డిపో ముందు జేఏసీ నేతలు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఆర్టీసీ జేఏసీ వైస్ చైర్మన్, టీజేఎంయూ ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్ మాట్లాడుతూ.. అధికారుల వేధింపులతో చాలా మంది కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, సమ్మె టైంలో 38 మంది చనిపోగా, ఆ తర్వాత 25 మంది చనిపోయారని చెప్పారు.

పని గంటలు పెంచుతున్నారని, బదిలీ అడిగితే ఆబ్సెంట్ వేస్తూ జీతాల్లో కోత పెడుతున్నారని ఆరోపించారు. మైలేజ్ ఎక్కువ రావాలని డ్రైవర్లకు, రెవెన్యూ పెంచాలని కండెక్టర్లకు టార్గెట్లు ఇస్తున్నారని, ప్రశ్నిస్తే వేధిస్తున్నారని మండిపడ్డారు. రెండు పీఆర్సీలు, నాలుగు డీఏలు పెండింగ్ లో ఉన్నాయని, సీసీఎస్ డబ్బులు ఆర్టీసీ యాజమాన్యం వాడుకుంటోందని ఆరోపించారు. యూనియన్లను తొలగించి అధికారులు ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నారని, కార్మికులపై వేధింపులు మానుకోవాలని, లేకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు కమల్ రెడ్డి, సురేశ్‌, బుల్లెట్ పండు తదితరులు పాల్గొన్నారు.