సొంత నగరంపైనే రష్యా బాంబు దాడి

సొంత నగరంపైనే రష్యా బాంబు దాడి

మాస్కో: ఉక్రెయిన్ పై దాడి మొదలైన తర్వాత బాంబులు మిస్సైళ్లతో రష్యా ఆర్మీ విరుచుకుపడుతోంది. సరిహద్దుల్లోని ఉక్రెయిన్​ సిటీలపై తరచూ వైమానిక దాడులు చేస్తోంది. గురువారం కూడా ఉక్రెయిన్ నగరాలపై బాంబు దాడికి బయలుదేరిన రష్యన్ వార్ ప్లేన్ ఒకటి పొరపాటున తమసిటీపైనే దాడి చేసింది. ఉక్రెయిన్ సరిహద్దులకు 40 కిలోమీటర్ల దూరంలోని బెల్గొరోడ్​పై భారీ బాంబును జారవిడిచింది. బాంబు ప్రభావంతో ఓ అపార్ట్​మెంట్​ పక్కన 20 మీటర్ల గుంత ఏర్పడింది. బిల్డింగులు కంపించాయని, వెహికల్స్  ధ్వంసం అయ్యాయని, కొన్ని వాహనాలు గాల్లోకి ఎగిరిపడ్డాయని స్థానిక ప్రజలు తెలిపారు. ఈ దుర్ఘటనలో ముగ్గురు గాయపడ్డారని చెప్పారు. కాగా, సరిహద్దుల్లోని బెల్గొరోడ్​లో ఇప్పటి వరకు ఇంత శక్తిమంతమైన బాంబు దాడి 
జరగలేదని అధికారులు పేర్కొన్నారు.

ఉక్రెయిన్  పనే అనుకున్నరు..

బెల్గొరోడ్​పై బాంబు దాడికి పాల్పడింది ఉక్రెయిన్ ఎయిర్​ ఫోర్సేనని రష్యా మిలిటరీ అధికారులు తొలుత భావించారు. ఈ దాడికి ప్రతీకారంగా తీవ్ర స్థాయిలో దాడి చేస్తామని ప్రకటించారు. అయితే, రష్యా ఎయిర్ ఫోర్స్​కు చెందిన ఎస్​యూ 34 యుద్ధ విమానం పొరపాటున ఈ బాంబును జారవిడిచిందని రక్షణ శాఖ పేర్కొంది. ఇతర వివరాలేవీ రక్షణ శాఖ వెల్లడించలేదు. కాగా, పేలుడు తీవ్రతను బట్టి చూస్తే కనీసం 500 కిలోల బరువైన శక్తిమంతమైన బాంబును ఉపయోగించి ఉంటారని మిలిటరీ నిపుణులు చెప్పారు. మరోవైపు, బాంబు ధాటికి దెబ్బతిన్న భవనాల నుంచి స్థానికులను వేరే ప్రాంతానికి తరలించేందుకు అధికారులు ఏర్పాటు చేశారు.