ప్రధాని మోదీ అబద్ధాల మాస్టర్: సిద్ధరామయ్య

ప్రధాని మోదీ అబద్ధాల మాస్టర్:  సిద్ధరామయ్య

మైసూరు: ప్రధాని నరేంద్ర మోదీ అబద్ధాల మాస్టర్ అని కర్నాటక సీఎం సిద్ధ రామయ్య ఆరోపించారు. ప్రజలకిచ్చిన ఏ హామీలను ఆయన నెరవేర్చలేదని విమర్శించారు. ప్రధాని మోదీ అబద్ధాలు చెబుతూ మానసికంగా అణగదొక్కుతారనే విషయం ప్రజలకు అర్థమయ్యిందని తెలిపారు. ఇది తెలిసిన తర్వాత ప్రజలు ఆయనకు ఓటెయ్యరని చెప్పారు. శనివారం సిద్ధరామయ్య  మైసూరులో విలేకర్లతో మాట్లాడారు.

 ‘‘మోదీ గత పదేండ్లు ప్రధానిగా ఉన్నారు. పేదలకు ఆయన చేసిందేం లేదు. ఆయన ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి నెరవేర్చలేదు. అందువల్ల ఆయనను అబద్ధాల మాస్టర్ అని పిలుస్తున్నారు” అని పేర్కొన్నారు. ప్రతిపక్షంలోని కొంత మంది తనను సజీవంగా పాతిపెట్టాలని కోరుకుంటున్నారని, కానీ, దేశ ప్రజలే రక్షణ కవచంలా నిలుస్తారనే ప్రధాని వ్యాఖ్యలపై కూడా సిద్ధరామయ్య స్పందించారు.

 ప్రధాని మోదీని ఓడించడం తప్ప ఆయన శ్మశాన వాటికను నిర్మించాలని ఎవరు కోరుకోవడం లేదని వెల్లడించారు. ప్రధాని మోదీ హయాంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని, పేదల పరిస్థితి మెరుగుపడలేదని అందువల్ల విపక్షాలు ఆయనను ఓడించాలని కోరుకుంటాయని వివరించారు.