రష్యా వ్యాక్సిన్ పై ఎలాంటి నిర్ణయం చెప్పలేం: ఎయిమ్స్ డైరెక్టర్

రష్యా వ్యాక్సిన్ పై ఎలాంటి నిర్ణయం చెప్పలేం: ఎయిమ్స్ డైరెక్టర్

యావత్ ప్రపంచం కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు వణికిపోతున్న వేళ, ప్రజలు ప్రాణాలు మాస్కులో పెట్టుకుని జీవిస్తున్న వేళ మంగళవారం(ఆగస్టు-12,2020)  రష్యా అధ్యక్షుడు… తమ దేశం  కరోనా  వ్యాక్సిన్​ ను  సిద్ధం చేసిందంటూ ప్రకటించింది. ప్రపంచంలో అందరి కన్నా ముందు కరోనా వ్యాక్సిన్​ విడుదల చేసిన దేశం రష్యా.

అయితే రష్యా కరోనా వ్యాక్సిన్ సమర్థతపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఆల్‌ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌(ఎయిమ్స్‌) డైరెక్టర్‌ డాక్టర్ రణదీప్‌ గులేరియా స్పందించారు. రష్యా రూపొందించిన వ్యాక్సిన్ సమర్థతను ఇప్పుడే అంచనా వేయలేమని అన్నారు. ఈ వ్యాక్సిన్ భద్రత, దీని ప్రభావం తదితర అంశాలపై స్పష్టత లేదని, అప్పటివకు దీని గురించి ఎలాంటి నిర్ణయానికి రాలేమని చెప్పారు. ఎలాంటి దుష్ప్రభావాలు చూపనప్పుడే ఓ టీకా సురక్షితమైనదని చెప్పగలమని, అదే సమయంలో ఇమ్యూనిటీ కలిగించాలని తెలిపారు. అంతేకాదు వ్యాక్సిన్‌ను భారీగా ఉత్పత్తి చేసే సామర్థ్యం భారతదేశానికి ఉందని డాక్టర్‌ గులేరియా తెలిపారు.

రష్యాలోని గమాలేయా ఇన్ స్టిట్యూట్ తయారుచేసిన వ్యాక్సిన్ అన్ని దశలు దాటి, ఉత్పత్తికి సిద్ధమైందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించడం అన్ని దేశాలను ఆశ్చర్యానికి గురిచేసింది. ఆయన తన కుమార్తెకు కూడా వ్యాక్సిన్ ఇప్పించామని తెలిపారు. కరోనా వంటి క్లిష్టమైన వైరస్ ను కట్టడి చేసే వ్యాక్సిన్ ఇంత త్వరగా రావడం పట్ల సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.