ఫైనల్లో డ్రా: చరిత్ర సృష్టించిన సౌరాష్ట్ర

ఫైనల్లో డ్రా: చరిత్ర సృష్టించిన సౌరాష్ట్ర

రాజ్‌ కోట్‌: చివరి వరకు నువ్వానేనా అనేలా సాగిన రంజి ఫైనల్ ఫైట్ లో సౌరాష్ట్ర అద్భుత విజయం సాధించింది. దీంతో ఇప్పటివరకు కప్ కొట్టని సౌరాష్ట్ర రంజీ టీమ్ కొత్త రికార్డు సృష్టించింది. రంజీ చరిత్రలో ఫస్ట్ టైం టైటిల్‌ ను కైవసం చేసుకుని కొత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. రాజ్ కోట్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్ లో బెంగాల్‌ తో ఆడిన సౌరాష్ట్ర .. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో లభించిన 44 రన్స్ లీడ్ తో విక్టరీ కొట్టింది. రెండు టీమ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌ డ్రా కావడంతో మొదటి ఇన్నింగ్స్‌ ఆధారంగా సౌరాష్టను టైటిల్‌ వరించింది. శుక్రవారం చివరి రోజు ఆటలో బెంగాల్‌ తన తొలి ఇన్నింగ్స్‌లో 381 రన్స్ కు ఆలౌటైంది. దీంతో ఫస్ట్ ఇన్నింగ్స్‌ లో 425 రన్స్ చేసిన  సౌరాష్ట్ర విజేతగా నిలిచింది. ఆఖరి రోజు ఆట ముగిసే సమయానికి సౌరాష్ట్ర తన రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు కోల్పోయి 105 పరుగులు చేసింది. రంజీ ట్రోఫీలో నాకౌట్‌ మ్యాచ్‌లు డ్రా అయిన పక్షంలో విజేతను తొలి ఇన్నింగ్స్‌ ఆధారంగా ప్రకటించే సంగతి తెలిసిందే.

2020 రంజీ ట్రోఫీని ఎవరు గెలుస్తారనేదానిపై గురువారం వరకూ ఆసక్తికరంగా ఉండే. గురువారం ఆట ముగిసే సమయానికి బెంగాల్‌ 6 వికెట్లు కోల్పోయి 354 రన్స్ చేసింది. దీంతో శుక్రవారం మ్యాచ్ లో సౌరాష్ట్ర ఫస్ట్ ఇన్నింగ్స్‌ స్కోరును బెంగాల్‌ క్రాస్ చేస్తుందని అంతా భావించారు. కానీ సౌరాష్ట్ర బౌలర్ల అద్భుత ప్రదర్శనతో 27 రన్స్ వ్యవధిలో 4 వికెట్లను కోల్పోయింది బెంగాల్‌. ఓవర్‌ నైట్‌ ప్లేయర్ మజుందార్‌(63) ఏడో వికెట్‌ గా ఔటయ్యాడు. ఆ తర్వాత అమాబ్‌ నంది(40 నాటౌట్‌)గా నిలిచినా.. మిగతా వారు వరుస పెట్టి క్యూకట్టేయడంతో బెంగాల్‌ కు ఓటమి తప్పలేదు. అయితే కరోనా ఎఫెక్ట్ తో స్టేడియంలో ప్రేక్షకులు లేకుండానే ఈ ఫైనల్ మ్యాచ్ జరిగింది.