దేశద్రోహ చట్టం రద్దు అవసరం లేదు

దేశద్రోహ చట్టం రద్దు అవసరం లేదు
  • గైడ్ లైన్స్ ఇస్తే చాలు: సుప్రీంకోర్టుకు కేంద్రం వినతి  
  • రాజ్యాంగ ధర్మాసనానికి కేసు బదిలీని పరిశీలిస్తామన్న కోర్టు 

న్యూఢిల్లీ: దేశ ద్రోహ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేయాలా?వద్దా? అనే దానిని పరిశీలిస్తామని సుప్రీంకోర్టు గురువారం స్పష్టం చేసింది. దేశద్రోహ చట్టం 124ఏ రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా, మాజీ మేజర్ జనరల్ ఎస్జీ వాంబత్ కెరె, మరికొందరు నిరుడు జులైలో పిటిషన్లు వేశారు. వీటిపై తాజాగా విచారణ చేపట్టిన సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ బెంచ్.. ఈ చట్టాన్ని ఎందుకు రద్దు చేయట్లేదని కేంద్రాన్ని ప్రశ్నించింది. దీంతో ఈ చట్టాన్ని రద్దు చేయాల్సిన అవసరం లేదని, గైడ్ లైన్స్ ఇస్తే చాలని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ తెలిపారు. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందిస్తూ.. దీనిపై డ్రాఫ్ట్ అఫిడవిట్ కు ఇంకా కేంద్ర ఆమోదం లభించలేదని, అందుకు ఇంకాస్త టైం కావాలని కోరారు. దీంతో సోమవారం ఉదయానికల్లా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రాన్ని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ మే 10న మధ్యాహ్నం చేపడతామని స్పష్టం చేసింది. ఈ కేసులో మరిన్ని వాయిదాలు ఇవ్వడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది.