విష జ్వరాలు ప్రబలుతున్నాయి

విష జ్వరాలు ప్రబలుతున్నాయి
  • గడిచిన వారంలో 13 వేలకు పైగా అనుమానిత కేసులు
  • ఇటీవల డెంగీ లక్షణాలతో యువకుడి మృతి
  • వర్షాలు, వరదలతో పెరుగుతున్న జ్వరాలు ​
  • ఊళ్లలో ఫాగింగ్​ చేయట్లే.. దోమ తెరలు ఇయ్యట్లే.. ​
  • పీహెచ్​సీలలో డాక్టర్లు లేక ప్రైవేట్​కు బాధితులు 
  • డెంగీ పేరుతో దవాఖాన్ల దోపిడీ 

కరీంనగర్ / నెట్​వర్క్, వెలుగు: రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల కారణంగా డెంగీ, మలేరియా, టైఫాయిడ్ లాంటి విష జ్వరాలు ప్రబలుతున్నాయి. దోమల వల్ల డెంగీ, మలేరియా ప్రబలుతుంటే.. కలుషిత ఆహారం టైఫాయిడ్​కు కారణమవుతోంది. జనవరి నుంచి ఈ నెల 12 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1,184 డెంగీ కేసులు, 203 మలేరియా , 2,752 టైఫాయిడ్ కేసులు నమోదయ్యాయని పబ్లిక్ హెల్త్‌‌ డైరెక్టర్‌‌‌‌ శ్రీనివాసరావు ఇటీవల ప్రకటించారు. ప్రభుత్వం ఇప్పటికే యాంటీ లార్వా ఆపరేషన్లు, దోమ తెరల పంపిణీ చేపట్టిందని చెప్పారు. కానీ క్షేత్రస్థాయిలో చాలా పట్టణాలు, గ్రామాల్లో ఫాగింగ్ చేయట్లేదు. ఇక ఏజెన్సీలో గిరిజనులకు సైతం ఇప్పటి వరకు దోమ తెరలు పూర్తి స్థాయిలో అందలేదు. దీంతో డీహెచ్ ప్రకటన​తర్వాత కూడా గడిచిన వారం రోజుల్లో ఏకంగా 13 వేలకు పైగా డెంగీ అనుమానిత కేసులు, 40 వేలకు పైగా ఫీవర్ కేసులు నమోదైనట్టు ఆరోగ్యశాఖ లెక్కలు చెప్తున్నాయి. దీన్ని బట్టి రాష్ట్రంలో డెంగీ, వైరల్​ ఫీవర్స్​ తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. 

ఆస్పత్రులు కిటకిట... 

ఇండ్ల చుట్టూ నీళ్లు నిలిచిపోవడం, డ్రైనేజీలు నిండిపోవడం, ఓపెన్​ ప్లాట్లన్నీ మురికి కుంటల్లా మారడంతో దోమలు వృద్ధి చెంది డెంగీ విజృంభిస్తోంది. ఈ ఏడాది డేంజర్ బెల్స్ మోగిస్తోంది. 2019 తర్వాత ఈ ఏడాదే కేసుల్లో పెరుగుదల నమోదవుతోంది. జూన్​లోనే  565  డెంగీ కేసులు నమోదు కాగా,  జులైలో తొలి పది రోజుల్లోనే 222 కేసులు వచ్చాయి. గడిచిన వారంలో 13 వేలకు పైగా డెంగీ సస్పెక్టెడ్ కేసులు రావడం ఆరోగ్యశాఖను ఆందోళనకు గురిచేస్తోంది. సోమవారం మెదక్ జిల్లా శివ్వంపేట మండలం శభాష్  పల్లికి చెందిన శరత్(21)  డెంగీ లక్షణాలతో చనిపోవడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఇప్పటికే హైదరాబాద్​లోని ఉస్మానియా, నిమ్స్, ఫీవర్​ హస్పిటల్, వరంగల్​ ఎంజీఎం, ఆదిలాబాద్​ రిమ్స్​సహా జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్​ఆసుపత్రులన్నీ జ్వర బాధితులతో కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా గ్రామాల్లో జ్వరాల ప్రభావం ఎక్కువగా ఉండడంతో రోగులు పీహెచ్​సీల బాట పడ్తున్నారు. కానీ రాష్ట్రంలోని పీహెచ్​సీలలో 700కు పైగా డాక్టర్​ పోస్టులు ఖాళీగా ఉండడంతో దిక్కులేక  ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా ప్రైవేట్​ఆస్పత్రులు అందినకాడికి దండుకుంటున్నాయి. ముఖ్యంగా డెంగీ పేరుతో ప్లేట్​లెట్స్​తగ్గాయని భయపెడ్తూ దోపిడీ చేస్తున్నాయి. టెస్టుల పేరుతోనే వేలకు వేలు గుంజుతున్నాయి. కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం సిటీల్లోని పలు ప్రైవేట్​ఆసుపత్రులు డెంగీ ట్రీట్ మెంట్ పేరుతో డిశ్చార్జి నాటికి ఒక్కొక్కరికి రూ.లక్షకు పైగా బిల్లు వేస్తున్నాయి. ట్రీట్ మెంట్ అందించినంక ఏమాత్రం సీరియస్​ అయినా హైదరాబాద్ కు రిఫర్​ చేసి చేతులు దులుపుకుంటున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

ఫాగింగ్ చేస్తలేరు.. దోమ తెరలు ఇస్తలేరు.. 

ఈ సీజన్​లో డెంగీ కేసులు పెరిగే ప్రమాదముందని ఆరోగ్య శాఖ ముందే హెచ్చరించినా... దోమల నివారణకు మున్సిపల్, పంచాయతీరాజ్ డిపార్ట్‌‌‌‌మెంట్లు పెద్దగా చర్యలు చేపట్టలేదు. హైదరాబాద్​కు దగ్గర్లో ఉండే పట్టణాల్లో తప్ప పల్లెల్లో ఫాగింగ్ చేయడం లేదు. చాలా గ్రామాల్లో మిషిన్లు లేకపోవడం, ఉన్నచోట దెబ్బతినడం వల్లే ఫాగింగ్ చేయలేకపోతున్నామని ఆయా గ్రామాల సర్పంచులు చెప్తున్నారు. 

నీళ్లు నిల్వ ఉంచవద్దు

ఏడిస్​ఈజిప్టి( టైగర్) అనే దోమ కాటు వల్ల డెంగీ వస్తుంది. ఈ దోమలు ఇంటి చుట్టుపక్కల ఉన్న నిల్వ నీటిలో ఉంటాయి. అందువల్ల ఇంట్లో, చుట్టుపక్కల ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలి. పాత ట్యాంకులు, టైర్లు, డ్రమ్ములు, కూలర్లలో నీళ్లు పారబోసి బోర్లేసి ఉంచాలి. వాటర్​ట్యాంకులు, తాగునీటి బిందెలపై మూతపెట్టి ఉంచాలి. వానాకాలం దోమతెరలను వాడడం మంచిది.

- డాక్టర్​వి.జ్యోతి, ఆర్ఎంఓ, 
సివిల్ హాస్పిటల్, కరీంనగర్