నిఫ్టీ 118 పాయింట్లు అప్​

నిఫ్టీ 118 పాయింట్లు అప్​

ముంబై:  బ్యాంకింగ్, ఐటీ, మెటల్ షేర్లలో కొనుగోళ్లు ఊపందుకోవడంతో సెన్సెక్స్, నిఫ్టీ వరుసగా రెండో రోజైన మంగళవారం లాభాల్లో ముగిశాయి. ప్రపంచ మార్కెట్లు బాగుండటం కూడా వీటికి కలసివచ్చింది. బీఎస్‌‌ఈ సెన్సెక్స్ 361.01 పాయింట్లు పెరిగి 60,927.43 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో ఇది 420.26 పాయింట్లు పుంజుకుని 60,986.68 వద్దకు చేరుకుంది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ 117.70 పాయింట్లు  పెరిగి 18,132.30 వద్ద ముగిసింది. సెన్సెక్స్ ప్యాక్ నుండి, టాటా స్టీల్, టాటా మోటార్స్, లార్సెన్ & టూబ్రో, ఏషియన్ పెయింట్స్, విప్రో, బజాజ్ ఫైనాన్స్, ఐసిఐసిఐ బ్యాంక్, టెక్ మహీంద్రా,  టైటాన్ టాప్​ గేనర్లుగా నిలిచాయి. హిందుస్థాన్ యూనిలీవర్, ఐటీసీ, మహీంద్రా అండ్ మహీంద్రా, నెస్లే వెనుకబడ్డాయి. బీఎస్‌‌ఈ స్మాల్‌‌క్యాప్ గేజ్ 1.46 శాతం,  మిడ్‌‌క్యాప్ ఇండెక్స్ 0.78 శాతం పెరిగింది. సెక్టోరల్ ఇండెక్స్‌‌లలో, మెటల్ 4.59 శాతం, కమోడిటీలు 2.34 శాతం, టెలికమ్యూనికేషన్ (1.54 శాతం), ఇండస్ట్రియల్స్ (1.38 శాతం), రియల్టీ (1.38 శాతం), పవర్ (1.15 శాతం) పెరిగాయి. ఎఫ్​ఎంసీజీ మాత్రమే వెనుకబడింది.

ఆసియాలోని ఇతర ప్రాంతాల్లో సియోల్, టోక్యో, షాంఘైలో ఈక్విటీ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. ఐరోపాలోని ఈక్విటీ ఎక్స్ఛేంజీలు మిడ్-సెషన్ డీల్స్‌‌లో సానుకూలంగానే ఉన్నాయి. సోమవారం అమెరికా మార్కెట్లు పనిచేయలేదు. అంతర్జాతీయ చమురు బెంచ్‌‌మార్క్ బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌‌ ధర 0.49 శాతం పెరిగి 84.33 డాలర్లకు చేరుకుంది. గ్లోబల్ మార్కెట్ల నుంచి బలమైన మద్దతుతో, దేశీయ మార్కెట్ నష్టాల నుంచి కోలుకోవడానికి  ప్రయత్నిస్తోందని  జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ అన్నారు. కోవిడ్ పరిమితులను సడలిస్తున్నట్లు వార్తల కారణంగా చైనాలో డిమాండ్ పునరుద్ధరణ ఉంటుందనే ఆశల మధ్య మెటల్ స్టాక్స్ మెరిశాయని అన్నారు.