జ‌ర్న‌లిస్ట్‌ అత్యాచారం కేసు: శిక్షను మార్చేసిన హైకోర్టు

జ‌ర్న‌లిస్ట్‌ అత్యాచారం కేసు: శిక్షను మార్చేసిన హైకోర్టు

ముంబై : 2013 నాటి సామూహిక అత్యాచారం కేసులో ముగ్గురు నిందితులకు విధించిన మరణశిక్షను బాంబే హైకోర్టు జీవిత ఖైదుగా మార్చింది. 2013లో ముంబైలోని శ‌క్తి మిల్స్‌లో ఫోటో షూట్ కోసం ఓ వ్య‌క్తితో క‌లిసి వెళ్లిన 22 ఏళ్ల ఫోటో జ‌ర్న‌లిస్ట్‌పై ముగ్గురు నిందితులు అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితులు విజరు జాదవ్‌, మొహమ్మద్‌ ఖాసిమ్‌ షేక్‌, మొహమ్మద్‌ అన్సారీలు ఈ నేరానికి పాల్పడ్డారు. వారు పశ్చాత్తాప పడేందుకు జీవిత ఖైదు సరైన శిక్ష అని డివిజన్‌ బెంచ్‌ అభిప్రాయం వ్యక్తం చేసింది. అత్యాచారం మానవ హక్కుల ఉల్లంఘన అని, ఈ నేరం సమాజంలోని పలువురిని మనస్సాక్షిని దిగ్భ్రాంతికి గురిచేసిందనే వాస్తవాన్ని విస్మరించలేమని జస్టిస్‌ సధనా జాదవ్‌, పృధ్వీరాజ్‌ చవాన్‌లు పేర్కొన్నారు. మరణ శిక్షతో పశ్చాత్తాపానికి అవకాశం ఉండదని ధర్మాసనం పేర్కొంది. దోషులను పెరోల్‌ మీద సమాజంలో తిరిగేందుకు అనుమతించకూడదని అన్నారు. అయితే కేవ‌లం ప్ర‌జాగ్ర‌హం తీర్పు ను ప్ర‌భావితం చేయ‌రాద‌ని వ్యాఖ్యానించింది. నిందితుల్లో ముగ్గురు మ‌రో సామూహిక లైంగిక దాడి కేసులోనూ దోషులుగా తేల‌డం గ‌మ‌నార్హం.