Farm house case : ఫాం హౌస్ కేసులో సిట్ వర్సెస్ సీబీఐ

Farm house case : ఫాం హౌస్ కేసులో సిట్ వర్సెస్ సీబీఐ
  • ఐదు సార్లు లెటర్లు రాసినా నో రెస్పాన్స్
  • సీఎస్ కేస్ ఫైల్ ఇవ్వకపోయినా ఎఫ్ఐఆర్
  • హైకోర్టును ఆశ్రయించేందుకూ సిద్ధం
  • ఈ వారంలో మరిన్ని కీలక పరిణామాలు 

హైదరాబాద్‌ : ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సీబీఐ దూకుడు పెంచింది. కేసు ఫైల్స్‌ను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నాలు చేస్తుండడంతో చివరి అస్త్రాన్ని సంధించేందుకు సిద్ధమవుతోంది. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా దర్యాప్తు చేసేందుకు యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకుంటున్నది. ఐదు లెటర్స్‌ రాసినప్పటికీ చీఫ్‌ సెక్రటరీ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో కేస్ ఫైల్స్‌ కోసం సీబీఐ అధికారులు హైకోర్టును ఆశ్రయించే అవకాశాలున్నాయి.

కోర్టు ధిక్కరణలో సీఎస్‌

కోర్టు ఆదేశాలను అమలు చేయని సీఎస్‌పై కోర్ట్ ధిక్కరణ ఆంశం కూడా తెరపైకి రానుంది. కేస్‌ ఫైల్స్ ట్రాన్స్‌ఫర్ చేయకపోవడంతో డైరెక్ట్‌గా ఎఫ్‌ఐఆర్ రిజిష్టర్ చేసేందుకు సీబీఐ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. సీఎస్‌కు ఐదుసార్లు లెటర్స్‌ రాయడం సీబీఐ లీగల్ యాక్షన్‌లో భాగమేనని న్యాయ నిపుణులు అంటున్నారు.అయితే సుప్రీంకోర్ట్‌లో ఈ నెల17న విచారణ జరుగనుండడంతో ఈ వారం చివరిలో కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది.

తప్పించుకునేందుకు ఎత్తులు!

సింగిల్‌ జడ్జి బెంచ్‌, హైకోర్ట్‌ చీఫ్ జస్టిస్ట్‌ బెంచ్‌ దర్యాప్తునకు ఓకే చెప్పినా ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నదని సీబీఐ అనుమానిస్తున్నదని తెలిసింది. ఇందులో భాగంగానే తమకు కేస్ ఫైల్స్ ఇవ్వడం లేదని సమాచారం. ఫైల్స్‌ ఇచ్చినా, ఇవ్వకపోయినా కేసు నమోదు చేసి దర్యాప్తు చేసేందుకు సీబీఐ ఏర్పాట్లు చేసుకుంటున్నది. సిట్‌ సేకరించిన ఆధారాలను హైకోర్టు ద్వారనే సేకరించేందుకు సీబీఐ చర్యలు ప్రారంభించింది. ఇదే జరిగితే సీఎస్ సహా సిట్ అధికారులంతా కోర్టు ధిక్కారం చిక్కుల్లో పడిపోయే ప్రమాదం ఉంది.