హర్యానాలో ప్రభుత్వ ఉద్యోగులకు స్మార్ట్ వాచీలు

హర్యానాలో ప్రభుత్వ ఉద్యోగులకు స్మార్ట్ వాచీలు
  • బయోమెట్రిక్ హాజరు బదులు.. ఆఫీసు వేళల్లో ఉద్యోగుల విధులు, కదలికల ట్రాకింగ్

గురుగ్రామ్:  ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులకు జీపీఎస్ ఆధారిత స్మార్ట్ వాచీలు ఇవ్వాలని హర్యానా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉద్యోగుల హాజరు కోసం ఇప్పటి వరకు ఉపయోగిస్తున్న బయోమెట్రిక్ అటెండెన్స్ విధానాన్ని పూర్తిగా ఎత్తేసి స్మార్ట్ వాచీల ద్వారా వారి హాజరు.. విధుల నిర్వహణ గురించి ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఈ కొత్త విధానం అమలు చేయాలని నిర్ణయించింది.

ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ శనివారం సోహ్నాలోని సర్మత్లా గ్రామంలో ‘వికాస్’ ర్యాలీలో ప్రసంగిస్తున్నప్పుడు ఈ ప్రకటన చేశారు. "రాష్ట్రంలోని ప్రభుత్వ అధికారులందరూ స్మార్ట్ వాచీలను ధరిస్తారు, కార్యాలయ సమయాల్లో వారి కదలికలను ట్రాక్ చేస్తుంది.. అలాగే హాజరును ప్రామాణికంగా గుర్తించడానికి ఒక సాధనంగా ఉపయోగపడుతుంది" అని పేర్కొన్నారు. స్మార్ట్ వాచీ ధర ఒక్కొక్కటి 7వేల నుంచి 8వేల రూపాయలు అవుతుందని.. దీనికి అయ్యే ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని సీఎం మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ వెల్లడించారు.

హాజరుకు కూడా ఈ వాచీలను ప్రామాణికంగా తీసుకోనున్నారు. ఉద్యోగ సమయంలో ఉద్యోగుల మూవ్‌మెంట్‌పై వంద శాతం నిఘా వేసేందుకు దీనివల్ల వీలవుతుందని భావిస్తున్నారు. కోవిడ్‌ సమయంలో బయో మెట్రిక్‌ మెషిన్లను వాడటం మానేశారని.. స్మార్ట్ వాచీలు ఇచ్చాక వాటిని తొలగిస్తామని ఖట్టర్‌ చెప్పారు.