పెరిగిన పోలీసుల నిఘా.. కొత్త దారుల్లో గంజాయి  దందా

పెరిగిన పోలీసుల నిఘా.. కొత్త దారుల్లో గంజాయి  దందా

గంజాయి  స్మగ్లర్స్  రూట్ మార్చారు . రోడ్డు  రవాణాపై  పోలీసుల  నిఘా పెరగటంతో  కొత్త దారుల్లో  గంజాయి  దందాను  సాగిస్తున్నారు.  ఇప్పుడు  ముఠాలు  రైళ్ల ద్వారా గంజాయ్  రవాణా  మొదలుపెట్టారు. ఎత్తుకు  పైఎత్తు  వేస్తూ  పోలీసులకు స్మగ్లర్లు సవాల్ విసురుతున్నారు.

గత కొన్నాళ్లుగా రాష్ట్రంలో గంజాయి అమ్మకాలు విచ్చలవిడిగా పెరిగిపోయాయి. ఈ మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ముఠాలను అడ్డుకునేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. డ్రగ్స్ తో పాటు... గంజాయి లాంటి మత్తు పదార్థాలపై వరుసగా పోలీసులు దాడులు చేస్తున్నారు. మత్తు పదార్ధాలు, నిషేధిత గుట్కా, గంజాయి అమ్మకాలపై నిఘా పెంచి పాన్ షాపులపై కేసులు పెడుతున్నారు. వీటిని అమ్ముతున్న వారిని అరెస్ట్ చేస్తున్నారు. హైదరాబాద్ , సైబరాబాద్ , రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలోని పాన్ షాపులు, కిరాణా షాపులతో పాటు ఇతర ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నారు. ఎక్సైజ్ , పోలీసు అధికారులు, సిబ్బంది ఆకస్మిక దాడులు నిర్వహిస్తున్నారు. నగర శివారు ప్రాంతాలతో పాటు సిటీలోనూ ప్రతి రోజూ రైడ్స్ జరుగుతున్నాయి. అలాగే హైదరాబాద్‌లోకి నిషేధిత మత్తుపదార్థాలు రాకుండా తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ధూల్ పేట్ లాంటి ఏరియాల్లో ప్రత్యేకంగా కాలినడకన తిరుగుతూ పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. గతంలో గంజాయి అమ్మి అరెస్టయి జైలుకు వెళ్లి వచ్చిన వారిపై ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.  ఆంధ్రప్రదేశ్ , ఒడిశా, కర్నాటక, మహారాష్ట్ర నుంచి రాకపోకలు జరిగే రోడ్డు మార్గాల్లో తనిఖీలు ముమ్మరం అయ్యాయి.  

ఇప్పటి వరకు గంజాయి రవాణాదారులు, వారి నుంచి కొనేవాళ్లు మాత్రమే పోలీసులకు దొరికారు. ఆన్ లైన్  సేవలు చేస్తున్న సంస్థలు, రవాణా చేసే వారిపైనా ఫోకస్  పెట్టారు. ఓలా, ఊబర్  లాంటి క్యాబ్  డ్రైవర్లపైనా దృష్టిపెట్టారు. కమిషనరేట్‌లోని టాస్క్ ఫోర్స్ , సీసీఎస్ , ఎస్ వోటీలు, ఎస్బీ, ఆర్మూడ్  రిజర్వు ఫోర్స్ , స్థానిక పోలీసులతో బృందాలను ఏర్పాటు చేశారు. పెట్రోలింగ్ , బ్లూకోల్ట్స్  సిబ్బంది కూడా పటిష్టంగా పనిచేయాలని పోలీస్  కమిషనర్లు ఆదేశించారు. 

గంజాయి ముఠాలు వరుసగా పట్టుబడుతుండటంతో రూట్ మార్చాయి. రోడ్డు మార్గాల్లో దొరికిపోతుండటంతో రైళ్లల్లో గంజాయి దందాను కొనసాగిస్తున్నారు. రోడ్డు మార్గాల్లో అయితే పోలీసుల తనిఖీలు, చెక్ పోస్టులు ఎక్కువగా ఉంటాయి. అదే రైళ్లల్లో తనిఖీలు తక్కువగా ఉంటాయని భావిస్తున్నాయి ముఠాలు. కొందరు గంజాయి నిందితులను అరెస్ట్ చేసి.. కస్టడీలోకి తీసుకొని పోలీసులు ప్రశ్నించినప్పుడు ఈ విషయాలు బయటపడ్డాయి. దాంతో రైల్వే, లా అండ్ ఆర్డర్ పోలీసులు, ఎక్సైజ్ అధికారులు అలెర్ట్ అయ్యారు. ఇక నుంచి అన్ని విభాగాల అధికారుల సమన్వయంతో రైళ్లల్లోనూ తనిఖీలను పెంచాలని నిర్ణయించారు. రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి అమ్మకాలు కొనసాగకుండా చర్యలు తీసుకుంటామంటున్నారు.