హైదరాబాద్, వెలుగు: రేవంత్‌రెడ్డి సీఎం కావాలని లక్ష్యం పెట్టుకుని రీచ్అయ్యారని, అంత ఈజీగా ఆయన ఆ పదవిని వదులుకోరని బీఆర్ఎస్ఎమ్మెల్యే దానం నాగేందర్అన్నారు. కాంగ్రెస్‌లో సీనియర్లంతా రిటైర్అవుతారని, తానే సీఎం అని రేవంత్ రెండేండ్ల కిందనే చెప్పారని పేర్కొన్నారు. గురువారం అసెంబ్లీ ఆవరణలో దానం మీడియాతో చిట్చాట్చేశారు. పరిపాలనలో రేవంత్చాలా జాగ్రత్తగా ముందుకెళ్తున్నారని ఆయన అన్నారు. ‘‘బీఆర్ఎస్ఎమ్మెల్యేల్లో కొందరు ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నారు. ఆరు నెలల్లో ప్రభుత్వం పడిపోతుందని అనడం సరికాదు. కొత్త ప్రభుత్వం కుదురుకోవడానికి సమయం ఇవ్వాలని కేసీఆరే చెప్పారు” అని పేర్కొన్నారు. ‘‘అసెంబ్లీలో శ్వేతపత్రాలు పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం గెలుక్కున్నట్టుగా ఉంది. గత బీఆర్ఎస్ప్రభుత్వాన్ని గెలికి తిట్టించుకున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం పెట్టి సభలో ప్రభుత్వం డిఫెన్స్‌లో పడింది. హరీశ్‌రావు, కేటీఆర్‌లకు కాంగ్రెస్మంత్రుల కౌంటర్లు సరిపోవడం లేదు. మంత్రులు సభకు విషయం చెప్పకుండా ఏదేదో మాట్లాడుతున్నారు. తెలంగాణ అప్పులతో దివాలా తీసిందనే ఇండికేషన్వెళ్తే రాష్ట్ర భవిష్యత్ప్రమాదంలో పడుతుంది. పథకాల అమలు ఆలస్యం చేసేందుకే శ్వేతపత్రం ప్రవేశపెట్టినట్టుగా అనిపిస్తోంది. ఇరిగేషన్‌పై శ్వేతపత్రం పెడితే ప్రభుత్వం డిఫెన్స్‌లో పడుతుంది” అని అన్నారు.
