అశోక్ గెహ్లాట్కు దొరకని సోనియా అపాయింట్ మెంట్

అశోక్ గెహ్లాట్కు దొరకని సోనియా అపాయింట్ మెంట్

రాజస్థాన్ లో తలెత్తిన పరిణామాల వల్ల ఆ రాష్ట్ర సీఎం అశోక్  గెహ్లాట్ ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకున్నారు. కానీ గెహ్లాట్ కు అపాయింట్ మెంట్ దక్కలేదని పార్టీ వర్గాలు తెలిపాయి. మరోవైపు సీనియర్ నేత ఏకే ఆంటోనీతో సోనియా గాంధీ భేటీ అయ్యారు. అశోక్ గెహ్లాట్ ఢిల్లీకి వచ్చేముందు రాజస్థాన్  గవర్నర్  కల్రాజ్  మిశ్రతోనూ ఫోన్లో మాట్లాడారు. ఇంతవరకు గెహ్లాట్ పై వేరే రిమార్క్స్ లేకపోయినా.. ఎమ్మెల్యేల తిరుగుబాటు విషయం ఆయనకు తెలియకుండా జరిగింది కాదని హైకమాండ్ భావిస్తోంది. ఈ పరిస్థితుల్లో కేంద్ర మాజీ మంత్రి ఏకే ఆంటోనీ, మరికొందరు సీనియర్  నేతలతో సోనియా గాంధీ మాట్లాడారు.

పార్టీలో ఇంటర్నల్ పాలిటిక్స్ జరుగుతూంటాయని.. వాటిని తామే పరిష్కరించుకుంటామని  గెహ్లాట్ అన్నారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, కేంద్ర నియంతృత్వ వైఖరిపై రాహుల్ గాంధీ ఆందోళన చెందుతున్నారని అన్నారు. కాంగ్రెస్ చీఫ్ ఆధ్వర్యంలోనే నేతలందరూ పనిచేస్తున్నారన్నారు. దాని ప్రకారమే నిర్ణయాలు తీసుకుంటామన్నారు. మరోవైపు రాజస్థాన్ సంక్షోభానికి కారణమైన గెహ్లాట్ విధేయులు.. ముగ్గురికి  హైకమాండ్ షోకాజ్ నోటీసులు అందజేసింది. క్రమశిక్షణ చర్యలు ఎందుకు తీసుకోవద్దో వివరణ ఇవ్వాలని ఆదేశించింది.