10 వేల పెట్రోల్ కొంటే... రెండు రోజులు కూడా రావట్లే

10 వేల పెట్రోల్ కొంటే... రెండు రోజులు కూడా రావట్లే

కొలొంబో: పెట్రోల్ కోసం తాను రెండు రోజులు లైన్ లో నిల్చున్నట్లు శ్రీలంక క్రికెటర్ చామికా కరుణరత్నె తెలిపాడు. ఆర్ధిక సంక్షోభంతో శ్రీలంక అల్లాడుతున్న విషయం తెలిసిందే. నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటగా...  పెట్రోల్, డీజిల్ రేట్ల గురించి అయితే మాట్లాడలేని పరిస్థితి ఆ దేశంలో నెలకొంది. దీంతో సామాన్యుల నుంచి సెలెబ్రిటీల వరకు చాలా ఇబ్బందిపడుతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి పరిస్థితులపై శ్రీలంక యువ క్రికెటర్  చామికా కరుణరత్నె స్పందించాడు. క్లబ్ క్రికెట్ లో పాల్గొనేందుకు... ప్రాక్టీస్ కోసం కొలొంబోతో పాటు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుందని, అయితే పెట్రోల్ దొరక్క ఇబ్బంది పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశాడు.  

పెట్రోల్ కోసం రోజుల కొద్దీ  బంకుల ముందు నిలబడాల్సి వస్తోందని వాపోయాడు. పది వేలు పెట్టి పెట్రోల్ కొనుగోలు చేస్తే... కనీసం రెండు రోజులు కూడా రావడంలేదని పేర్కొన్నాడు. ఇకపోతే భారత్ తమకు చాలా సాయం చేస్తోందని, అందుకు తాము రుణపడి ఉంటామని తెలిపాడు. త్వరలోనే తమ దేశం ఈ విపత్తు నుంచి బయటపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇప్పటి వరకు చామికా కరుణరత్నె శ్రీలంక తరపున 1 టెస్ట్, 18 వన్డే, 25 టీ20 మ్యాచుల్లో ప్రాతినిధ్యం వహించి... మంచి ప్రతిభ కనబరిచాడు.