దళిత యువకుణ్ని బూటు కాలితో తన్నిన సీఐ సస్పెండ్

దళిత యువకుణ్ని బూటు కాలితో తన్నిన సీఐ సస్పెండ్

శ్రీ‌కాకుళం: జిల్లాలోని కాశీబుగ్గ సీఐ వేణుగోపాల్‌ను పోలీస్ ఉన్న‌తాధికారులు స‌స్పెండ్ చేశారు. ప‌లాస మండ‌లం టెక్క‌లి ప‌ట్నంకు చెందిన ర‌మేష్, జ‌గ‌న్ అనే యువ‌‌కుల మధ్య వారి గ్రామంలో గొడవ జ‌రిగింది. ఇద్ద‌రూ ప‌ర‌స్ప‌రం కాశీబుగ్గ పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేసుకున్నారు. ఈ విష‌యమై పోలీస్ స్టేష‌న్‌కు వ‌చ్చిన జ‌‌గ‌న్ అనే ద‌ళితుడుని సీఐ వేణుగోపాల్ బూటుకాలితో త‌న్నారు. ఈ ఘ‌ట‌న వీడియో క్లిప్పింగ్‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. ప్రతిపక్షాలతోపాటు.. స్వయంగా ఉప ముఖ్యమంత్రి ధర్మాన కష్ణ దాస్ మండిపడ్డారు. ఘటన జరగడం బాధాకరమని విచారం వ్యక్ చేసిన ఆయన సమగ్ర విచారణ జరిపి చర్యలు  తీసుకోవాలని… వెంటనే ప్రాథమిక విచారణ జరిపి నివేదిక సమర్పించాలని  విశాక రేంజ్ డీఐజీ,శ్రీకాకుళం జిల్లా ఎస్పీలను ఆదేశించారు.

ప్రతిపక్ష నేత చంద్రబాబు సహా ఇతరులు  విమర్శలు గుప్పిస్తుండడాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ… దళితుల రక్షణకు ప్రభుత్వం కట్టుబడిఉందని పేర్కొన్నారు. ఆ దిశలోనే చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణ దాస్ ఆదేశాలు.. ప్రతిపక్షాల విమర్శల నేపధ్యంలో పోలీసు శాక ఆఘమేఘాల మీద స్పందించింది. వివాదం తీవ్రతను తగ్గించేందుకు ముందుగా సీఐ వేణుగోపాల్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.