వేల కోట్ల నష్టం?: 4 యూనిట్లూ పూర్తిగా డ్యామేజ్?

వేల కోట్ల నష్టం?: 4 యూనిట్లూ పూర్తిగా డ్యామేజ్?

4 రోజుల్లోక్లారిటీ వస్తుందంటున్న నిపుణులు

నాగర్ కర్నూల్, వెలుగు: శ్రీశైలం ఎడమగట్టు పవర్ ప్లాంటులో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆస్తినష్టం ఏ స్థాయిలో జరిగింది? ప్లాంటు ఎప్పటిలోగా అందుబాటులోకి వస్తుంది? అన్న దానిపై సందిగ్ధం ఏర్పడింది. ప్రమాద తీవ్రత, కారణాలపై సీఐడీ టీమ్‌తో పాటు జెన్‌కో విజిలెన్స్ కమిటీ విచారణ జరుపుతోంది. విచారణలో ఏం తేలుతుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం బాగానే ఉన్న ఒకటి, రెండో యూనిట్ తప్ప మిగతా నాలుగు యూనిట్లు దెబ్బతింటే గనక నష్టం రూ. వేల కోట్లల్లో ఉంటుందని భావిస్తున్నారు.

నాలుగైదు రోజుల్లో క్లారిటీ?

‘ప్లాంటులోని ఒకటి, రెండో యూనిట్లు ఫర్వాలేదు. వాటిని మళ్లీ జనరేషన్‌లోకి తీసుకురావచ్చు. మిగిలిన యూనిట్ల వద్దవేడి బాగా ఉంది. అక్కడికి వెళ్లే పరిస్థితి లేదు’ అని ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్ రావు చెప్పడాన్ని బట్టి చూస్తే నాలుగు యూనిట్ల పరిస్థితి ఏమంత పాజిటివ్ గా లేదని అర్ద‌మవుతోంది. ఆస్తి నష్టంపై క్లారిటీ రావాలంటే మరో నాలుగైదు రోజులు పట్టేలా ఉందని ప్రభాకర్‌రావు చెప్పడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. మిగతా నాలుగు యూనిట్లు దెబ్బతింటే మాత్రం నష్టం రూ.వేల కోట్లలో ఉంటుందని, వాటిని రిప్లేస్ చేయడం ఇప్పట్లో జరిగే పనికాదని ఎక్స్ ప‌ర్ట్స్ అంటున్నారు. ఒక్కో యూనిట్‌లోని ఒక్కో జనరేటర్ విలువే దాదాపు రూ.500 కోట్ల వరకు ఉంటుందని చెబుతున్నారు.

ఈ లెక్కన ఆయా యూనిట్లలో జనరేటర్లు, ప్యానెల్స్, కేబుల్స్ కలుపుకొంటే ఎన్ని వేల కోట్ల నష్టం జరిగి ఉంటుందో అంచనాకు అందడం లేదు. విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకున్న‌ విలువైన మెషీన్లు, పరికరాలు మంటల్లో ఆహుతి కావడం వల్ల నష్టం ఊహించని స్థాయిలో పెరిగే అవకాశం ఉంది. దెబ్బతిన్నవాటిని తొలిగించడం, కొత్త వాటిని అమర్చివిద్యుత్ ఉత్పత్తికి సిద్ధం చేయడానికి కొన్ని నెలల టైం పట్టవచ్చని అంటున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం