రాష్ట్ర అప్పులు మార్చి నాటికి రూ.5 లక్షల కోట్లకు..

రాష్ట్ర అప్పులు మార్చి నాటికి రూ.5 లక్షల కోట్లకు..
  • ఆర్బీఐ రిపోర్టులో వెల్లడి
  • గ్యారంటీ అప్పుల్లో రూ.1.35 లక్షల కోట్లతో దేశంలోనే తెలంగాణ టాప్
  • ఇప్పటికే జీఎస్‌‌‌‌డీపీలో 28.2 శాతానికి చేరినయ్
  • వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరో 50 వేల కోట్లు తేవాలని ప్లాన్
  • ఇన్ని అప్పులు చేస్తున్నా జీతాలు సక్కగ ఇస్తలే.. పథకాలు సక్కగ అమలైతలే

హైదరాబాద్, వెలుగు: పన్నులు పెంచి.. చార్జీలు పెంచి.. భూములను అమ్మి.. వేల కోట్ల ఆదాయం పొందుతున్న రాష్ట్ర సర్కారు.. చివరికి అప్పులపైనే ఆధారపడుతున్నది. ఏటేటా తీసుకుంటున్న అప్పును పెంచుకుంటూ పోతున్నది. అలా సర్కారు తెచ్చిన రుణాలు బడ్జెట్‌‌‌‌కు రెండింతలయ్యాయి. ఈ ఎనిమిదిన్నర ఏండ్లలో చేసుకుంటూ వస్తున్న అప్పులు మార్చి నాటికి రూ.5 లక్షల కోట్లు దాటబోతున్నాయి. ఇప్పటికే జీఎస్‌‌‌‌డీపీలో 28.2 శాతానికి చేరుకుంటున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇటీవల రిలీజ్ చేసిన రిపోర్టులో వెల్లడించింది. ఇందులో గ్యారంటీల పేరుతో తీసుకున్న అప్పుల్లో రాష్ట్రం దేశంలో నే టాప్‌‌‌‌లో ఉన్నది. పైగా వచ్చే ఆర్థిక సంవత్సరానికి కూడా మరిన్ని అప్పు లు తీసుకునేందుకు రాష్ట్ర సర్కార్ రెడీ అయింది. దీంతో రాష్ట్ర రుణాలు ఏ స్థాయికి వెళ్తాయోనని ఎక నమిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంత చేస్తున్నా సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. నిధుల్లోనూ కోతలు పెడుతోంది. తీసుకుంటున్న అప్పులను ఇష్టారీతిన ఖర్చు చేస్తోంది. సర్కార్ ఉద్యోగులకు టైంకు జీతాలివ్వడం లేదు.

ఎఫ్ఆర్‌‌‌‌బీఎం పరిధిలోనే రూ.3.66 లక్షల కోట్లు 

రాష్ట్ర అప్పులు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయని ఆర్బీఐ రిపోర్టులో పేర్కొంది. 2022–23 సంవత్సరంలో తెలంగాణ బడ్జెట్ రూ.2.56 లక్షల కోట్లుగా ఉంది. ఇప్పుడు మార్చి నాటికి తెలంగాణ అప్పు రూ.5.01 లక్షల కోట్లకు చేరుతోంది. ఇందులో రిజర్వ్ బ్యాంక్ నుంచి ఎఫ్ఆర్‌‌‌‌బీఎం పరిధిలో తీసుకున్న అప్పులు రూ.3.66 లక్షల కోట్లు. వీటికి తోడు రాష్ట్ర సర్కార్ గ్యారంటీగా ఉండి.. నాబార్డ్ వంటి ఆర్థిక సంస్థలు, బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులు రూ.1.35 లక్షల కోట్లు. ఈ మొత్తం జీఎస్​డీపీలో 28 శాతం దాటుతోంది. వాస్తవానికి అప్పులు జీఎస్​డీపీలో 25 శాతం లోపే ఉండాలి. అప్పుడే ఆర్థిక నిర్వహణ కాస్త సక్రమంగా సాగుతున్నట్లు గుర్తిస్తారు. ఇక రానున్న ఫైనాన్షియల్​ఇయర్ లో అన్ని రకాలుగా కలిపి రాష్ట్ర సర్కార్ దాదాపు రూ.45 వేల కోట్ల నుంచి రూ.50 వేల కోట్లు అప్పు తీసుకోవాలని టార్గెట్ పెట్టుకున్నట్లు తెలిసింది.

జనంపై బాదుడు.. అయినా..

రాష్ట్ర ప్రభుత్వం రాబడి పెంచుకునేందుకు జనంపై టాక్స్‌‌లు, వ్యాట్‌‌లు వేస్తోంది. దీంతో అనుకున్న దాని కంటే ఎక్కువే ఆదాయం ఆర్జిస్తోంది. ఇలా గడిచిన రెండేండ్ల నుంచి రెండు, మూడు సార్లు టాక్స్​లు పెంచింది. భూముల విలువలు 150 శాతం దాకా పెంచి రిజిస్ర్టేషన్ చార్జీలు పెంచింది. ఆర్టీఏలో లైఫ్ టాక్స్, క్వార్టరీ టాక్స్, గ్రీన్ టాక్స్, సెస్​ల పేరుతో 30 నుంచి 40 శాతం దాకా బాదేసింది. కరెంట్ బిల్లుల్లో ఏడీసీ చార్జీల పేరుతో వసూలు చేస్తోంది. మరోవైపు పెట్రోల్, డీజిల్‌‌ వ్యాట్‌‌ను కేంద్రం తగ్గించుకున్నా.. రాష్ట్ర ప్రభుత్వం తగ్గించకపోవడంతో ఆ రాబడి కూడా అధికంగానే వస్తోంది. లిక్కర్ రేట్లు రెండుసార్లు పెంచింది. ఇంటర్నల్​ వ్యాట్ పెంచుకుంటూ పోతూనే ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఇలా సొంత టాక్స్​ల రూపంలో డిసెంబర్ నాటికి వచ్చిన ఆదాయం 70 శాతం ఉంది. స్టాంప్స్ అండ్ రిజిస్ర్టేషన్స్‌‌తో సగటున నెలకు రూ.1,200 కోట్ల నుంచి రూ.1,500 కోట్లు వస్తోంది. లిక్కర్ ద్వారా నెలకు రూ.3,500 కోట్లు సమకూరుతోంది. జీఎస్టీ అంతే వస్తోంది. ఇక సేల్స్ టాక్స్, ఎక్సైజ్, కేంద్రం నుంచి వచ్చిన పన్నుల వాటా, గ్రాంట్ ఇన్ ఎయిడ్ అన్నీ కలిపితే వచ్చిన ప్రభుత్వ ఆదాయం ఈ ఆర్థిక సంవత్సరంలో 9 నెలల్లోనే రూ. లక్షా 20 వేల కోట్లు దాటింది.

భూముల అమ్మకంతో వేల కోట్లు

ప్రభుత్వానికి చెందిన భూములను వేలంలో అమ్ముతూ రాష్ట్ర సర్కార్ సొమ్ము చేసుకుంటోంది. ఈ ఆర్థిక సంవ త్సరంలో ఇప్పటికే రాజీవ్ స్వగృహతో పాటు ఇతర ప్రభుత్వ భూములు అమ్మి దాదాపు రూ.14 వేల కోట్లతో ఖజానా నింపుకున్నది. ఈ ఏడాది కూడా భూము లు అమ్మడం ద్వారా రూ.25 వేల కోట్ల ఆదాయం సమకూర్చుకోవాలని టార్గెట్ పెట్టుకుంది. ఇంకా వందల ఎకరాల భూ ములు ల్యాండ్ పార్సిల్స్ పేరుతో విక్రయి స్తోంది. ప్రధానంగా రంగారెడ్డి, సంగా రెడ్డి, మేడ్చల్, యాదాద్రి జిల్లాల్లో వేల ఎక రాల భూములను అమ్మకానికి గుర్తించా రు. అభివృద్ధి పేరుతో రైతుల నుంచి భూములు లాక్కుంటూ.. వాటితోనూ ప్రభుత్వం ఆదాయం పొందుతోంది.

పైసలన్నీ ఎటు పోతున్నయ్?

రాష్ట్ర సర్కార్‌‌‌‌‌‌‌‌కు భారీగా సొంత ఆదాయం వస్తున్నా.. ఉద్యోగులకు సమయానికి జీతాలు ఇవ్వడం లేదు. ప్రజా సంక్షేమం కోసం నిధులు మంజూరు కావడం లేదు. కాంట్రాక్టర్లకు రూ.వేల కోట్ల బిల్లులు పెండింగ్‌‌‌‌లో పెడుతోంది. పంచాయతీలకు పైసలు ఇవ్వడం లేదు. పైగా ఫైనాన్స్ కమిషన్ పైసలు కూడా మళ్లిస్తున్నది. ఖర్చుల విషయంలో ప్రభుత్వానికి సరైన పద్ధతి లేకపోవడంతోనే ఇలా జరుగుతోందని ఎకనమిస్టులు అంటున్నారు. అన్నింటికీ అంచనాలు పెంచి ఖర్చు చేయడం, పాత అప్పుల కిస్తీలు, వడ్డీల కోసం కొత్తగా అప్పులు చేయడం, లగ్జరీ వాహనాల కొనుగోళ్లు, ఇతర మెయింటెనెన్స్ వంటివి పెరిగిపోయినట్లు ఆఫీసర్లు చెప్తున్నారు.