V6 News

ఈ కుక్కలకేమైంది.. చిన్నారి ముఖాన్ని కరిచేశాయ్..

 ఈ కుక్కలకేమైంది.. చిన్నారి ముఖాన్ని కరిచేశాయ్..

కొంత కాలంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. చిన్నాపెద్ద తేడా లేెకుండా అందరిపై దాడి చేస్తూ.. భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఇటీవల చిన్నారులపై వరుసగా దాడులు చేస్తున్నాయి. ఏప్రిల్ 14వ తేదీ శుక్రవారం మహబూబాబాద్ జిల్లాలో ఏడేళ్ల చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటన జిల్లాలోని కేసముద్రం మండలం దన్నసరి గ్రామ శివారు రేకులతండాలో చోటు చేసుకుంది.

బానోతు అక్షిత అనే 7 సంవత్సరాల చిన్నారి ఇంటి ముందు ఆడుకుంటుండగా కుక్కల దాడి చేశాయి. కుక్కలకు భయపడిన చిన్నారి పరిగెత్తినా.. వెంట పడి మరీ కరిచాయి కుక్కలు. కింద పడిపోయిన చిన్నారి ముఖంపై కుక్క గాట్లు పడ్డాయి. దాడిలో చిన్నారి తల, కన్ను, చేయిపై తీవ్ర గాయాలయ్యాయి. విషయాన్ని గమనించిన పేరంట్స్, చుట్టుపక్కల వారు కుక్కలను తరిమి.. పాపను వెంటనే మహబూబాబాద్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పాపను ఐసీయూలో ఉంచి వైద్యం చేస్తున్నారు డాక్టర్లు.

కుక్కల దాడిలో చిన్నారికి తీవ్రగాయాలు కావటంతో పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు డాక్టర్లు. ప్రతి వీధిలో కుక్కలు పెరిగిపోయాయని.. దాడులు చేస్తున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని దన్నసరి గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.