V6 News

ఎంఎస్ ధోని 15 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన రింకు సింగ్

ఎంఎస్ ధోని 15 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన రింకు సింగ్

ఐపీఎల్ 2026లో భాగంగా లక్నోలోని ఏకానా స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో  రింకూ సింగ్ (Rinku Singh) మరోసారి అసాధ్యమైన దానిని సుసాధ్యం చేసి చూపించాడు. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన ఈ పోరులో రింకూ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో కేకేఆర్‌కు చారిత్రాత్మక విజయాన్ని అందించడమే కాకుండా, టీమిండియా మాజీ కెప్టెన్, మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) పేరిట ఉన్న 15 ఏళ్ల నాటి రికార్డును సైతం బద్దలు కొట్టాడు. నంబర్ 6లో బ్యాటింగ్‌కు వచ్చి, ఐపీఎల్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన భారతీయ బ్యాటర్‌గా రింకూ సింగ్ (83* పరుగులు vs LSG, 2026) నిలిచాడు.

ఐపీఎల్ చరిత్రలో నంబర్ 6లో చేసిన అత్యధిక స్కోర్లు: 
* ఆండ్రీ రస్సెల్ – 88* (2018)
* రింకూ సింగ్ – 83 (2026)*
* ఎంఎస్ ధోనీ – 70* (2011)

మ్యాచ్ ని మలుపు తిప్పిన ఇన్నింగ్స్: 
ఒకానొక దశలో కేకేఆర్ 15 ఓవర్లకు 93/7 స్కోరుతో పీకల్లోతు కష్టాల్లో పడింది. కేమెరూన్ గ్రీన్ (34) మినహా మిగిలిన వారంతా విఫలమయ్యారు. ఆ సమయంలో రింకూ సింగ్, సునీల్ నరైన్‌తో కలిసి 8వ వికెట్‌కు కేవలం 30 బంతుల్లోనే 62 పరుగులు జోడించాడు. చివరి ఓవర్‌లో వరుసగా 4 సిక్సర్లు బాది స్కోరును 155/7కు చేర్చాడు. ఇది రింకూ ఐపీఎల్ కెరీర్‌లోనే అత్యుత్తమ స్కోరు (83*).

ఉత్కంఠభరిత సూపర్ ఓవర్: 
156 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో జట్టు కూడా తడబడింది. అయితే చివరి ఓవర్‌లో మహమ్మద్ షమీ సిక్సర్ బాదడంతో మ్యాచ్ టై అయి సూపర్ ఓవర్‌కు దారితీసింది. ఇక సూపర్ ఓవర్ వేసిన సునీల్ నరైన్ కేవలం 1 పరుగు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీశాడు. దీంతో 2 పరుగుల లక్ష్యాన్ని రింకూ సింగ్ మొదటి బంతికే ఫోర్ కొట్టి కేకేఆర్‌కు విజయాన్ని అందించాడు.