అమిత్ షా, జయలలిత పేరు చెప్పి జాక్వెలిన్ తో స్నేహం

అమిత్ షా, జయలలిత పేరు చెప్పి జాక్వెలిన్ తో స్నేహం

ఢిల్లీ : బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న మనీ లాండరింగ్ కేసులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కేసులో ప్రధాన నిందితుడు సుకేశ్ చంద్రశేఖర్ ఆమెను ఎలా పరిచయం చేసుకున్నాడన్న అంశం వెలుగులోకి వచ్చింది. అమిత్ షా పేరు చెప్పి అతను జాక్వెలిన్ తో పరిచయం పెంచుకున్నాడని, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత బంధువునని  చెప్పుకుని స్నేహం చేసినట్లు ఈడీ ఛార్జ్ షీట్ లో ప్రస్తావించింది. జాక్వెలిన్ తో పాటు మరో నటి నోరా ఫతేహీకి సుకేశ్ ఖరీదైన గిఫ్టులు ఇచ్చినట్లు అందులో పేర్కొంది.

స్ఫూఫ్ కాలర్ ఐటీతో పరిచయం
రూ.200కోట్ల మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి నటి జాక్వెలిన్ ను రెండుసార్లు విచారించిన ఈడీ ఆమె వాంగ్మూలం నమోదుచేసింది. ఆ వివరాలను పొందుపరుస్తూ తాజాగా ప్రత్యేక కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేసింది. అందులోని వివరాల ప్రకారం నిందితుడు చంద్రశేఖర్ 2020 డిసెంబర్ నుంచి జాక్వెలిన్ తో పరిచయం పెంచుకునేందుకు ప్రయత్నించాడు. పలుమార్లు ఫోన్ చేసినా ఆమె స్పందించకపోవడంతో కాలర్ ఐడీ స్పూఫింగ్ ద్వారా జాక్వెలిన్ మేకప్ ఆర్టిస్ట్ కు ఫోన్ చేశాడు. అమిత్ షా ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నానని.. జాక్వెలిన్ తో మాట్లాడాలని చెప్పాడు. నిజమేనని నమ్మిన మేకప్ ఆర్టిస్ట్ నెంబర్ ఇవ్వడంతో జాక్వెలిన్ సుకేశ్ కు కాల్ చేసింది. తనను తాను శేఖర్ రత్నవేలుగా పరిచయం చేసుకున్న నిందితుడు దివంగత జయలలిత బంధువునని, సన్ టీవీ ఓనర్ నని చెప్పుకున్నాడు. మీతో సినిమాలు చేయాలనుందంటూ తరచూ ఫోన్ చేస్తుండటంతో వారిద్దరి మధ్య స్నేహం కుదిరింది. 

నటికి ఖరీదైన గిఫ్టులు
సుకేశ్ ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టులో అరెస్ట్ అయ్యేంత వరకు జాక్వెలిన్ తో టచ్ లోనే ఉన్నట్లు ఈడీ దర్యాప్తులో తేలింది. అతని నుంచి కోట్ల విలువ చేసే గిఫ్టులు తీసుకున్నట్లు నటి అంగీకరించింది. వజ్రపు చెవికమ్మలు, బ్రాస్ లెట్, లక్షల విలువ చేసే డిజైనర్ హ్యాడ్ బ్యాగులు, మినీ కూపర్ కారు, ఫ్యామిలీ హాలీడే కోసం ఛార్టర్ ఫ్లైట్, హోటల్ అరేంజ్ చేశాడని, కానీ మినీ కూపర్ ను మాత్రం తాను వెనక్కి పంపినట్లు జాక్వెలిన్ అధికారులకు చెప్పింది. ఇక మరో నటి నోరా ఫతేహీకి కూడా సుకేశ్ బీఎండబ్ల్యూ కారును గిఫ్ట్ గా ఇచ్చాడని ఈడీ ఛార్జ్ షీట్ లో పేర్కొంది. 

17 ఏళ్ల వయసు నుంచే నేరాలు
ఇదిలా ఉంటే ఆర్థిక నేరాల్లో ఆరి తేరిన సుకేశ్ 17 ఏళ్ల వయసు నుంచి మోసాలకు మొదలుపెట్టాడు. ముఖ్యంగా సెలబ్రిటీలను నమ్మించి కోట్ల రూపాయలు కొల్లగొట్టినట్లు దర్యాప్తులో తేలింది. ఈ క్రమంలోనే రాన్ బాక్సీ మాజీ ప్రమోటర్లైన మల్వీందర్ సింగ్, శివిందర్ సింగ్ కు బెయిల్ ఇప్పిస్తానంటూ వారి భార్యల నుంచి ఏకంగా రూ.200 కోట్లు వసూలు చేశాడు. దీనిపై ఫిర్యాదు అందడంతో ఆగస్టులో ఢిల్లీ పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు.