మార్కులు అప్ లోడ్ చేసేందుకు టీచర్లు, హెడ్మాస్టర్ల అవస్థలు

మార్కులు అప్ లోడ్ చేసేందుకు టీచర్లు, హెడ్మాస్టర్ల అవస్థలు

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకూ సమ్మెటివ్ అసెస్​మెంట్ (ఎస్ఏ) 2 పరీక్షలు గురువారంతో ముగిశాయి. ఈ పరీక్షల్లో స్టూడెంట్లకు వచ్చిన మార్కులను ఆన్​లైన్​లో అప్​లోడ్ చేయాల్సి ఉంది. అయితే, స్కూల్ ఎడ్యుకేషన్  అధికారులు ఇచ్చిన పలు వెబ్​సైట్​లు సరిగా పనిచేయడం లేదు. మార్కులను అప్ లోడ్ చేసేందుకు టీచర్లు, హెడ్మాస్టర్లు నానా అవస్థలు పడుతున్నారు. ఇప్పటికే ఫార్మెటివ్  అసెస్ మెంట్ నాలుగు పరీక్షలతో పాటు ఎస్ఏ1 పరీక్షలు, మార్కులను అప్​డేట్ చేశారు.

తాజాగా ఎస్ఏ 2 పరీక్షలు పూర్తవడంతో, ఈ స్టూడెంట్ల మార్కులను ఆన్​లైన్​లో ఎంట్రీ చేయాలి. ఈ మార్కులను అప్​లోడ్  చేసేందుకు స్కూల్  ఎడ్యుకేషన్  అధికారులు మొత్తం 9 సర్వర్లను పెట్టారు. వాటిలో సర్వర్లు పనిచేయడం లేదు. వెబ్ సైట్లు ఓపెన్  కావడం లేదు. దీంతో టీచర్లు, హెడ్మాస్టర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోపక్క ఈ నెల 24న స్టూడెంట్లకు ఆన్​లైన్  ప్రోగ్రెస్ కార్డులు అందించాల్సి ఉంది. ఈ మార్కులు ఆన్​లైన్​లో అప్​లోడ్ చేస్తేనే, ఆ కార్డులు వచ్చే అవకాశం ఉంది. దీంతో టీచర్లంతా ఆందోళన చెందుతున్నారు. వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.