రేపే టీ20 వరల్డ్ కప్ ఫైనల్ పోరు

రేపే టీ20 వరల్డ్ కప్ ఫైనల్ పోరు


అయిదేళ్ల గ్యాప్ తర్వాత జరుగుతున్న టీ-20 వరల్డ్ కప్ గెలిచేదెవరో రేపు తేలనుంది. టోర్నీ ప్రారంభమైనప్పుడు అంచనాలు వేరు. టోర్నీ సాగిన తీరు వేరు. డిఫెండింగ్  ఛాంపియన్  వెస్టిండీస్ , టైటిల్  ఫేవరెట్  అనుకున్న టీమ్  ఇండియా లీగ్ దశను కూడా దాటలేదు. అటు ఇంగ్లాండ్ , పాకిస్థాన్ సెమీస్  తోనే సరిపెట్టుకున్నాయి. పెద్దగా అంచనాల్లేకుండా టోర్నీలో అడుగుపెట్టిన న్యూజిలాండ్ , ఆస్ట్రేలియా రేపు టైటిల్ పోరులో తలపడనున్నాయి. 

టీ-20 వరల్డ్ కప్ లో ఫేవరేట్ టీమ్స్ ను వెనక్కి నెట్టిన న్యూజిలాండ్, ఆస్ట్రేలియా రేపు ఫైనల్ ఫైట్ కు రెడీ అయ్యాయి. గ్రూప్ దశలో అన్ని జట్లను కివీస్, ఆసీస్ ఓడించాయి. మెరుగైన ప్రదర్శనతో సూపర్ అనిపించాయి. ఈ వరల్డ్ కప్ కు ముందు ఆసీస్  వరుసగా ఐదు టీ-20 సిరీస్ ల్లో పరాజయం పాలైంది. మరోవైపు కివీస్  ప్రదర్శన కూడా ఆశాజకనంగా ఏమీ లేదు. టీ-20ల్లో బంగ్లాదేశ్ పై ఫస్ట్ టైం సిరీస్  కోల్పోయింది. ఇలాంటి పరిస్థితుల్లో టోర్నీలో అడుగుపెట్టిన ఆ జట్లు సూపర్ గా రాణించాయి. ఫస్ట్ మ్యాచ్ లో పాకిస్థాన్  చేతిలో ఓటమి ఎదురైనప్పటికీ ఆ తర్వాత పుంజుకుంది కివీస్.  భారత్ తో సహా వరుసగా నాలుగు జట్లను ఓడించింది. 

మరోవైపు గ్రూప్ - 1లో తొలి రెండు మ్యాచ్ లు గెలిచిన ఆసీస్ .. ఆ తర్వాత ఇంగ్లాండ్  చేతిలో ఓడినప్పటికీ తిరిగి చివరి రెండు మ్యాచ్ ల్లో నెగ్గి సెమీస్ చేరింది. సరైన టైంలో వార్నర్ తో సహా మేయిన్ ప్లేయర్లు ఫామ్  లోకి రావటం ఆసీస్ కు కలిసొచ్చింది. ఆసీస్ , కివీస్  రెండింటికీ యూఏఈ వేదికలు అంత కలిసొచ్చేవి కావు. ఇక్కడి స్పిన్  పిచ్ లపై వాటికి పట్టు చిక్కడం కష్టమే అనుకున్నారు. కానీ ఆరంభంలో తడబడ్డా.. ఆపై పిచ్ లపై పట్టు సాధించాయి. ప్రత్యర్థులపై గెలిచి ఫైనల్లో అడుగు పెట్టాయి. వన్డేల్లో రికార్డు స్థాయిలో అయిదు సార్లు విశ్వవిజేతగా నిలిచిన కంగారూలు...టీ-20లో బోణీ కొడుతుందా...?  లేదా ప్రపంచ టెస్టు ఛాంపియన్ గా నిలిచిన కివీస్  అదే జోరులో తొలిసారి టీ-20 ఛాంపియన్ గా నిలుస్తుందా...? అన్నది రేపు తేలనుంది.