నీ బిడ్డ మొహం చూడు.. ఆత్మహత్య మానుకో

నీ బిడ్డ మొహం చూడు.. ఆత్మహత్య మానుకో
  • మాటలతో మనసు మార్చి ఓ వ్యక్తిని కాపాడిన కానిస్టేబుల్

చెన్నై: ఆత్మహత్య చేసుకునే ముందు ఒక్క క్షణం ఆలోచిస్తే చాలు.. ఎవరూ ఆ పని చేయడానికి ముందడుగు వేయరేమో! తల్లీ, బిడ్డ గుర్తొస్తే కళ్ల వెంట నీళ్లు తిరిగి.. వారి కోసమైనా బతకాలన్న ఆశ ఆ చివరి నిమిషంలో చిగురిస్తుంది!.. అవును, దీనికి నిదర్శనమే తమిళనాడులోని కడలూరులో జరిగిన ఈ సంఘటన. నడి రోడ్డులో జనం కళ్ల ముందు ఆత్మహత్య చేసుకుంటున్న ఓ తండ్రి నిండు ప్రాణాన్ని బిడ్డపై మమకారం కాపాడింది. ఆ దారిన వెళ్తున్న పోలీసు హెడ్ కానిస్టేబుల్ సమయస్ఫూర్తి ఓ బిడ్డను అనాథ కాకుండా ఆపింది.

కడలూరుకు చెందిన మణికందన్ అనే వ్యక్తికి, అతడి భార్యకి మధ్య విభేదాలు రావడంతో ఏడాది క్రితం విడిపోయారు. అయితే అతడికి మాత్రం మళ్లీ కలిసి జీవించాలని ఉంది. కానీ ఎంత ప్రయత్నించినా వారి మధ్య భేదాభిప్రాయాలు సమసిపోలేదు.

ఇక విరక్తి చెందిన మణికందన్, తన భార్య ఎదుటే ఆత్మహత్య చేసుకుని చనిపోవాలని నిర్ణయించుకున్నాడు. రోడ్డుపై నిలబడి కిరోసిన్ పోసుకుంటూ తాను చనిపోతున్నానని, చివరిగా ఆలోచించుకోవాలని భార్యను హెచ్చరిస్తున్నాడు. ఇది చూసి జనాలు చుట్టూ చేరారు. కానీ ఎవరూ అతడిని ఆపే ప్రయత్నం చేయకుండా వేడుక చూస్తున్నారు.

అప్పుడే అటువైపు నుంచి వెళ్తున్న ఓ హెడ్ కానిస్టేబుల్ జనాన్ని చూసి ఏదో జరుగుతుందని అక్కడికి వెళ్లాడు. మణికందన్ ను చూసి ఆత్మహత్య చేసుకోవద్దని వారించాడు. వద్దూ, వద్దూ అని ఎంత చెబుతున్నా వినిపించుకోకపోవడంతో.. వెంటనే ఇంటి లోపలికి వెళ్లి మణికందన్ కుమారుడిని బయటకు తీసుకొచ్చాడు. ‘నీ బిడ్డ మొహం చూడు. వీడిని అన్యాయం చేసి వెళ్లిపోతావా? నువ్వు చస్తే ఈ పిల్లాడు అనాథ అవుతాడు… ఆలోచించుకో’ అని చెప్పాడు. దీంతో క్షణాల్లో గుండె కరిగి.. కంట నీరు పెట్టుకుని తన బిడ్డను కౌగిలించుకున్నాడు మణికందన్.