- సుదర్శన్ గౌడ్ మృతదేహాన్ని స్వదేశానికి తెచ్చేందుకు ఆదేశాలు
హైదరాబాద్, వెలుగు: రష్యా-–ఉక్రెయిన్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన జగిత్యాల జిల్లా హస్నాబాద్‌కు చెందిన వావిలాల సుదర్శన్ గౌడ్ కుటుంబానికి సీఎం రేవంత్‌రెడ్డి అండగా నిలిచారు. బాధిత కుటుంబానికి రూ.6 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. సుదర్శన్ గౌడ్ మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఉపాధి కోసం నాలుగు నెలల కింద ఉక్రెయిన్‌కు వెళ్లిన సుదర్శన్ గౌడ్.. అక్కడ యుద్ధంలో క్షిపణులు, డ్రోన్ దాడుల కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
దీంతో ఆయన కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. సుదర్శన్ భార్య చేసిన విజ్ఞప్తిపై సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ స్పందించారు. కుటుంబ పరిస్థితిని సీఎం దృష్టికి తీసుకెళ్లి ఆర్థిక సాయం అందించాలని కోరారు. మంత్రి విజ్ఞప్తిపై స్పందించిన సీఎం.. బాధిత కుటుంబానికి రూ.6 లక్షలు ప్రకటించారు. సీఎం రిలీఫ్ ఫండ్ (సీఎంఆర్‌ఎఫ్) నుంచి సాయం అందించేందుకు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
