హైదరాబాద్: పోలీస్ యూనిఫామ్ ధరించే అవకాశం అందరికీ దక్కదని డీజీపీ సీవీ ఆనంద్ అన్నారు. యూనిఫామ్‌కు ఉన్న గౌరవం, మర్యాద, ప్రతిష్ఠను ఎల్లప్పుడూ కాపాడాలని సూచించారు. ప్రతిరోజూ కనీసం 50 మంది కన్నీళ్లు తుడిచే అవకాశం పోలీస్ యూనిఫామ్‌కు ఉందన్న సందేశాన్ని గుర్తుంచుకోవాలన్నారు.ప్రజల సమస్యలకు స్పందిస్తూ, బాధితులకు అండగా నిలుస్తూ, చట్టబద్ధంగా విధులు నిర్వర్తించాలని కొత్తగా బాధ్యతలు చేపట్టనున్న డీఎస్పీలకు సూచించారు. ప్రజల ప్రాణాలు, ఆస్తులను రక్షిస్తూ, పోలీస్ శాఖపై ప్రజలకు మరింత విశ్వాసం కలిగించేలా పనిచేయాలని పిలుపునిచ్చారు.
112 మంది ప్రొబేషనరీ డీఎస్పీల పాసింగ్ అవుట్ పరేడ్‌లో పాల్గొన్న ఆయన, శిక్షణ పూర్తి చేసుకున్న అధికారులను అభినందించారు. అనివార్య కారణాలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరుకాలేకపోయారని, భవిష్యత్తులో ప్రొబేషనరీ డీఎస్పీలను ఉద్దేశించి మాట్లాడతారని తెలిపారు.పోలీస్ యూనిఫామ్‌కు ఉన్న గౌరవం, మర్యాద, ప్రతిష్ఠను ప్రతి అధికారి కాపాడాలని సీవీ ఆనంద్ సూచించారు. రాజ్యాంగానికి విధేయులుగా ఉంటూ, నిజాయితీగా, నిర్భయంగా, రాగద్వేషాలకు అతీతంగా ప్రజలకు సేవ చేయాలని పిలుపునిచ్చారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు సేవ చేసేందుకు సుమారు 90 వేల మంది పోలీసులు ఉన్నారని, ప్రజల ప్రాణాలు, ఆస్తులను కాపాడటం పోలీసుల ప్రధాన బాధ్యత అని స్పష్టం చేశారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలి డీఎస్పీ బ్యాచ్
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీజీపీఎస్సీ ద్వారా ఎంపికైన తొలి డీఎస్పీ బ్యాచ్ ఇదేనని సీవీ ఆనంద్ పేర్కొన్నారు. ఈ బ్యాచ్‌లోని 112 మంది అధికారులకు పోలీస్ అకాడమీలో సుమారు 44 వారాలపాటు శిక్షణ అందించినట్లు తెలిపారు. చట్టాలు, దర్యాప్తు విధానాలు, వృత్తి నైపుణ్యాలు, క్షేత్రస్థాయి అనుభవం, డ్రిల్, పరేడ్, క్రీడల్లో శిక్షణ పొందినట్లు వివరించారు.ప్రొబేషనరీ డీఎస్పీల పాసింగ్ అవుట్ పరేడ్ అద్భుతంగా జరిగిందని అభినందించారు. అవుట్‌డోర్ విభాగంలో ఎల్. శ్రీకాంత్ బెస్ట్ ప్రొబేషనర్‌గా, ఇండోర్ విభాగంలో నేహా అగర్వాల్ బెస్ట్ ప్రొబేషనర్‌గా ఎంపికయ్యారని తెలిపారు. బెస్ట్ ఆల్‌రౌండ్ పెర్ఫార్మెన్స్ సాధించిన నేహా అగర్వాల్‌ను ప్రత్యేకంగా అభినందించారు. శిక్షణ అందించిన అకాడమీ ఫ్యాకల్టీ, ఇండోర్, అవుట్‌డోర్ సిబ్బంది, ఉస్తాద్‌ల సేవలను ప్రశంసించారు.
అకాడమీలో శిక్షణ పూర్తయినప్పటికీ, అధికారుల అభ్యాసం కొనసాగాలని డీజీపీ సూచించారు. మరో 46 వారాలపాటు జిల్లా స్థాయిలో ప్రాక్టికల్ శిక్షణ ఉంటుందని తెలిపారు. అకాడమీలో చూపిన శ్రద్ధ, క్రమశిక్షణ, నిజాయితీని క్షేత్రస్థాయిలోనూ కొనసాగించాలని కోరారు.రాజ్యాంగానికి విధేయులుగా ఉంటూ, నిజాయితీగా, నిర్భయంగా, రాగద్వేషాలకు అతీతంగా విధులు నిర్వహిస్తామని చేసిన ప్రమాణాన్ని జీవితాంతం గుర్తుంచుకోవాలని సూచించారు. విధులు, కర్తవ్యాలను చట్టబద్ధంగా నిర్వహించడమే ప్రతి పోలీసు అధికారికి మార్గదర్శకంగా ఉండాలని పేర్కొన్నారు.
డీఎస్పీ స్థాయిలో ఎంపికైన అధికారులు నాయకత్వ బాధ్యతలను సమర్థంగా నిర్వహించాల్సి ఉంటుందని సీవీ ఆనంద్ అన్నారు. తమ సిబ్బందిని ముందుండి నడిపిస్తూ, కష్టసమయాల్లో అండగా నిలవాలని సూచించారు. నాయకత్వానికి అవసరమైన పది ముఖ్యమైన లక్షణాలను వివరించారు.
మారుతున్న నేరాలు.. కొత్త సవాళ్లు
గతంలో నక్సలిజం, మత సామరస్య సమస్యలు, దోపిడీలు పోలీసుల ముందున్న ప్రధాన సవాళ్లుగా ఉండేవని సీవీ ఆనంద్ గుర్తుచేశారు. నక్సలిజాన్ని ఎదుర్కొనేందుకు పోలీసులు వ్యక్తిగత భద్రతను సైతం లెక్కచేయకుండా పోరాడారని పేర్కొన్నారు.ప్రస్తుతం మాదకద్రవ్యాలు, సైబర్ నేరాలు, వ్యవస్థీకృత నేరాలు ప్రధాన సమస్యలుగా మారాయని తెలిపారు. ట్రాఫిక్ రద్దీ, రోడ్డు భద్రత, ఆహార కల్తీ వంటి అంశాలు కూడా పోలీసులకు కొత్త సవాళ్లుగా నిలుస్తున్నాయని వివరించారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తెలంగాణ పోలీస్ శాఖలో సంస్థాగత మార్పులు చేపడుతూ, ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.కొత్త తరహా నేరాలను ఎదుర్కొనేందుకు తెలంగాణ పోలీస్ శాఖ ప్రత్యేక విభాగాల ద్వారా చర్యలు తీసుకుంటోందని డీజీపీ తెలిపారు.
పోలీసు ఉద్యోగంలో శారీరక దృఢత్వం, క్రమశిక్షణ, అంకితభావం ఎంతో ముఖ్యమని సీవీ ఆనంద్ పేర్కొన్నారు. పాసింగ్ అవుట్ పరేడ్ సందర్భంగా ధరించిన బెల్ట్‌ను 30 ఏళ్ల తర్వాత కూడా అదే రంధ్రాల్లో బిగించగలిగేలా ఫిట్‌నెస్‌ను కాపాడుకోవాలని సూచించారు.ప్రస్తుతం ఉన్న శారీరక దృఢత్వం, యూనిఫామ్‌లోని స్మార్ట్‌నెస్‌ను ఉద్యోగ జీవితమంతా కొనసాగించాలని కోరారు. సమయం లేదనే సాకులు చెప్పకుండా ఆరోగ్యానికి, వ్యాయామానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
