- 3,800 మంది ఉద్యోగులకు గ్రాట్యుటీ వర్తింపు
- జీవో జారీ చేసిన సర్కార్.. గరిష్ఠ పరిమితి 16 లక్షలు..
- రిటైర్మెంట్ సమయంలో ఆర్థిక భరోసా
- సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి సీతక్కకు ఉద్యోగ జేఏసీ కృతజ్ఞతలు
హైదరాబాద్, వెలుగు: ఉపాధి హామీ స్కీమ్ (వీబీ–జీ–రామ్‌జీ)లో పనిచేస్తున్న ఫిక్స్డ్ టెన్యూర్ ఉద్యోగులకు (ఎఫ్‌టీఈ) ప్రభుత్వం దసరా కానుక అందించింది. ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న గ్రాట్యుటీ సమస్యకు పరిష్కారం చూపింది. అర్హులైన ఉద్యోగులకు గ్రాట్యుటీ ప్రయోజనాలు వర్తింపజేయాలని నిర్ణయించింది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంగళవారం జీవో జారీ చేసింది.
దీంతో సుమారు 3,800 మంది ఉద్యోగులకు రిటైర్మెంట్ సమయంలో ఆర్థిక భరోసా లభించనుంది. గ్రాట్యుటీ గరిష్ఠ పరిమితిని రూ.16 లక్షలుగా నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగులకు వర్తించే నిబంధనల తరహాలోనే ఎఫ్‌టీఈలకు ఈ ప్రయోజనం కల్పించనున్నారు. గతంలో సెర్ప్ పరిధిలోని ఉద్యోగులకు అమలు చేసిన విధానాన్నే గ్రామీణాభివృద్ధి సంస్థ (ఎస్ఆర్డీఎస్) పరిధిలోని ఎఫ్టీఈలకూ వర్తింపజేస్తున్నారు.
గ్రాట్యుటీ నిధుల నిర్వహణకు ఎల్ఐసీ లేదా ఇతర గుర్తింపు పొందిన బీమా సంస్థ ద్వారా ప్రత్యేక గ్రూప్ గ్రాట్యుటీ ఫండ్ ఏర్పాటు చేయనున్నారు. గ్రాట్యుటీ చెల్లింపులకు నెలకు సుమారు రూ.కోటి ఖర్చవుతుందని అంచనా వేశారు. ఈ మొత్తాన్ని అడ్మినిస్ట్రేటివ్ కాంపోనెంట్ నుంచి సర్దుబాటు చేసేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఉద్యోగి ఎఫ్టీఈగా నియమితులైన తేదీ లేదా ఆ కేటగిరీలోకి మారిన తేదీ నుంచి గ్రాట్యుటీ సర్వీసును లెక్కిస్తారు.
పదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ సర్వీసు పూర్తి చేసుకున్నవారికి నిబంధనల ప్రకారం పూర్తిస్థాయి ప్రయోజనం అందుతుంది. అంతకుముందు నాన్-ఎఫ్టీఈగా పనిచేసిన సర్వీసును పరిగణనలోకి తీసుకునే అంశంపై న్యాయపరమైన విషయాలను పరిశీలించి నిర్ణయం తీసుకోనున్నారు.
ఉద్యోగుల ఆత్మగౌరవానికి పెద్దపీట: మంత్రి సీతక్క
ఉద్యోగుల హక్కులు, ఆత్మగౌరవానికి ప్రజా ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని మంత్రి సీతక్క అన్నారు. ఏళ్లుగా వినతులకే పరిమితమైన సమస్యలను అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరిస్తున్నామని చెప్పారు. జీవితాంతం గ్రామీణ పేదలకు సేవ చేసిన ఉద్యోగులు రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
తమ 20 ఏళ్ల చిరకాల డిమాండ్‌ను నెరవేర్చినందుకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి సీతక్కకు ఉద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు. ఖైరతాబాద్‌లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ కార్యాలయంలో మంత్రి సీతక్కను కలిసి ధన్యవాదాలు చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జేఏసీ చైర్మన్ ఎలబద్రి లింగయ్య, ఏపీవో సంఘం అధ్యక్షుడు అంజిరెడ్డి, సీవో అండ్ ఏఏ అధ్యక్షుడు విజయ్‌కుమార్, టీఏ అధ్యక్షుడు ఇ.వెంకట్రామిరెడ్డి, గౌరవ అధ్యక్షుడు ఎం.మోహన్‌రావు, తంగెళ్ల రఘు తదితరులు పాల్గొన్నారు.
