సిద్దిపేట కలెక్టర్​కు హైకోర్టు ఆదేశం

సిద్దిపేట కలెక్టర్​కు హైకోర్టు ఆదేశం

స్వయంగా హాజరై వివరణ ఇవ్వండి
సిద్దిపేట కలెక్టర్​కు హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: కొండపోచమ్మ సాగర్‌ కెనాల్‌ నిర్మాణానికి రైతు నుంచి సేకరించిన భూమి కంటే.. అధికంగా భూమిని నిషేధిత జాబితాలో ఎందుకు చేర్చారో చెప్పాలని సిద్ధిపేట జిల్లా కలెక్టర్, గజ్వేల్‌ మండల తహసీల్దార్లలను హైకోర్టు ఆదేశించింది. గజ్వేల్‌ మండలం ముట్రాజ్‌పల్లిలోని సర్వే నెం 210లో డి.ఇంద్రసేనారెడ్డి అనే రైతుకు 3.07 ఎకరాల భూమి ఉంది. అయితే, కెనాల్‌ నిర్మాణం కోసం 2.05 ఎకరాలను అధికారులు సేకరించారు. కానీ 3.07 ఎకరాలను నిషేధిత జాబితాలో చేర్చారు. దీంతో రైతు హైకోర్టును ఆశ్రయించారు.

హైకోర్టు శనివారం విచారణ చేపట్టింది. సమస్యపై ఎన్నిసార్లు విజ్జప్తి చేసినా అధికారులు స్పందించలేదని పిటిషనర్‌ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ధరణిలో కూడా భూమి మొత్తాన్ని ఆటోలాక్‌ చేశారని వివరించారు. స్పందించిన హైకోర్టు.. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రైతును ఎందుకు ఇబ్బందులకు గురిచేశారో చెప్పాలని ఆదేశించింది. కాలువకు అవసరమైన భూమి కంటే.. ఎక్కువ భూమిని నిషేధిత జాబితాలో ఎందుకు చేర్చారో  తదుపరి విచారణకు స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని.. సిద్దిపేట జిల్లా కలెక్టర్, గజ్వేల్‌ తహసీల్దార్లను ఆదేశించింది. వచ్చే నెల 22 కు విచారణను కోర్టు వాయిదా వేసింది.