క్యాట్​లో మనోడికి 100 పర్సంటైల్

క్యాట్​లో మనోడికి 100 పర్సంటైల్

దేశవ్యాప్తంగా మరో 9 మందికి కూడా

హైదరాబాద్‌, న్యూఢిల్లీ, వెలుగుకామన్​ అడ్మిషన్​ టెస్ట్(క్యాట్) ఫలితాల్లో మనోళ్లు సత్తా చాటారు. శనివారం వెల్లడైన క్యాట్​ ఫలితాల్లో.. రాష్ట్రానికి చెందిన ఓ స్టూడెంట్​ ఏకంగా 100 పర్సంటైల్​ సాధించాడు. అయితే, ఆ విద్యార్థి వివరాలను పరీక్ష నిర్వాహకులు వెల్లడించలేదు. రాష్ట్రానికి చెందిన మరో ఇద్దరు విద్యార్థులు 99 పర్సంటైల్ సాధించారు. ఇందులో హైదరాబాద్‌ కు చెందిన సమీర్ అహ్మద్‌ 99.88, ఖమ్మం వాసి రామగిరి సుజిత్‌  99.79 పర్సంటైల్ సాధించారు. వీరిద్దరూ వరంగల్ నిట్‌(ఎన్‌ఐటీ)లో ఇంజనీరింగ్ పూర్తిచేశారు. వరంగల్‌ నిట్‌లో చదివిన ఢిల్లీ విద్యార్థి పార్థ్‌ గోస్వామికి 99.62 పర్సెంటైల్  సాధించాడు. ఐఐఎంతో పాటు పలు బిజినెస్‌ స్కూళ్లలో ప్రవేశాల కోసం నవంబర్ 24న క్యాట్ ఎగ్జామ్ నిర్వహించారు. దేశవ్యాప్తంగా 1,34,917 మంది అబ్బాయిలు, 75004 మంది అమ్మాయిలు ఈ పరీక్ష రాశారు. తెలంగాణ నుంచి సుమారు 15 వేల మంది ఈ పరీక్షకు హాజరయ్యారు.

పరీక్ష నిర్వహించిన ఐఐఎం కోజిపూర్‌‌ శనివారం ఫలితాలను విడుదల చేసింది.  ఫలితాల్లో టెక్నాలజీ, ఇంజనీరింగ్​ బ్యాక్​గ్రౌండ్​ విద్యార్థులే మెరుగైన ఫలితాలు సాధించారని అధికారులు చెప్పారు. వందకు వంద పర్సంటైల్​ సాధించిన పది మంది కూడా ఇంజనీరింగ్​స్టూడెంట్లేనని, అందులో ఐఐటీల నుంచి ఆరుగురు, ఎన్ఐటీల నుంచి నలుగురు ఉన్నారని తెలిపారు. వీరిలో మన రాష్ట్రం నుంచి ఒక స్టూడెంట్ ఉండగా.. నలుగురు మహారాష్ట్రకు చెందిన వారు, మిగతా ఐదుగురు జార్ఖండ్, తమిళనాడు, కర్నాటక, పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్​లకు చెందిన వారని వివరించారు. మరో 21 మంది స్టూడెంట్లు 99.9 పర్సంటైల్​ సాధించారని చెప్పారు. ఇందులోనూ 19 మందిది టెక్నలాజికల్​ బ్యాక్ గ్రౌండేనని వివరించారు. కాగా, గడిచిన పదేళ్లుగా క్యాట్​ఎగ్జామ్​ రాసే విద్యార్థుల సంఖ్య పెరుగుతూ వస్తోందని నిపుణులు చెబుతున్నారు.