యాదాద్రి టైమింగ్స్ మారినయ్

యాదాద్రి టైమింగ్స్ మారినయ్
  •  ఉదయం 4 గంటలకే తెరుచుకోనున్న గుడి
  • రాత్రి 9:45 గంటలకు మూసివేత 
  • రోజుకు రెండుసార్లు బ్రేక్ దర్శనాలు
  • ఈ టైంలోనే వీఐపీలకు అనుమతి 

యాదగిరిగుట్ట, వెలుగు :యాదాద్రిలో ఆలయ సమయాలను మార్చారు. ఉదయం 4 గంటలకు ఆలయాన్ని తెరిచి రాత్రి 9:45 గంటలకు మూసివేయనున్నారు. ఉదయం 4 గంటల నుంచి 6 గంటల వరకు సుప్రభాత సేవ, బిందెతీర్థం, ఆరాధన, బాలభోగం, పుష్పాలంకరణ నిర్వహిస్తారు. 6 గంటల నుంచి 7:30 గంటల వరకు..తిరిగి 10 గంటల నుంచి మధ్యాహ్నం 11:45 గంటల వరకు ధర్మదర్శనాలకు అనుమతి ఇస్తారు. మధ్యాహ్న ఆరగింపు సేవ తర్వాత 12:30 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు ధర్మదర్శనాలు ఉంటాయి. శని, ఆదివారాలు మినహా మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు ఆలయాన్ని మూసివేస్తారు. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ధర్మదర్శనాలు కొనసాగిస్తారు. తిరువారాధన, సహస్రనామార్చన, కుంకుమార్చన అనంతరం 8:15 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ధర్మదర్శనాలుంటాయి. నివేదన, శయనోత్సవం నిర్వహించి రాత్రి 9:45 గంటలకు ఆలయాన్ని మూసివేస్తారు.  

 ఏడున్నర గంటల నుంచి నిజాభిషేకం, సహస్ర నామార్చన

ఇంతకుముందు ప్రతిరోజు ఉదయం 4:30 గంటల నుంచి 6:30 గంటల వరకు స్వామివారికి నిజాభిషేకం, సహస్రనామార్చన నిర్వహించేవారు. ప్రస్తుతం భక్తులు బస చేయడానికి యాదాద్రిలో సరిపోను రూమ్స్ లేకపోవడంతో తెల్లవారుజామున అభిషేకం, అర్చనలో పాల్గొనడం ఇబ్బందిగా మారింది. దీంతో పూర్తిస్థాయిలో రూమ్స్ అందుబాటులోకి వచ్చే వరకు..శుక్రవారం (ఏప్రిల్​1 ) నుంచి ప్రతిరోజు ఉదయం 7:30  గంటల నుంచి 9 గంటల వరకు స్వామివారికి నిజాభిషేకం, సహస్రనామార్చన నిర్వహించనున్నట్లు ఈఓ గీతారెడ్డి తెలిపారు.

బ్రేక్ ​దర్శనాల్లోనే వీఐపీలు రావాలె..

స్వామివారి దర్శనానికి వీఐపీలు వచ్చిన టైంలో సాధారణ భక్తులు ఇబ్బందులు పడుతున్నారని, దీన్ని అధిగమించేందుకు బ్రేక్ దర్శనాలను ప్రవేశపెడుతున్నట్లు ఈఓ తెలిపారు. ప్రతిరోజుఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు.. సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటలకు వరకు బ్రేక్ దర్శనాలుంటాయన్నారు. ఇప్పటివరకు దీనికి టికెట్ రేట్ నిర్ణయించని కారణంగా రూ.150 వీఐపీ టికెట్ పై ఏ వీఐపీ అయినా, ఏ భక్తుడైనా దర్శనం 
చేసుకోవచ్చన్నారు. 

బంగారు తాపడానికి  18.85 కోట్లు

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దివ్యవిమాన గోపుర బంగారు తాపడం కోసం మార్చి 17 నుంచి మార్చి 30 వరకు వచ్చిన విరాళాల వివరాలను ఆలయ ఆఫీసర్లు ప్రకటించారు. మార్చి 17 నుంచి మార్చి 30 వరకు రూ.1,16,53,562 విరాళాలు వచ్చాయి. ఛలాన్ల ద్వారా రూ.4,93,709, ఆర్టీజీఎస్, నెఫ్ట్, క్యూఆర్ కోడ్, ఆన్ లైన్ ద్వారా రూ.2,91,295, చెక్కులు, డీడీల రూపంలో రూ.1,08,68,558 వచ్చాయి. కాగా, 2021 సెప్టెంబర్ 25 నుంచి ఈ ఏడాది మార్చి 30 వరకు రూ.18,85,11,973 విరాళాలు ఇచ్చారు. దీంతో పాటు భక్తుల నుంచి 6 కిలోల 198 గ్రాముల బంగారం వచ్చింది.