టెట్, టీఆర్టీ నోటిఫికేషన్లు రిలీజ్​ చేయాలె

టెట్, టీఆర్టీ నోటిఫికేషన్లు రిలీజ్​ చేయాలె

తెలంగాణలో జిల్లాలవారీగా టీచర్ల సర్దుబాటు ప్రక్రియ ముగిసినందున రాష్ట్ర ప్రభుత్వం వెంటనే టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్(టెట్), టీచర్స్ రిక్రూట్​మెంట్​ టెస్ట్(టీఆర్టీ) నోటిఫికేషన్లను జారీ చేయడంపై దృష్టి పెట్టాలి. రాష్ట్రంలో గత 8 ఏండ్లలో ఒకే ఒక్కసారి టీఆర్టీ(డీఎస్సీ) నిర్వహించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కనీసం రెండు సంవత్సరాలకు ఒకసారి డీఎస్సీ వేసేశారు. కానీ పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో ఐందేండ్లుగా బీఎడ్, డీఎడ్ పూర్తి చేసిన 5 లక్షల మంది అభ్యర్థులు నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్నారు. 2 సంవత్సరాలుగా అదిగో టీఆర్టీ ఇదిగో నోటిఫికేషన్​ అంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటనలు ఇవ్వడమే తప్ప.. నోటిఫికేషన్​ మాత్రం రాలేదు. నోటిఫికేషన్లకు సంబంధించి అన్ని అడ్డంకులు తొలగినందున వెంటనే టెట్, టీఆర్టీ నోటిఫికేషన్లు విడుదలు చేయాలి. దుబ్బాక, హుజూరాబాద్​ ఉప ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎలక్షన్ల సమయంలో టీచర్ ఖాళీలకు త్వరలోనే ప్రకటన అంటూ అనేకసార్లు చెప్పిన ప్రభుత్వం ఆ దిశగా తీసుకున్న చర్యలు మాత్రం శూన్యం. 8 ఏండ్లలో ఒకే ఒక్కసారి టీఆర్టీ నోటిఫికేషన్ జారీ చేయగా.. ఏటా ఒకసారి టెట్ నిర్వహిస్తామని చెప్పి 8 సంవత్సరాల్లో 2 సార్లు మాత్రమే పరీక్ష నిర్వహించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం టెట్, టీఆర్టీ నోటిఫికేషన్ పై శ్రద్ధ పెట్టాలి. ఖాళీగా ఉన్న వేల టీచర్​ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి.                                                  - రావుల రామ్మోహన్ రెడ్డి, వెల్దండ, జనగాం జిల్లా