మహిళా కానిస్టేబుళ్లకు మర్దానీ-2 సినిమా చూపించిన ఎస్పీ

మహిళా కానిస్టేబుళ్లకు మర్దానీ-2 సినిమా చూపించిన ఎస్పీ

ప్రతీ రోజు విధి నిర్వహణలో బిజీగా ఉండే పోలీసులకు కాస్త రిలాక్స్ కల్పించారు ఆ జిల్లా ఎస్పీ.ముఖ్యంగా ఉరుకులు పరుగులతో టెన్షన్ వాతావరణంలో ఉద్యోగాలు చేస్తున్న మహిళా పోలీసులకు సినిమా చూపించి వినోదాన్ని పంచారు. ఈ ఆహ్లాదకరమైన సంఘటన మహారాష్ట్ర లోని భయాందర్‌ పోలీసు స్టేషన్‌లో జరిగింది.

బందోబస్తు విధుల నిర్వహణ ఉండి వెంటనే రావాలంటూ పై అధికారి నుంచి ఆదేశాలు రావడంతో మహిళా కానిస్టేబుళ్లంతా హుటాహుటిన పోలీసు స్టేషన్‌కు చేరుకున్నారు. ఏం జరిగిందో తెలియక వారంతా ఆందోళనతో ఉన్నారు. అయితే ఆ అధికారి చెప్పిన వార్త విన్న కానిస్టుబుల్స్ ఆనందం వ్యక్తం చేశారు. జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శివాజీ రాఠోడ్‌ ఆదేశాలతో స్టేషన్‌కు వెళ్లిన దాదాపు వందకు పైగా మహిళా కానిస్టేబుళ్లకు ఆయన డ్యూటీ ఏంటో చెప్పడానికి బదులు ముందు భోంచేయండి… ఆ తర్వాత సినిమాకెళుదురుగానీ అంటూ చెప్పారు. భోజనం చేశాక…సగౌరవంగా వాహనాల్లో మహిళా కానిస్టేబుళ్లందరినీ ‘మర్దానీ-2’సినిమాకు పంపించారు. మహిళా పోలీసు సిబ్బంది నిబద్ధతతో పనిచేసే తీరును దృష్టిలో పెట్టుకుని వారికి కొంత వినోదాన్ని కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అదనపు ఎస్పీ సంజయ్‌పాటిల్‌ తెలిపారు.