సౌత్ కొరియన్ల వయస్సు.. రాత్రికి రాత్రే తగ్గిపోయింది

సౌత్ కొరియన్ల వయస్సు..  రాత్రికి రాత్రే తగ్గిపోయింది
  •     వయసు లెక్కింపులో అంతర్జాతీయ విధానం అమల్లోకి 
  •     ఇప్పటివరకు మూడు పద్ధతులు ఉండటంతో గందరగోళం 
  •     ఈ గందరగోళానికి తెరదింపిన కొత్త చట్టం  

సియోల్: దక్షిణ కొరియాలోని మొత్తం 5.10 కోట్ల మంది ప్రజల వయస్సు రాత్రికి రాత్రే ఒకటి రెండేండ్లు తగ్గిపోయింది. బుధవారం తెల్లారేసరికల్లా వాళ్లంతా ఒకటి రెండేండ్లు చిన్నవాళ్లు అయిపోయారు. సౌత్ కొరియాలో ఇప్పటివరకూ కొరియన్ ఏజ్, కేలండర్ ఏజ్, ఇంటర్నేషనల్ ఏజ్ అనే మూడు రకాల వయసు లెక్కింపు పద్ధతులను వాడటంతో గందరగోళం ఏర్పడుతోంది. ఈ గందరగోళానికి తెరదించేందుకని అంతర్జాతీయ విధానాన్ని మాత్రమే అమలు చేయడం కోసం తెచ్చిన చట్టం బుధవారం నుంచి అమలులోకి వచ్చింది. 

దీంతో అందరి ఏజ్ రాత్రికి రాత్రే తగ్గిపోయింది. ఈ చట్టాన్ని పోయిన ఏడాది డిసెంబర్ లోనే పార్లమెంట్ ఆమోదించింది. ఇకపై అన్ని జ్యుడీషియల్, అడ్మినిస్ట్రేటివ్ విషయాల్లో అంతర్జాతీయ వయసు లెక్కింపు విధానాన్నే అనుసరిస్తారని, దీనివల్ల సామాజిక గందరగోళాలు, వివాదాలు తగ్గుముఖం పడతాయని గవర్నమెంట్ లెజిస్లేషన్ మంత్రి లీ వాంక్యూ వెల్లడించారు. 

ఒక్కొక్కరికి మూడు ఏజ్ లు.. 

ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాల్లో ‘ఇంటర్నేషనల్ ఏజ్’ విధానమే అమలులో ఉంది. ఈ పద్ధతిలో ఒక వ్యక్తి పుట్టగానే అతని వయసు ‘జీరో’తో మొదలవుతుంది. ప్రతి ఏడాదీ అదే తేదీన అతని వయసు కూడా ఒక్కో ఏడాది పెరుగుతూ పోతుంది. అయితే, సౌత్ కొరియాలో దీనితో పాటు మరో రెండు విధానాలు కూడా ఉన్నాయి. వీటిలో చైనా నుంచి సంప్రదాయంగా వచ్చిన కొరియన్ ఏజ్ విధానం ప్రకారం.. పిల్లలు పుట్టగానే ఒక ఏడాది వయసు ఉ న్నట్లు లెక్కిస్తారు. ఆ తర్వాత వచ్చే ప్రతి జనవరి 1వ తేదీన ఒక్కో ఏడాదిని పెంచుతూ పోతారు. అలాగే ఇంటర్నేషనల్, కొరియన్ ఏజ్ రెండు పద్ధతులనూ కలిపి తయారు చేసిన కేలండర్ ఏజ్ విధానంలోనూ వయసును లెక్కిస్తారు. 

ఇందులో బిడ్డ పుట్టినప్పుడు ‘జీరో’తోనే ఏజ్ ను లెక్కిస్తారు. కానీ ప్రతి జనవరి 1న ఒక్కో ఏడాదిని పెంచుతారు. ఉదాహరణకు గంగ్నమ్ స్టైల్ సింగర్ సై విషయం తీసుకుంటే.. అతను డిసెంబర్ 31, 1977న పుట్టాడు. అతడి వయసు ఇంటర్నేషనల్ ఏజ్ ప్రకారం 45, కేలండర్ ఇయర్ ఏజ్ ప్రకారం 46, కొరియన్ ఏజ్ ప్రకారం 47 ఏండ్లుగా ఉంది. ఒక్కరోజు తేడాతోనే అతడి ఏజ్ ఏకంగా ఏడాది, రెండేండ్లు పెరిగిపోయింది. ఇలా కొరియన్లందరి ఏజ్ ల విషయంలో ఇలాంటి గందరగోళమే నెలకొంది. 

ఇకపై ఇంటర్నేషనల్ విధానమే.. 

దక్షిణ కొరియా జనాలు తమ రోజువారీ జీవి తంలో, సామాజిక, ఉద్యోగ అంశాల్లో మూడు రకాల ఏజ్ లను వినియోగిస్తుండటంతో కన్ఫ్యూజన్ ఏర్పడుతోంది. చట్టపరమైన, అధికారిక విషయాల్లో ఇంటర్నేషనల్ ఏజ్ ను.. స్మోకింగ్, డ్రింకింగ్, నిర్బంధ సైనిక శిక్షణ వంటి అంశాల్లో కేలండర్ ఏజ్ ను.. ఇన్సూరెన్స్ పాలసీలు, వెల్ఫేర్ స్కీంలకు కొరియన్ ఏజ్ ను వాడుతుండటంతో గందరగోళం నెలకొంటోంది. ఈ నేపథ్యంలో గందరగోళానికి తెరదించుతూ ఇకపై పుట్టిన తేదీని మాత్రమే ప్రామాణికంగా తీసుకుని అంతర్జాతీయ విధానం ప్రకారమే వయసును లెక్కించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సర్కారు నిర్ణయానికి ఏకంగా 86.2% మంది జనం ఓకే చెప్పారని అధికారులు నిర్వహించిన సర్వేలో తేలింది.