‘టైగర్​ హిల్​’ పై త్రివర్ణ పతాకం ఎగిరేలా చేయాలి

‘టైగర్​ హిల్​’  పై త్రివర్ణ పతాకం ఎగిరేలా చేయాలి

‘‘చావుకు నేను భయపడలేదు. కానీ, అప్పుడు నా కోరిక ఒకటే. యుద్ధంలో మనం గెలవాలి. చనిపోవడానికి ముందు ‘టైగర్​ హిల్​’పై తిరిగి మన త్రివర్ణ పతాకం ఎగిరేలా చేయాలి’’.. ఓ సైనికుడి మనసులోని మాటలకు అక్షర రూపమిది. అది కార్గిల్​ యుద్ధం.. ఆ వీరుడు యోగేంద్ర సింగ్​ యాదవ్​. ఆ యోధుడి పోరాటాన్ని కళ్లకు కట్టినట్లు చెప్తుంది ‘ది హీరో ఆఫ్​ టైగర్​ హిల్​’ పుస్తకం. భారత అత్యున్నత సైనిక పురస్కారం ‘పరమవీర చక్ర’ పొందిన చిన్నవయసువాడిగా రికార్డుకెక్కిన యోగేంద్ర సింగ్​ యాదవ్​ ​జీవితచరిత్ర ఇది. ఈ పుస్తకాన్ని రాసింది కూడా ఆయనే.​ ఈ పుస్తకంలో బాల్యం, సైన్యంలో చేరడం, కార్గిల్​వార్​ అనే మూడు చాప్టర్లు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్​లోని బులంద్​షహర్​ జిల్లాలో ఉన్న ఒక మారుమూల గ్రామంలో పుట్టాడు యోగేంద్ర​. తండ్రి రిటైర్డ్​ ఆర్మీ సిపాయి. చిన్నప్పుడు అన్నలతో కలసి యోగేంద్ర చేసిన అల్లరి, ఆడుకున్న ఆటలు, పొలం పనులు, ఇంట్లో తండ్రి చెప్పిన క్రమశిక్షణ పాఠాలు.. మొదటి చాప్టర్​లో కనిపిస్తాయి. తండ్రి బాటలో నడిచేందుకు సిద్ధమవడం నుంచి సైన్యంలో చేరడం వరకు పడిన కష్టం రెండో భాగంలో ఉంది. అసలైనది, ఆఖరుది ఉత్కంఠతతో చదివించేది మూడో భాగమైన ‘కార్గిల్​ వార్’. వేల అడుగుల ఎత్తులోని టైగర్​హిల్​పై శత్రుసైనికులతో యోగేంద్ర, మరికొందరు భారత సైనికులు చేసిన వీరోచిత పోరాటం ఇందులో కనిపిస్తుంది. 

అప్పటికి యోగేంద్రకు 19 ఏండ్లు. భారత ఆర్మీలోని ఘాతక్​ ప్లటూన్​కు చెందిన 18 గ్రెనేడియర్స్​ రెజిమెంట్​లో పనిచేస్తున్నాడు. దొడ్డిదారిన, అక్రమంగా వచ్చి కార్గిల్​ సెక్టార్​లోని టైగర్​ హిల్​పై తిష్ట వేసిన పాక్​ సైన్యాన్ని తరిమికొట్టేందుకు రంగంలోకి దిగింది యోగేంద్ర ఉన్న టీమ్​​. అప్పటికే టోలోలింగ్​ పర్వతం దగ్గర ఉన్న పాక్​ సైనికులను తుదముట్టించి వచ్చింది ఈ టీమ్​. కానీ, ఈసారి శత్రు సైనికులు ఎత్తైన చోట ఉండడంతో వాళ్లను ఎదుర్కోవడం అంత సులభం కాదు. ముందు వెళ్లేవాళ్లు శత్రువుల తుపాకీలకు టార్గెట్​ అవుతారు. అలాంటి పరిస్థితుల్లో తానే ముందు నడిచాడు యోగేంద్ర. బుల్లెట్​ దెబ్బలు తగులుతున్నా, గ్రెనేడ్​ పేలుళ్లలో ఎగిరిపడుతున్న రాళ్లు, రప్పలు తగులుతున్నా లెక్కచేయలేదు. చివరికి తాను అనుకున్నది సాధించాడు. యుద్ధంలో తన టీమ్​లోని అందరూ చనిపోయినా, తుదివరకు పోరాడి భారత జెండాను ఎగరేశాడు. తీవ్రంగా గాయపడిన యోగేంద్ర ఆరునెలల పాటు మంచానికే పరిమితమయ్యాడు. ఆ తర్వాత సైన్యం నుంచి రిటైర్​ అయ్యాడు. అతని పోరాటాన్ని గుర్తించిన ప్రభుత్వం ‘పరమవీర చక్ర’తో సత్కరించింది. ఆంగ్లంలో వచ్చిన ‘ది హీరో ఆఫ్​ టైగర్​ హిల్’ పుస్తకంలోని భాష అందరికీ సులువుగా అర్థమయ్యే​లా ఉంది. కానీ, అక్షరదోషాలు ఇబ్బంది పెడతాయి.  
::: సాయిప్రేమ్​