కరెంటు బిల్లులకే ఏటా రూ.11 వేల కోట్లు

కరెంటు బిల్లులకే ఏటా రూ.11 వేల కోట్లు

ప్రాజెక్టుల లిఫ్టులు, భగీరథ నిర్వహణకు మస్తు ఖర్చు
 రాష్ట్ర బడ్జెట్‌‌‌‌లో 8 శాతం నిధులు వీటికే
మున్ముందు ఇంకింత పెరగనున్న భారం
మెయింటెనెన్స్‌‌‌‌ ఖర్చంతా ప్రజలపైనే?

హైదరాబాద్‌‌‌‌, వెలుగురాష్ట్రంలోని నీటి పథకాల ఆపరేషన్‌‌‌‌, మెయింటెనెన్స్‌‌‌‌ కరెంటు ఖర్చులు షాక్‌‌‌‌ కొట్టేలా పెరుగుతున్నయ్‌‌‌‌. బడ్జెట్‌‌‌‌లో 8 శాతం నిధులు వీటి నిర్వహణకే ఖర్చయిపోనున్నయ్‌‌‌‌. ఉన్న ప్రాజెక్టులకు ఏటా రూ. 11 వేల కోట్ల వరకు ఖర్చవుతాయని, సర్కారు ప్రతిపాదించిన ఇంకిన్ని ప్రాజెక్టులు పూర్తయితే మోయలేని బరువైతుందని నిపుణులు చెబుతున్నరు. ఆ ఖర్చంతా ప్రజలపైనే పడుతుందంటున్నారు. ప్రభుత్వం చెబుతున్న వరకే కరెంట్‌‌‌‌ బిల్లులు, మెయింటనెన్స్‌‌‌‌ ఖర్చులుంటాయని అనుకోవద్దని, ప్రాక్టికల్‌‌‌‌ లెక్కలు వేరే ఉంటాయని ఇరిగేషన్‌‌‌‌ ఇంజనీర్లు అంటున్నరు.

ఐదేండ్లకు రూ. 40 వేల కోట్లన్నరు

2020-–21 నుంచి 2024–25 వరకు లిఫ్ట్‌‌‌‌ ఇరిగేషన్‌‌‌‌ ప్రాజెక్టుల కరెంట్‌‌‌‌ బిల్లుల కోసం రూ.37,796 కోట్లు అవసరమని ఇరిగేషన్‌‌‌‌ అధికారులు ప్రపోజల్స్‌‌‌‌ రెడీ చేశారు. ఈ ఐదేళ్లలో మోటార్లు, పంపులు, కాల్వలు, టన్నెళ్లు, పంపుహౌస్‌‌‌‌లు, రిజర్వాయర్లు, ప్రాజెక్టుల గేట్లు ఇతరత్రా మెయింటనెన్స్‌‌‌‌ కోసం ఇంకో రూ.2,374 కోట్లు కావాలని లెక్కగట్టారు. మొత్తంగా ఐదేళ్లలో రూ.40,170 కోట్లు ఓ అండ్‌‌‌‌ ఎంకు అవసరమని లెక్కేసి ఈ పనులకు త్వరలోనే టెండర్లు పిలిచేందుకు రెడీ అవుతున్నారు. దీనికితోడు మిషన్‌‌‌‌ భగీరథ వాటర్‌‌‌‌ ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ ప్లాంట్లు, ఇంటేక్‌‌‌‌ వెల్స్‌‌‌‌, పైపు లైన్లు, ట్యాంకులు ఇతరత్రా నిర్వహణకు యేటా రూ.2,554.41 కోట్లు అవసరమని ప్రభుత్వం ప్రకటించింది. వచ్చే ఐదేళ్లలో భగీరథ ఓ అండ్‌‌‌‌ ఎంకు రూ.12,772.05 కోట్లు ఖర్చవుతాయని తేల్చింది. భగీరథను కలుపుకుంటే కరెంటు బిల్లుల ఖర్చులు ప్రభుత్వ లెక్కల ప్రకారం ఐదేళ్లకు సుమారు రూ. 53 వేల కోట్లు కానుంది.

పాలమూరు స్టార్టయితే..

పాలమూరు–రంగారెడ్డి లిఫ్ట్‌‌‌‌ స్కీంలో వచ్చే వానాకాలంలో మూడు పంపుహౌస్‌‌‌‌లు నడిపించాలని గతంలో సీఎం ఆదేశించారు. ఈ లెక్కన ప్రాజెక్టుకు మొత్తం కరెంట్‌‌‌‌ డిమాండ్‌‌‌‌ 4,720 మెగావాట్లు కాగా 2021 జూన్‌‌‌‌ నాటికి 1,740 మెగావాట్లు అవసరమని అంచనా వేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే అదనంగా ఇంకో రూ.4 వేల కోట్లకు పైనే కరెంటు బిల్లులు అవసరమని భావిస్తున్నారు. కాళేశ్వరం అదనపు టీఎంసీ, సీతారామతో సాగర్‌‌‌‌ ఎడమ కాలువ లింక్‌‌‌‌, నిజాంసాగర్‌‌‌‌ పునరుజ్జీవం, మరికొన్ని లిఫ్ట్‌‌‌‌ స్కీంలపైనా సర్కారు ప్రపోజల్స్‌‌‌‌ రెడీ చేయిస్తోంది. అవి ఇంకో రెండు, మూడేళ్లలో కంప్లీటైతే కరెంటు డిమాండ్‌‌‌‌ మొత్తంగా 14 వేల మెగావాట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. అప్పుడు బిల్లులు కట్టడం ఆషామాషీ విషయం కాదంటున్నారు.

నీళ్లు ఎత్తనీకే రూ. 8 వేల కోట్లు!

కృష్ణాపై ఏర్పాటు చేసిన కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌‌‌‌సాగర్‌‌‌‌, ఏఎమ్మార్పీ, గుత్ప, అలీసాగర్‌‌‌‌, సాగర్‌‌‌‌ లిఫ్టులు, గోదావరిపై దేవాదుల సహా 14 స్కీంలకు రోజుకు 1,500 మెగావాట్ల కరెంట్‌‌‌‌ అవసరం. వీటికి యేటా రూ.1,800 కోట్లు బిల్లుగా చెల్లిస్తున్నారు. ఇప్పటికే రూ.3,200 కోట్ల బిల్లులు పెండింగ్‌‌‌‌ ఉన్నట్టు ఇంజనీర్లు చెబుతున్నారు. వచ్చే జూన్‌‌‌‌లో సీతారామ ఎత్తిపోతల కొంత మేరకు, ఎస్సారెస్పీ పునరుజ్జీవం ప్రారంభం కానున్నాయి. వాటినీ లెక్కేస్తే ఏటా రాష్ట్రంలోని ప్రాజెక్టులకు మొత్తంగా 5,500 మెగావాట్ల వరకు అవసరమని లెక్క తేల్చారు. ఈ లెక్కన వచ్చే ఫ్లడ్‌‌‌‌ సీజన్‌‌‌‌లో నీళ్ల ఎత్తిపోతలకు రూ.8 వేల కోట్ల వరకు కరెంట్‌‌‌‌ బిల్లులే కట్టాల్సి వస్తుందంటున్నారు. వీటికి భగీరథ నిర్వహణ కలుపుకుంటే ఈ యేడు వానాకాలంలో ఇరిగేషన్‌‌‌‌, డ్రికింగ్‌‌‌‌ వాటర్‌‌‌‌ కరెంట్‌‌‌‌ బిల్లులు, మెయింటనెన్స్‌‌‌‌కు రూ.11 వేల కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు.

పన్నుల నుంచి వచ్చిన పైసలతోనే

ఓ అండ్‌‌‌‌ ఎంకు బడ్జెట్‌‌‌‌లోనే నిధులు కేటాయిస్తామని సీఎం ప్రకటించారు. వచ్చే బడ్జెట్‌‌‌‌లో లిఫ్టులు, భగీరథ మెయింటనెన్స్‌‌‌‌ పద్దును ప్రత్యేకంగా పెడుతున్నట్టు అధికారులు తెలిపారు. ప్రజలు పన్నుల రూపంలో చెల్లించే డబ్బు నుంచే ఈ మొత్తాన్ని చెల్లించక తప్పని పరిస్థితి నెలకొంది. ఇప్పటికైతే కరెంట్‌‌‌‌ బిల్లుల భారాన్ని రైతులపై మోపబోమని ప్రభుత్వం చెబుతున్నా ఇన్‌‌‌‌డైరెక్ట్‌‌‌‌ ట్యాక్స్‌‌‌‌లు కడుతున్న వారిలో రైతులు ఉంటారని, కాబట్టి వాళ్లపైనా భారం ఉంటుందని అధికారులు
చెబుతున్నారు.

కాళేశ్వరం లెక్క మారిపోయింది

కరెంటు లెక్కలపై ప్రభుత్వం ప్రకటించిన లెక్కలు చాలా వరకు తారుమారైతున్నయి. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి వచ్చే జూన్‌‌‌‌లో రోజుకు 2 టీఎంసీల నీరు లిఫ్ట్‌‌‌‌ చేయాలని సర్కారు టార్గెట్‌‌‌‌గా పెట్టుకుంది. మేడిగడ్డ నుంచి కొండపోచమ్మ సాగర్‌‌‌‌ వరకు 490 మీటర్ల ఎత్తుకు నీళ్లను ఎత్తిపోయడానికి 3,603.80 మెగావాట్ల కరెంట్‌‌‌‌ అవసరమవుతుంది. ఈ ఒక్క ప్రాజెక్టులో నీళ్లు ఎత్తిపోయడానికే రూ.4 వేల కోట్లు ఖర్చవుతుందని ఇంజనీర్లు లెక్కగడుతున్నారు. కానీ సర్కారేమో ప్రాజెక్టుకు పూర్తి కరెంటును (4,992.47 మెగావాట్లు) వాడితే రూ.4,067.40 కోట్లే అవుతుందని చెప్పింది.

మరిన్ని వార్తల కోసం