- విధ్వంసక శక్తుల ఆధిపత్యం శాశ్వతం కాదు: ప్రధాని మోడీ
- అబద్ధాలెన్నడూ నిజాన్ని ఓడించలేవు.. టెర్రర్‌తో విశ్వాసాన్ని నాశనం చేయలేరు
- సోమ్‌నాథ్ ఆలయంలో పలు ప్రాజెక్టులను వర్చువల్‌గా ప్రారంభించిన పీఎం
సోమ్‌నాథ్: ‘‘విధ్వంసక శక్తులు, టెర్రరిజం ద్వారా సామ్రాజ్యాలను సృష్టించే ఐడియాలజీని ఫాలో అయ్యే వ్యక్తులు కొన్నాళ్లు ఆధిపత్యం చెలాయించవచ్చు. కానీ వారి ఉనికి శాశ్వతం కాదు.. మానవత్వాన్ని ఎన్నటికీ అణిచివేయలేరు’’ అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఇలాంటి ఐడియాలజీనే అనుసరిస్తున్న కొంతమంది వల్ల ప్రపంచం ఆందోళన చెందుతోందని చెప్పారు. పరోక్షంగా అఫ్గాన్ పరిస్థితిని ఉద్దేశించి ఆయన ఈ కామెంట్స్ చేశారు. మనలోని ఆధ్యాత్మిక చింతన వల్లే వందల ఏళ్లుగా దేశం సమైక్యంగా ఉందని ప్రధాని చెప్పారు. పలు రీజియన్ల పురోగతి కోసం, స్థానికంగా కొత్త ఉద్యోగ అవకాశాల కోసం స్పిరిచ్యువల్ టూరిజాన్ని అభివృద్ధి చేయాల్సి ఉందని పిలుపునిచ్చారు. గుజరాత్‌లోని గిర్ సోమ్‌నాథ్ జిల్లాలో సోమ్‌నాథ్ ఆలయంలో చేపట్టిన పలు ప్రాజెక్టులను వర్చువల్‌గా ఆయన ప్రారంభించారు. ‘‘సోమ్‌నాథ్ ఆలయాన్ని గతంలో ఎన్నో సార్లు ధ్వంసం చేశారు. దేవతా విగ్రహాలను అపవిత్రం చేశారు. ఆలయాన్నే నామరూపాలు లేకుండా చేయాలని ప్రయత్నించారు. కానీ విధ్వంసం జరిగిన ప్రతిసారి ఆలయం మరింత వైభవాన్ని సంతరించుకుంది” అని చెప్పారు. ‘‘ప్రపంచానికి ఈ ఆలయం ఓ మెసేజ్ ఇచ్చింది. అబద్ధాలెన్నడూ నిజాన్ని ఓడించలేవు. టెర్రర్ ద్వారా విశ్వాసాన్ని నాశనం చేయలేరు” అని అన్నారు.
టూరిజంలో ముందున్నం
ట్రావెల్, టూరిజం కాంపిటేటివ్‌నెస్ ఇండెక్స్‌లో 2013లో 65వ స్థానంలో ఉన్న ఇండియా.. 2019 నాటికి 34వ స్థానానికి చేరుకుందని ప్రధాని చెప్పారు. ప్రస్తుత సోమ్‌నాథ్ ఆలయాన్ని నిర్మించడంలో ప్రధాన పాత్ర పోషించిన దేశ తొలి హోం మంత్రి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్‌ను గుర్తు చేసుకున్నారు. గుడి నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, ఫ్రీడమ్ ఫైటర్ కేఎం మున్షీకి నివాళులు అర్పించారు.
3 ప్రాజెక్టులు ప్రారంభం
శ్రీ సోమ్‌నాథ్ ట్రస్ట్ చైర్మన్ అయిన మోడీ.. 49 కోట్లతో నిర్మించిన ‘సముద్ర దర్శన్’, 75 లక్షలతో నిర్మించిన మ్యూజియం, 3.5 కోట్లతో పునరుద్ధరించిన అహిల్యాబాయ్ హోల్కర్ టెంపుల్ (పాత సోమ్‌నాథ్ ఆలయం)ను ప్రారంభించారు. 30 కోట్లతో నిర్మించనున్న పార్వతీ టెంపుల్‌కు శంకుస్థాపన చేశారు.

