ఆయుష్మాన్ రానియ్యరు.. ఆరోగ్యశ్రీలో  చేర్చరు

ఆయుష్మాన్ రానియ్యరు.. ఆరోగ్యశ్రీలో  చేర్చరు
  • కరోనా పేషెంట్లతో ఆడుకుంటున్న రాష్ట్ర సర్కార్
  • ప్రకటనలకే పరిమితమైన హామీలు
  • ఖజానాపై భారం పడొద్దని వెనుకడుగు
  • ఆయుష్మాన్ భారత్​​లో చేర్చకపోవడంతో ఏటా రూ. 200 కోట్ల నష్టం  
  • ఏపీలో రెండు స్కీంలూ  అమలు.. ఫ్రీగా ట్రీట్​మెంట్
  • మన దగ్గర హాస్పిటల్​ ఫీజుల కోసం జనం తిప్పలు


హైదరాబాద్, వెలుగు:  కరోనా సోకి జనం అల్లాడిపోతుంటే.. వాళ్లకు ఫ్రీ ట్రీట్​మెంట్​ అందించాల్సిన రాష్ట్ర సర్కారు తనపై భారం పడకుండా చూసుకుంటోంది. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రయోజనాలు కూడా కరోనా పేషెంట్లకు అందకుండా చేస్తోంది. కార్పొరేట్​ హాస్పిటళ్లకు మేలు చేసేలా వ్యవహరిస్తోంది. ఇటు రాష్ట్ర ప్రభుత్వ స్కీం అయిన ‘ఆరోగ్య శ్రీ’లో కరోనా ట్రీట్​మెంట్​ను చేర్చక.. అటు కేంద్ర ప్రభుత్వ స్కీం అయిన ‘ఆయుష్మాన్​ భారత్​’ను అమలు చేయక ప్రజల ప్రాణాలతో ఆడుకుంటోందన్న విమర్శలు వస్తున్నాయి. ప్రైవేటు హాస్పిటళ్లు వేసే లక్షల ఫీజులను చెల్లించేందుకు జనం ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తోంది. అప్పులు చేయాల్సి వస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 21 వేల మంది కార్పొరేట్​, ప్రైవేటు హాస్పిటళ్లలో ట్రీట్​మెంట్​ పొందుతున్నారు. వీరిలో సగటున ప్రతి ఒక్కరూ రోజూ రూ. 50 వేల దాకా ఫీజులు చెల్లించాల్సి వస్తోంది. అంటే రోజూ వంద కోట్ల రూపాయల దాకా ప్రైవేటు హాస్పిటళ్లకు వెళ్తున్నాయి. 

ఏడు నెలల కింద సీఎం ఓకే చెప్పినా..?

కరోనా ట్రీట్​మెంట్​ను ఆరోగ్య శ్రీలో చేర్చాలని, ఆయుష్మాన్​ భారత్​ స్కీంను అమలు చేయాలన్న డిమాండ్​లు గత ఏడాది కరోనా కేసులు మొదలైనప్పటి నుంచి వస్తున్నాయి. ప్రజల నుంచి ఒత్తిడి పెరగడంతో ఆరోగ్యశ్రీలోకి కరోనా ట్రీట్​మెంట్​ను చేరుస్తామని ఏడు నెలల కింద సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించి వదిలేశారు. కానీ,  ఇంతవరకూ అమలు చేయట్లేదు. ‘ఆయుష్మాన్ భారత్’లో చేరుతామన్నా అదీ పత్తా లేదు. 

కార్పొరేట్​ దోపిడీపై ప్రేక్షక పాత్ర

కరోనా సెకండ్ వేవ్ తీవ్రమైనప్పటి నుంచీ కార్పొరేట్, ప్రైవేట్​ హాస్పిటళ్లు లక్షల్లో ఫీజులు గుంజుతున్నాయి. పైరవీలు చేసుకుంటే కానీ బెడ్లు దొరకడం లేదు. ఒక వేళ దొరికినా కనీసం లక్ష, రెండు లక్షలు అడ్వాన్  కట్టాల్సిన దుస్థితి నెలకొంది. రోజూ లక్షల్లో బిల్లులు వేస్తున్నారు. గవర్నమెంట్​ హాస్పిటళ్లకు పోతే సౌకర్యాలు సరిగ్గా ఉండటం లేదని కార్పొరేట్​, ప్రైవేటు హాస్పిటళ్ల వైపే ప్రజలు మొగ్గుచూపుతున్నారు. దీంతో ఆ హాస్పిటళ్లను ఇష్టారీతిగా ఫీజులు వేసి దోచుకుంటున్నాయి. ఇంత ఫీజు చెల్లించలేమని, కొంతైనా తగ్గించాలని కాళ్లావేళ్లా పడినా కనికరం చూపడం లేదు. పేషెంట్ చనిపోయినా చెప్పినంత ఫీజు కట్టాల్సిందేనని, లేకపోతే శవాన్ని ఇవ్వబోమని మొండికేసిన ఘటనలు అనేకం ఉన్నాయి. కార్పొరేట్​ హాస్పిటళ్ల దోపిడీపై ప్రభుత్వ టోల్ ఫ్రీ నంబర్లకు దాదాపు 5 వేల ఫిర్యాదులు వచ్చినట్టు్ తెలుస్తోంది. దోపిడీని కట్టడి చేయాల్సిన ప్రభుత్వం ప్రేక్షక పాత్ర పోషిస్తోందన్న ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఇంతవరకు ఏ ఒక్క దవాఖానపై చర్యలు తీసుకోలేదు.  వేలాది మంది ప్రజలు ఆస్తులను అమ్ముకొని, అప్పులు చేసి ఫీజులు కట్టాల్సి వస్తోంది. 

కార్పొరేట్​ ఆదాయం తగ్గొద్దు.. 

ఆరోగ్య శ్రీలో కరోనా ట్రీట్​మెంట్​ను చేర్చొద్దని చాలా కార్పొరేట్​హాస్పిటళ్లు పైరవీలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం కూడా ఆరోగ్యశ్రీలో  చేరిస్తే ఖజానాపై భారం పడుతుందన్న ఆలోచనతోనే  ముందుకు వెళ్లడం లేదని అధికార వర్గాల్లో చర్చ నడుస్తోంది. ‘‘ఇప్పుడు అలా ట్రీట్​మెంట్ చేయగానే ఇలా లక్షల్లో ఫీజు వస్తోంది. అదే ఆరోగ్య శ్రీలో చేరిస్తే  ప్రభుత్వం ఎప్పుడు ఫీజు రీయింబర్స్​మెంట్​ చేస్తుందో తెల్వదు. అందుకే ఆరోగ్యశ్రీలో కరోనా ట్రీట్​మెంట్​ను చేర్చకుండా కార్పొరేట్​ వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి’’ అని ఓ సీనియర్ ఆఫీసర్  చెప్పారు. ఆరోగ్య శ్రీ కింద ఇతర వ్యాధుల పేషెంట్లకు  ట్రీట్​మెంట్ చేసిన ఆసుపత్రులకు ఇప్పటికే ప్రభుత్వం సుమారు రూ. 500 కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఆ బిల్లులు చెల్లించాలని ఆసుపత్రులు ఒత్తిడి తెస్తున్నాయి. ‘‘ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్య శ్రీలో కరోనా ట్రీట్​మెంట్​ను చేరిస్తే ప్రభుత్వంపై మరింత  భారం పడుతుంది. దీన్ని భరించే ఆలోచనలో ప్రభుత్వం లేదు’’ అని ఫైనాన్స్ డిపార్ట్​ మెంట్ వర్గాలు అంటున్నాయి. 

ప్రభుత్వ ఆసుపత్రుల్లో భరోసా ఏది? 

ప్రభుత్వంలోని కీలక వ్యక్తులు కరోనా ట్రీట్​మెంట్​కు ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేరట్లేదు.మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు కార్పొరేట్​ హాస్పిటళ్లలోనే చేరుతున్నారు. దీంతో సాధారణ ప్రజలు సర్కారు హాస్పిటళ్లలో చేరేందుకు జంకుతున్నారు. మరోవైపు ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరైన ట్రీట్​మెంట్​ అందట్లేదని ఫిర్యాదులు ఉన్నాయి. చాలా ఆసుపత్రుల్లో సీటీ స్కాన్ వంటి మెషీన్లు కూడా లేవు. కొన్ని చోట్ల డాక్టర్ల కొరత ఉంటే, మరికొన్ని చోట్లు పారా మెడికల్ స్టాఫ్​ కొరత ఉంది. దీంతో గవర్నమెంట్​ హాస్పిటళ్లలో చేరేందుకు జనం భయపడుతున్నారు. అప్పోసప్పో చేసి ప్రైవేటులోనే ట్రీట్​మెంట్​ కోసం ప్రయత్నిస్తున్నారు.  

ప్రకటనలకే పరిమితమైన సీఎం హామీ

గతేడాది కేసులు మొదలైనప్పటి నుంచే కరోనా ట్రీట్​మెంట్​ను ఆరోగ్య శ్రీలో చేర్చాలని డిమాండ్  వచ్చింది. దీంతో సీఎం కేసీఆర్ 2020 సెప్టెంబర్​ 9న అసెంబ్లీలో మాట్లాడుతూ ‘‘ఆరోగ్యశ్రీలో కరోనా ట్రీట్​మెంట్ ను చేర్చడాన్ని పరిశీలిస్తాం’’ అని చెప్పారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో ట్రీట్​మెంట్​ చేయించుకుని, ఫీజులు చెల్లిస్తే వాటికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద సాయం చేస్తామని హామీ ఇచ్చారు.కానీ సీఎంఆర్ఎఫ్  కోసం అప్లయ్​ చేసుకుంటే రిజెక్ట్​ చేస్తున్నారని జనం అంటున్నారు.  

ఆరోగ్యశ్రీ లో చేర్చాలి 

గత నెల 26న కరోనా రావడంతో సూర్యాపేట జనరల్ హాస్పిటల్​లో అడ్మిట్ అవుదామని వెళ్తే జాయిన్​ చేసుకోలేదు. దీంతో అక్కడే  ప్రైవేట్ హాస్పిటల్​లో ట్రీట్​మెంట్​ తీసుకున్న. రూ. 3.28 లక్షలు ఖర్చు అయ్యాయి. మధ్యతరగతి కుటుంబానికి చెందిన మాకు ప్రభుత్వం ఎలాంటి సాయం చేయడంలేదు.  కనీసం కరోనా ట్రీట్​మెంట్​నైనా 
ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చాలి.
‑ లక్ష్మణ్, సూర్యాపేట

హాస్పిటల్​ ఫీజుల కోసం అప్పులు

ఆదిలాబాద్​ జిల్లా బుకతపూర్​కు చెందిన ప్రఫుల్ తన తల్లి రత్నప్రభకు కరోనా సోకడంతో 10 రోజుల కింద ప్రైవేట్ హాస్పిటల్​లో జాయిన్ చేశాడు. కిరాణా దుకాణా నడిపితే కానీ ఇల్లు గడవని ఆ కుటుంబం.. ప్రైవేటులో ఫీజుల కోసం లక్షలు ఖర్చు చేయాల్సి వస్తోంది. 5 రెమ్డిసివిర్​ ఇంజక్షన్లతో కలిపి ఇప్పటికి రూ. 4 లక్షలు ఖర్చయ్యాయి. అప్పులు చేయాల్సి వచ్చిందని, అదే ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ కింద ట్రీట్​మెంట్​ఉంటే ఫ్రీగా ట్రీట్​మెంట్​ అందేదని, తాను అప్పులు చేయాల్సి పరిస్థితి వచ్చేది కాదని ప్రపుల్​ అన్నాడు. ఇంకా ఎంత ఖర్చు అవుతుందో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. 

‘ఆయుష్మాన్’లో చేరితే 30 లక్షల మందికి మేలు

కేంద్ర ప్రభుత్వ పథకమైన ‘ఆయుష్మాన్​ భారత్’లో రాష్ట్రం చేరితే.. ఎందరికో ప్రయోజనం చేకూరనుంది. కానీ, ఆ పథకాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదు. అందులో చేరడం లేదు.  పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్​లో ఆరోగ్యశ్రీతోపాటు ఆయుష్మాన్ భారత్​ కింద కరోనా పేషెంట్లకు ఫ్రీగా ట్రీట్​మెంట్​ అందిస్తున్నారు. ప్రజల నుంచి వచ్చిన ఒత్తిడితో ఆయుష్మాన్​ భారత్​లో చేరుతామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినా ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. గత ఏడాది డిసెంబర్ 30న ప్రధాని మోడీ నిర్వహించిన వీడియో కాన్పరెన్స్ లో సీఎస్ సోమేశ్ కుమార్.. రాష్ట్రంలో ఆయుష్మాన్​ భారత్​ను అమలు చేస్తామని చెప్పారు. దీనికి సంబంధించి ఓ కమిటీని మాత్రమే ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు. ఇంతవరకు ఆయుష్మాన్​ భారత్​లో రాష్ట్ర ప్రభుత్వం చేరలేదు. ఈ​ స్కీంలో  చేరితే  ఏటా కేంద్రం నుంచి సుమారు రూ. 200 కోట్ల నిధులు రావడంతో పాటు దాదాపు 30 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుంది.