మానసిక ఒత్తిడిలో ఉద్యోగుల ఆత్మహత్యలు

మానసిక ఒత్తిడిలో ఉద్యోగుల ఆత్మహత్యలు

 

  •  ఈ నెల 18న కామారెడ్డిలో కండక్టర్ ఆత్మహత్య
  •     ఇటీవల హైదరాబాద్‌, ఖమ్మంలో సూసైడ్‌ ఘటనలు
  •     మైలేజ్, కలెక్షన్ తగ్గితే జీతంలో కట్ చేస్తామని నోటీసులు

హైదరాబాద్‌, వెలుగు: ఆర్టీసీ ఉద్యోగులపై అధికారుల వేధింపులు ఆగడం లేదు. వేధింపులు భరించలేక కొందరు ఎంప్లాయీస్‌ ఆత్మహత్య చేసుకున్నారు. శనివారం కామారెడ్డిలో ఓ కండక్టర్ సూసైడ్‌ చేసుకోగా, ఇటీవల ఖమ్మం, హైదరాబాద్‌తో పాటు పలు చోట్ల ఉద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. మరికొందరు ఆత్మాహత్యాయత్నం చేశారు. కేఎంపీఎల్‌ రావడం లేదని, కలెక్షన్ తగ్గిందని జీతంలో నుంచి కట్ చేస్తామని ఇటీవల కొంత మందికి నోటీసులు కూడా ఇచ్చారు. ఇష్టమొచ్చినోళ్లకు డ్యూటీలు, ఓడీలు ఇస్తుండగా, నచ్చనోళ్లకు డ్యూటీలు ఇవ్వకుండా డిపో స్పేర్‌లో పెడుతున్నరు. ఇక, యూనియన్ల స్థానంలో తీసుకొచ్చిన వెల్ఫేర్ కౌన్సిల్స్ పేరుకే పరిమితమయ్యాయి. 

పేరుకే వెల్ఫేర్‌ కౌన్సిల్స్‌.. 

ఆర్టీసీలో వెల్ఫేర్ కౌన్సిల్స్ నామామాత్రంగా ఉన్నాయనే అపవాదు ఉంది. 2020 ఫిబ్రవరిలో కొత్తగా వెల్ఫేర్‌ కౌన్సిల్స్‌ను ఏర్పాటు చేశారు. డిపోకు నలుగురు చొప్పున సభ్యులను నియమించారు. ఇందులో భాగంగా ప్రతి డిపోలో ఫిర్యాదుల బాక్స్​ను తీసుకొచ్చారు. కార్మికులు.. యూనియన్ల జోలికి పోకుండా తమ సమస్యలు, ఫిర్యాదులు, వినతులు, విజ్ఞప్తులు, సలహాలను రాసి ఫిర్యాదు బాక్సుల్లో వేయాలి. ప్రతి రోజు సాయంత్రం ఈ బాక్స్​ను తెరిచి ఫిర్యాదులు, విజ్ఞప్తులను పరిశీలించాలి. వారంలో చివరి రోజు కమిటీ సభ్యులు సమావేశమై వీటిని పరిశీలించాలి. అందులో పరిష్కరించేవి డిపోలో మేనేజర్‌ స్థాయిలో పరిష్కరించాలి. రీజియన్‌ స్థాయిలో ఉంటే రీజినల్‌ మేనేజర్‌కు, రాష్ట్ర స్థాయిలో ఉంటే బస్‌ భవన్‌కు పంపించాలి. తర్వాత ఉన్నతాధికారులు రివ్యూ చేసి, సమస్యలు పరిష్కరించాలి. కాగా, సకాలంలో కౌన్సిళ్లు సమావేశం కావడం లేదు. 

తమ వారికి డ్యూటీలు.. నచ్చని వారికి లాస్‌ ఆఫ్‌ పేలు

రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీలో 48 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. గతంలో 9 వేల బస్సులు ఉండగా, ప్రస్తుతం 6 వేలకు తగ్గిపోయాయి. దీంతో ఉద్యోగుల్లో విధుల కోసం పోటీ పెరిగింది. ఉద్యోగులు ఎక్కువ మంది ఉండటం, తక్కువ మొత్తంలో బస్సులు నడుస్తుండటంతో కొంత మందికి రోజువారీ డ్యూటీలు దొరకడం లేదు. దీనిని ఆసరాగా చేసుకుని డిపో మేనేజర్లు, సీఐలు ఉద్యోగులను వేధిస్తున్నారు. తమకు అనుకూలంగా ఉన్నవారికి మాత్రమే డ్యూటీలు వేస్తున్నారు. నచ్చని వారికి ఆబ్సెంట్లు, లాస్‌ ఆఫ్‌పేను అమలు చేస్తున్నారు. మరికొందరిని డిపో స్పేర్‌లో పెడుతున్నారు. ఇక, మైలేజ్‌ పెంచాలని డ్రైవర్లను, కలెక్షన్లు ఎక్కువగా వచ్చేలా చూడాలని కండక్టర్లను వేధిస్తున్నారు. మైలేజ్‌ తక్కువగా వచ్చిందని, నష్టాన్ని జీతం నుంచి ఎందుకు కట్‌ చేయకూడదో చెప్పాలని ఇటీవల వెంకన్న అనే డ్రైవర్‌కు నోటీసులు కూడా ఇచ్చారు. ఈ క్రమంలో అధికారుల వేధింపులు తాళలేక పలువురు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పని భారం భరించలేక ఈ నెల 18న కామారెడ్డి జిల్లాలో స్వామిగౌడ్‌ అనే డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. అనారోగ్యంతో బాధపడుతున్నా సిక్‌ లీవ్‌ ఇవ్వలేదని మే 12న యాదగిరిగుట్టకు చెందిన మిర్యాల కిషన్‌ డిపోలోనే సూసైడ్‌ చేసుకున్నాడు. అంతకు ముందు హైదరాబాద్‌, ఖమ్మంలోనూ బలవన్మరణాల ఘటనలు జరిగాయి. 

రెండేండ్లు అయినా యూనియన్లను అనుమతిస్తలె..

ఆర్టీసీలో సమ్మె తర్వాత యూనియన్లపై ప్రభుత్వం కన్నెర్ర చేసింది. రెండేండ్ల పాటు సంస్థలో యూనియన్లు ఉండవని స్వయంగా సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. కేసీఆర్‌ ప్రకటించి రెండేండ్లు దాటినా ఇప్పటికీ యూనియన్లను అనుమతించడం లేదు. యూనియన్‌ లీడర్లు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదు. అధికారులు సైతం లీడర్లకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వడం లేదు. గతంలో ఆర్టీసీలో రెండేండ్లకోసారి యూనియన్‌ ఎలక్షన్లు ఉండేవి. గెలిచిన యూనియన్‌తో పాటు ఇతర యూనియన్లు కూడా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపేవి. ఉద్యోగులకు డ్యూటీలు, వేతనాలు, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు, సెలవులు తదితర సమస్యలు ఉంటే యూనియన్లకు చెప్పుకునేవారు. ప్రస్తుతం యూనియన్లు లేకపోవడంతో ఉద్యోగులు తామ బాధలను ఎవరికీ చెప్పుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. యూనియన్లు లేకపోవడంతో అడిగే వారు లేక అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.