గుర్తుకొస్తే గుండె చెరువైతది..యాదయ్య నిన్నుయాది మరువమయ్యా

గుర్తుకొస్తే గుండె చెరువైతది..యాదయ్య నిన్నుయాది మరువమయ్యా

జూన్​ 2.. సగర్వంగా స్వరాష్ట్రంలో తలెత్తుకొని నిలబడ్డ యాళ్ల. ఆరు దశాబ్దాల ఆకాంక్ష గుండె గొంతుకలో కైగట్టి ఎగిసిన రోజు.పల్లెల పొంట యాడ జూసినా పోరాట జెండాలే.. పట్నాల పొడుగునా యాడ జూసినా ఉద్యమ ఎజెండాలే. చేను చెలక.. పబ్బతి పట్టి నడిపించినయ్.  గల్లీ గల్లీ.. ఇమ్మతి ఇచ్చి ఢిల్లీ మెడలు వంచినయ్. ఈ పొద్దు పొడుపు వెనుక ఎన్ని పొద్దులు వాలినయో.. ఎన్ని గుండెలు పగిలినయో.. ఎన్ని కుత్తుకలు ఉరికొయ్యకు వేలాడినయో..! ఉస్మానియా యూనివర్సిటీ గడ్డపై ఎన్ని గాయాల గేయాలో..!! నాడు ఓయూలో అడుగడుగునా నిర్బంధాలు.. ఉక్కుపాదాలు.. ఇనుప కంచెలు.. లాఠీ దెబ్బలు.. టియర్​గ్యాస్​ పొగలు.. రబ్బరు బుల్లెట్లు.. కమురు వాసనలు.. యాదికొస్తే గుండె చెరువైతది. అమరులు వేసిన పునాది ఈరోజు. తెలంగాణ ఉద్యమానికి ఓయూ దోసిలిపట్టి.. తెలంగాణ తల్లి నుదుటిపై వీరతిలకం దిద్దింది.

ఆరోజు 2010 ఫిబ్రవరి 20..పొద్దు పొద్దుగాల్లనే.. 

మా త్రివేణి హాస్టల్ లో చెట్టుకింద ఎల్లన్న, గెల్లు, భూపాల్, మల్లేశన్న, లక్ష్మణ్ గంగ, గుడిపల్లి,  సుధాకర్, యాదగిరి.. ఇట్ల పది ఇరవై మంది దాకా జమైనం. రాత్రి ఆర్ట్స్ కాలేజీ దగ్గర జరిగిన మీటింగ్​ గురించి మాట్లాడుకుంటుండంగనే.. “ఇగో.. సూడుండ్రి. ఈ పేపర్లు ఎట్ల రాసినయో..! ఈ ఫొటోల్లో నలుగురైదుగురు కూడా లేరు.. సమైక్య ఉద్యమమట. ఫస్ట్ పేజీల వేసిండ్రు. 60 ఏండ్లకెంచి మనోళ్లు కొట్లాడుతుంటే ఎప్పుడన్న రాసినయా ఈ పేపర్లు’’ అంటూ న్యూస్ పేపర్లను తీసుకొని వచ్చిండు శ్రవణన్న.

ఇట్లయితే నడ్వద్

తెలంగాణ ఇచ్చినట్టే ఇచ్చి కేంద్రం వెనక్కి తీసుకున్నది. ఇయ్యాళ తాడోపేడో తేలాలే. ధూం తడాఖానే. అసెంబ్లీ దద్దరిల్లాలే’’ ఎంఫిల్ స్కాలర్  ఎల్లన్న అంటూనే.. రూంలకు ఉరికిండు. పిలిచినా పలుకకుండా లోపలికి పోయి.. ఇన్ని పాత అంగీలు, పాత ప్యాంట్లు పట్టుకొచ్చిండు.

ఎల్లన్న పొంటనే గెల్లు, యాదగిరి కూడా రూంలల్లకు పోయి పాత పేల్కలు తీసుకచ్చిండ్రు. ముండ్ల కంపల కెంచి కట్టెలు గుంజి.. అప్పట్లప్పుడే రెండు మూడు దిష్టిబొమ్మలు రెడీ చేసిండ్రు.

ఇగో ఛాయ్ తాగుండ్రి..

’’ హాస్టల్ చీఫ్ కుక్  బాలన్న పెద్ద ప్లేట్ల పది పదిహేను గ్లాస్ లల్ల చాయ్ పోసుకొని తెచ్చిండు. అందరం చాయ్ తాగినం.మెస్ రూంలో టిఫిన్లు చేసెటోళ్లు చేస్తున్నరు. టిఫిన్లు చేసినోళ్లు చేసినట్లే చెట్టుకిందికి వచ్చి అందరితోటి కలిసిపోయిండ్రు. అటెన్క అందరం హాస్టల్ గేటు బయటకు వచ్చి రోడ్డు మీద  కూసున్నం. ఓయూ ఫస్ట్ గేటును ఆనుకొని మా హాస్టల్ ఉంటది. గేటు కాడ  దినాం పోలీసులు బందూకలతోటి రెడీగా ఉంటున్నరు. ఆ రోజు ఇంకా మస్తు మంది  పోలీసులు మోపైండ్రు.  చీమ కూడా బయటకు పోనంతగా బారీకేడ్లు, ముండ్లకంచెలు.. వాటి పొంటనే టియర్ గ్యాస్ వ్యాన్లు.. శివం రోడ్డు సిగ్నల్ దాకా పెట్టిండ్రు. వాటి అవతల టీవీ చానళ్ల ఓబీ వ్యాన్లు, రిపోర్టర్లు. గేట్​ ముందుండే షాపులన్నీ మూడునెలలకెంచి మూతపడ్డయి. అండ్ల పనిచేసెటోళ్లు కూడా మాతోటే జతకట్టిండ్రు.

మా హాస్టల్ గేటు ముందు లక్ష్మణ్, గుడిపల్లి “పుడితొక్కటి సస్తె రెండు రాజిగ ఒరి రాజిగో.. ఎత్తుర తెలంగాణ జెండ రాజిగ ఒరి రాజిగా’’ పాటలు అందుకున్నరు. దానికి అందరం చప్పట్లు కొడుతూ, దరువులు వేస్తూ కైగట్టినం. అసెంబ్లీ ముట్టడికి  ఆర్ట్స్ కాలేజీ నుంచి ర్యాలీ స్టార్టయిందన్న సమాచారం వచ్చింది. చూస్తుండంగనే వందలు వేల మందితో ర్యాలీ గేటు వైపు చేరుకుంది. అన్ని హాస్టళ్ల స్టూడెంట్లు ర్యాలీలో కలిసిపోయిండ్రు. వడ్డెర బస్తీ నుంచి మొదలు పెడితే.. అటు లేడిస్ హాస్టల్​.. ఇటు మహిళా సభ హాస్టల్​.. ఇంకో దిక్కు ఇంజనీరింగ్​ హాస్టల్స్​.. మా హాస్టల్ ముందున్న జామియా ఉస్మానియా గవర్నమెంట్ స్కూల్.. ఇట్ల అన్ని దిక్కులకెంచి స్టూడెంట్స్ దండులెక్క కదిలిండ్రు.

ర్యాలీ వస్తుండంగనే..

పోలీసులు టియర్ గ్యాస్ ఎక్కుపెట్టిండ్రు. లాఠీలతో ఇష్టమొచ్చినట్లు మీద పడి కొట్టిండ్రు. టియర్​  గ్యాస్ కు కండ్లు పటపట మండిపోయినయి.  లాఠీల దెబ్బలకు వీపులు, కాళ్లు బొబ్బలెక్కిపోయినయి. అయినా..  ఆగలే. ఎక్కడివాళ్లం అక్కడ పుట్టకొకరం చెట్టుకొకరం ఉరికినం.. ఎట్లురికినమో అట్లనే మళ్లా గేటు ముందుకు వచ్చిచేరినం. వందలు వేలుగా స్టూడెంట్స్ రాంగనే.. పోలీసులు కొంచెం వెనక్కి తగ్గినట్లు చేసిండ్రు.  బారికేడ్లను పక్కకు పడేసి, ముండ్ల కంచెలను తొక్కుకుంటూ ముందుకు కదిలినం. “జై తెలంగాణ.. వీ వాంట్ తెలంగాణ’’ నినాదాలు మార్మోగుతూనే ఉన్నయి. శివం రోడ్డు దగ్గర సిగ్నల్​ కాడ.. పోలీసులు పూరా కట్టడి చేసిండ్రు. అటోళ్లను ఇటు.. ఇటోళ్లను అటు పోనియకుండా చేసిండ్రు. దీంతో అదే జాగల అందరం బైఠాయించి.. పాటగాళ్లు ఉద్యమ పాటలు అందుకుంటే మేమంతా కోరస్ కలిపినం.  కూర్చోవడానికి జాగ సరిపోలేదు. చెట్లెక్కి కొందరు..  గోడలెక్కి ఇంకొందరు.. అందరం ఆడ్నే ఉన్నం. సిగ్నల్ జంక్షన్​ కాడికెంచి మొదలుపెడితే.. వెనక్కి ఇంజినీరింగ్ కాలేజీ, లేడీస్​ హాస్టల్​ దాకా యాడ జూసినా స్టూడెంట్లే. అందరూ రోడ్డుమీదనే కూర్చొని నిరసన తెలిపినం. ఆరోజు ఓయూ జేఏసీ ఆధ్వర్యంలో “చలో అసెంబ్లీ” ముట్టడి కార్యక్రమం. ఆ పిలుపునందుకొని తెలంగాణ నలుమూలలకెంచి స్టూడెంట్లు హైదరాబాద్ కు దండుకట్టిండ్రు. వాళ్లను ఎక్కడోళ్లను అక్కడ్నే పోలీసులు నిర్బంధించిండ్రు. అందరిలో ఒకటే ధ్యాస.. ఒకటే శ్వాస.. తెలంగాణ.. తెలంగాణ. మధ్యాహ్నం 1.30 దాకా మేమంతా ఓయూ గేట్​కు అవతల.. సిగ్నల్​కు లోపల కూర్చొని నిరసనకు దిగినం. పాటలు, నినాదాలు హోరెత్తినయి. ఇంతల్నే పోలీసులు మళ్లా లాఠీచార్జీ స్టార్ట్​ జేసిండ్రు.  ఆ దెబ్బలు తాళలేక హాస్టళ్ల పొంట ఉరికినం. మధ్యాహ్నం అయిందని ..  మెస్​లకు పోయి తిందామనుకున్నం.

ఇంతల్నే

“అగగో.. ఓళ్లో స్టూడెంట్ పెట్రోల్ పోసుకున్నడట. మన హాస్టల్ ముందట్నే. రండ్రి.. రండ్రి’’ అనుకుంట హాస్టల్​ సెక్యూరిటీ గార్డ్​ మజీద్​  ఉరికొచ్చిండు. బయటకు వచ్చి చూసే సరికి.. జామియా ఉస్మానియా గవర్నమెంట్ స్కూల్ దగ్గర్నుంచి ఓ తమ్ముడు నిలువెల్లా కాలుతూ చేతులు అడ్డంగా చాపి.. ఓయూ గేట్ అవతలి దిక్కు ఒకటే తిరుగ ఉరుకుతున్నడు. అప్పటికే స్టూడెంట్లంతా హాస్టళ్లదిక్కు పోవడంతో ఆ తమ్ముడ్ని ఎవరూ పెద్దగా చూడలేదు.  ‘‘అయ్యో.. అయ్యో.. ఆపుండ్రి.. ఆపుండ్రి’’ అనుకుంట మా హాస్టలోళ్లమంతా వెంబటపడ్డం. ముండ్ల కంపలకెంచి పాత పేల్కలు, బొంతలు గుంజుకొని కొందరు..  రోడ్డు పక్కన ఇసుకను దోసిట్ల పట్టుకొని ఇంకొందరు.. మంటల్ని ఆర్పెటందుకు ఆ తమ్ముడి దిక్కు కదిలినం. తలెంట్రుకలు, పెయ్యి కాలుతున్నా.. తోలు బట్ట పేల్కల లెక్క ఊడి పడుతున్నా.. ఆ తమ్ముడు “జై తెలంగాణ.. జై తెలంగాణ” నినాదాలు చేస్తనే ఉన్నడు. పోలీసులను దాటుకొని ముందుకు ఉరికిండు.. మళ్ల వెనుకకు వచ్చిండు. అట్ల మూడు నాలుగు రౌండ్లు అటూ ఇటూ ఉరుకుతూనే.. నినాదాలు చేస్తూనే .. ఓయూ ఫస్ట్​ గేటు అవతల కిందపడిపోయిండు. అప్పటికే మిగతా స్టూడెంట్లంతా గేటు కాడికి చేరుకున్నరు. ఎవర్ని కూడా  గేటు దాటి బయటకు రానీయకుండా  పోలీసులు నిర్బంధించి.. ఆ తమ్ముడ్ని  అంబులెన్స్ లో వేసుకపోయిండ్రు. ఆ తమ్ముడ్ని ఉక్కుపాదాల నడిమిట్లకెంచి చూస్తూ.. గేటుకు ముఖం వేసి బీరిపోయినం. మా కండ్ల నీళ్లు గొడ గొడ దుంకినయి. గుండెలు భగ భగ రగిలిపోయినయి.

ఎవరా పిల్లగాడు.. ఎవరా తమ్ముడు..!

అప్పటిదాకా మాతోటి ర్యాలీలో ఉన్నడు. మా వెంటనే తిరిగిండు. నల్లటి బ్యాగ్ భుజానికి వేసుకొని మాలోనే ఒకడిగా రోడ్డుమీద కూసున్నడు.  పేరు సిరిపురం యాదయ్య. పట్టుమని పదిహేడేండ్లు కూడా ఉండవు. ఊరు.. రంగారెడ్డి జిల్లా నాగారం.  చిన్నప్పుడే అమ్మానాన్న చనిపోవడంతో అనాథ అయిండు. ఓ ఆర్ఫనేజ్ హోంలో ఉంటూ ఇంటర్ చదువుతున్నడని తెలిసింది. రాత్రిళ్లు రెస్టారెంట్లలో పనిచేసెటోడట… అట్ల వచ్చిన పైసలతోటి ఆర్ఫనేజ్ హోంల పిల్లలకు బట్టలు, పుస్తకాలు కొనిచ్చెటోడట. తెలంగాణ వస్తే బతుకులు మంచిగైతయని, మన ఉద్యోగాలు మనకు వస్తయని, మననీళ్లు మనకయి తయని అందరితోటి చెప్పెటోడట. ఓయూలో మా అందరితో ఉద్యమంలో పాల్గొనాలని వచ్చిండట.

సిరిపురం యాదయ్య..

ఆ రోజు మా అందరితోటి కలె తిరిగిండు. మేమంతా హాస్టళ్లకు పోంగనే  మధ్యాహ్నం రెండుగొట్టంగ ఒంటరిగా త్రివేణి హాస్టల్​కు అపోజిట్ల ఉన్న  జామియా ఉస్మానియా  స్కూల్ గోడ దగ్గరికి చేరిండు. బ్యాగ్ ఓపెన్ చేసి..  అండ్ల తెచ్చుకున్న పెట్రోల్ ను పెయ్యిమీద గుమ్మరించుకున్నడు. అగ్గిపెట్టుకొని ముండ్ల కంచెలు, బారీకేడ్లు పడేసుకుంటూ గేటు అవతలి దిక్కు ఉరికిండు. తన బ్యాగ్​లో పొలిటికల్​ లీడర్లతో దిగిన ఫొటోలు, సూసైడ్​ నోట్, కొన్ని పుస్తకాలు కనిపించినయి.

ఆ తమ్ముడు..

తెలంగాణ రావాలని ఎంతగా తపించిండో.. తెలంగాణ ప్రకటనను నాటి కేంద్రం వెనక్కి తీసుకోవడంతో ఎంతగా రగిలిపోయిండో.. పోలీసు ఉక్కుపాదాల కింద ఓయూ నలిగిపోతుంటే ఎంతగా అల్లాడిండో..! తెలంగాణనే ఊపిరనుకున్నడు. తెలంగాణతోనే బతుకనుకున్నడు. గర్జుకు చేస్తున్న సమైక్య ఉద్యమానికి, నాటి కొందరు లోకల్​ లీడర్ల​ నాటకాలకు మండిపోయిండు. అప్పటిదాకా మాతోటి కలిసి ఉండి.. నినాదాలు చేసి.. అంతలోనే కాలిన మాంసం ముద్దయిండు. కానరాని లోకలకు పోయిండు. ఓయూ మట్టిలో అమరుడైండు.

సిరిపురం యాదయ్య

ఆత్మార్పణ  ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసింది. యాదయ్య ఒక్కడే కాదు.. అంతకు ముందు ఆ తర్వాత.. లైబ్రరీ కాడ  కావొచ్చు.. ఠాగూర్​ ఆడిటోరియం కాడ కావొచ్చు..  హాస్టల్స్​​ రూముల్లో కావొచ్చు.. ఇట్ల ఎందరో.. ఎక్కడ పుట్టారో కానీ.. ఓయూ మట్టిలో  తెలంగాణ కోసం ప్రాణాలు విడిచిండ్రు.  మలిదశ ఉద్యమంలో 2009 నవంబర్‌ నుంచి మొదలు పెడితే 2014 తెలంగాణ ప్రక్రియ స్టార్టయ్యి, వచ్చేదాకా ఉస్మానియా గడ్డ జంగ్‌ సైరన్‌ ఊదింది. ఆకాంక్షల జెండాను ఎత్తుకొని ముందుకు దుంకింది.  స్వరాష్ట్ర పోరులో  తెలంగాణ నలుదిక్కులా వేల మంది నింగికెగిసిండ్రు.

ఆ అమరుల త్యాగాల పునాదులపైనే నేడు తెలంగాణ పతాక ఎగురుతున్నది. ఆ త్యాగాల వారధులపైనే మన బతుకుబండి నడుస్తున్నది. ఆ అమరులను యాదిమరిస్తే, ఆ వీరులు మనాదిలో లేకపోతే ఈ స్వేచ్ఛావాయువులకు, ఈ బతుకులకు అర్థమే లేదు.వీరులారా.. వందనం.
తెలంగాణ అమరులారా..వందనం.

అంబట్ల రవి