అత్యంత పొడవైన దంతాలున్న ఏనుగు మృతి

అత్యంత పొడవైన దంతాలున్న ఏనుగు  మృతి

ఏషియాలో అత్యంత పొడవైన దంతాలు కలిగిన ఏనుగు భోగేశ్వర్ అనారోగ్యంతో మృతి చెందింది.  కబిని బ్యాక్ వాటర్ ప్రాంతంలో పర్యాటకులను అలరించిన  భోగేశ్వర్ వయసు 60 ఏళ్ళు. వయసు సంబంధిత  సమస్యలతో భోగేశ్వర్ మరణించినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. బందీపూర్‌లోని టైగర్ రిజర్వ్ పరిధిలోని గుండ్రె రేంజ్‌లో భోగేశ్వర్ చనిపోయినట్లు చెప్పారు. 

టూరిస్టులకు ఇష్టం..
కర్ణాటకలోని  నాగర హెూల్, బందీపూర్ టైగర్ జోన్లో  పులులను చూడడానికి విపరీతంగా పర్యాటకులు వచ్చేవారు.  ఆ పర్యాటకులు పులులకు బదులు భోగేశ్వర్ను చూసేందుకు ఇష్టపడేవారు. పొడవైన దంతాలతో భోగేశ్వర్ ఠీవిగా కనిపించేది. అందుకే టూరిస్టులకు భోగేశ్వర్ అంటే ఇష్టం ఏర్పడింది. భోగేశ్వర్ దంతాల్లో ఒకటి 2.58 మీటర్లు కాగా.. మరొకటి 2.38 మీటర్లు.

భోగేశ్వర్ పేరు అలా వచ్చింది..
కర్ణాటక భోగేశ్వర్ క్యాంపునకు సమీపంలోని కబినీ బ్యాక్ వాటర్ ప్రాంతంలో  పొడవైన దంతాలతో ఏనుగు అలరించేది.  భోగేశ్వర్ సమీపంలో  తరచూ సంచరించడంతో..అటవీ శాఖ సిబ్బంది, అక్కడి గిరిజనులు ఈ ఏనుగుకు భోగేశ్వర్ అని పేరు పెట్టారు.  అప్పటి నుంచి ఆ ఏనుగు భోగేశ్వర్గా ప్రసిద్ది చెందింది.  అయితే టైగర్ రిజర్వ్లో  పులులను చూసేందుకు వచ్చిన జనం..పులులను చూడలేకపోయినా..భోగేశ్వర్ను చూసి మురిసిపోయేవారు. కొందరైతే..ప్రత్యేకంగా భోగేశ్వర్ను చూసేందుకే కబినికి వచ్చేవారు. రెండు పొడవాటి దంతాలతో భోగేశ్వర్ రాజసంగా నడుస్తూ ఉంటే..పర్యాటకులు థ్రిల్గా ఫీలయ్యేవారు. ఇక భోగేశ్వర్ అటవీ శాఖ, కొన్ని ప్రైవేట్ సంస్థలు రూపొందించిన అనేక వన్యప్రాణుల డాక్యుమెంటరీలు, చిత్రాలలోనూ కనిపించింది,  

ప్రముఖుల సంతాపం..
మిస్టర్ కబినిగా ప్రసిద్ధి చెందిన భోగేశ్వర్ మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.  గుండ్రే రేంజ్లో భోగేశ్వర్  సహజ కారణాలతో చనిపోయిందని  IFS అధికారి సుశాంత నంద ట్వీట్ చేశారు. భోగేశ్వరుడు మరణం బాధకలిగించిందని..తన పొడవైన దంతాలతో పర్యాకులను విశేషంగా ఆకట్టుకుందని  కేంద్ర వ్యవసాయ, రైతుల సంక్షేమ శాఖ సహాయ మంత్రి శోభా కరంద్రాజ్ ట్వీట్ చేశారు.