Earthquake: టర్కీ, సిరియాలో పెరుగుతున్న మృతుల సంఖ్య

Earthquake: టర్కీ, సిరియాలో పెరుగుతున్న మృతుల సంఖ్య

యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసేలా టర్కీ, సిరియాల్లో సంభవించిన భూకంపంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇరు దేశాల్లో మృతుల సంఖ్య ఇప్పటి వరకు 4,500కు పైగా చేరిందని అక్కడి మీడియా సంస్థల ద్వారా తెలుస్తోంది. భారీ భూకంపాల ధాటికి టర్కీ, సిరియా అతలాకుతలమయ్యాయి. పేక మేడల్లా కూలిన భారీ భవనాల కింద ఉన్న మృతదేహాలను బయటకు వెలికితీస్తున్నారు. నిన్న ఒక్కరోజే టర్కీ, సిరియా దేశాల్లో సంభవించిన భూకంపం ఘటనల్లో 4 వేల మందికిపైనే ప్రాణాలు కోల్పోయారంటే పరిస్థితులు ఎంత హృదయవిదారకంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. భూకంపం ధాటికి ఊరు, పట్టణాలనే తేడా లేకుండా మరు భూములుగా మారిపోయాయి. టర్కీ, సిరియాలో భూకంపం ప్రకోపానికి భారీగా ప్రాణ, -ఆస్తి నష్టం వాటిల్లింది.

రెస్క్యూ ఆపరేషన్ కు ఇబ్బందులు

ప్రస్తుతం రెండు దేశాల్లోనూ రెస్క్యూ ఆపరేషన్ కు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రోడ్లు దెబ్బతినడం, కరెంట్, -ఇంటర్నెట్‌ సేవలకు అంతరాయంతో పాటు చాలాచోట్ల మంచి నీటి సరఫరాకు విఘాతం ఏర్పడింది. దాంతో సహాయక చర్యలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. వేల మంది ఇంకా శిథిలాల కిందే ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఈ రెండు దేశాల్లోనూ శిథిలాల చిక్కుకున్న వాళ్లను రక్షించే రెస్క్యూ ఆపరేషన్‌లో.. ఇప్పటిదాకా 4వేలకు పైగా మృతదేహాలను వెలికి తీశారు. టర్కీ చరిత్రలోనే ఇది భారీ భూకంపంగా నమోదైంది. అధికంగా మృతుల సంఖ్య కూడా ఇక్కడే నమోదు అయ్యిందని తెలుస్తోంది. భారీ ప్రకంపనల ధాటికి సెకన్ల వ్యవధిలోనే వందల సంఖ్యలో పెద్ద పెద్ద బిల్డింగులు కుప్పకూలడం ఒక  ఎత్తయితే.. అర్ధరాత్రి అంతా గాఢ నిద్రలో ఉండడంతో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సోమవారం (ఈనెల6న) నాటి భూకంపం ధాటికి 14వేల పైనే గాయపడగా.. వీళ్లలో కొంత మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సిరియాలోనూ క్షతగాత్రులు నాలుగు వేల మందికి పైనే ఉండొచ్చని అనధికార లెక్కలు చెబుతున్నాయి. వారం పాటు టర్కీ సంతాప దినాలు ప్రకటించింది. 

టర్కీకి తక్షణ సాయం

భూకంపం ధాటికి సిరియాలోని అలెప్పో, లటాకియా, హమా, టార్టస్‌ ప్రాంతాలు తీవ్రంగా దెబ్బ తిన్నాయి. పైగా  విషాదానికి ముందే అలెప్పోలోని (రష్యా యుద్ధ స్థావర కేంద్రం కూడా) భవనాలు కొన్ని కూలిపోతూ వస్తున్నాయి. పాశ్చాత్య, అగ్ర దేశాలతో పాటు భారత్‌ సహా మొత్తం 12 దేశాలు టర్కీకి తక్షణ సాయం అందించేందుకు ముందుకు వచ్చాయి. ఇప్పటికే రిలీఫ్‌ మెటీరియల్‌ను టర్కీకి పంపించాయి.