జమ్మూకశ్మీర్ లో కొనసాగుతున్న సహాయక చర్యలు

జమ్మూకశ్మీర్ లో కొనసాగుతున్న సహాయక చర్యలు

జమ్మూ కశ్మీర్ అమర్నాథ్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శుక్రవారం సాయంత్రం ఒక్కసారిగా కురిసిన వర్షంతో అమర్నాథ్లో భారీ వరదలు సంభవించాయి. వేలాది మంది ఈ వరదల్లో చిక్కుకుని విలవిల్లాడారు. ఇప్పటివరకు 15వేల మందిని రక్షించగా..40మందికిపైగా ఆచూకీ లభ్యం కాలేదు. ఎన్డీఆర్‌‌ఎఫ్, ఎస్‌‌డీఆర్‌‌‌‌ఎఫ్, ఆర్మీ, ఐటీబీపీ బృందాలతో పాటు స్థానిక పోలీసులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించేందుకు ఎయిర్ అంబులెన్సుల్లో తరలిస్తున్నారు.

అమరనాథ్ యాత్రలో జనగామ జిల్లా వాసులు కూడా చిక్కుకున్నారు. తాడూరి రమేష్, జిల్లా సత్యనారాయణ , పల్లెల లక్ష్మీనరసయ్య, సిద్ధిలక్ష్మీలు ఈ నెల 3న అమర్ నాథ్ యాత్రకు వెళ్ళారు. పహిల్గాంకు నుంచి నడకదారిన బయలుదేరిన వీరిని  భద్రతాసిబ్బంది అడ్డుకున్నారు. కొండచరియలు విరుగుపడుతున్నాయని చెప్పడంతో వారు రాత్రంతా భయంగుప్పిట్లో ఉన్నారు. దీంతో వారి కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు.

నా కండ్ల ముందే 20 మందికి పైగా కొట్టుకుపోయారు  రాజాసింగ్​, ఎమ్మెల్యే

‘‘రెండు రోజుల ముందే యాత్రకు వెళ్లాం. ఆన్‌లైన్‌లో హెలికాప్టర్‌ సర్వీసులు బుక్ చేశాం. గురువారం హెలికాప్టర్‌‌లో అమర్​నాథ్​కు చేరుకున్నాం. శుక్రవారం మాకంటే ముందు 10 వేల మంది దర్శనం చేసుకున్నారు. దర్శనానికి మాకు 3 ‑ 4 గంటలు పట్టింది. అప్పటికే అక్కడ వాతావరణం మారిపోయింది. దీంతో చాపర్ ఎక్కలేదు. గుర్రాల సాయంతో అక్కడి నుంచి బయల్దేరాం. అమర్‌‌నాథ్‌ గుహ దాటి ఒక కిలోమీటర్ దూరం వెళ్లాం. భారీ వర్షం కురవడం, వరద రావడంతో టెంట్లలో ఉన్న 20 - 30 మంది నా కండ్ల ఎదుటే కొట్టుకుపోయారు’’ అని రాజాసింగ్ చెప్పారు.