ఈటల నిజాలే చెప్తరు : భట్టి విక్రమార్క

ఈటల నిజాలే చెప్తరు : భట్టి విక్రమార్క

‘గులాబీ జెండా ఓనర్లం’ వ్యాఖ్యలను పరోక్షంగా ప్రస్తావించిన భట్టి
అసెంబ్లీలో మెడికల్ అండ్ హెల్త్‌‌ పద్దుపై వాడీ వేడి చర్చ
ప్రివెంటివ్ చర్యల్లో ప్రభుత్వం విఫలమైందన్న ప్రతిపక్షం
ఆరోగ్యశ్రీలో జ్వరాలను చేర్చాలని డిమాండ్‌‌
ప్రైవేటు బిల్లులపై నియంత్రణ చట్టం తేవాలని విజ్ఞప్తి

హైదరాబాద్‌‌, వెలుగు: ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌‌‌‌ అన్ని నిజాలే మాట్లాడతారని, ఈ మధ్యన కూడా నిజాలే మాట్లాడారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. అయితే ఆ రోజు ఆయన శబ్ద తరంగాలు బయటకు వెళ్లే ముందే కట్టడి చేశారని సెటైర్ వేశారు. గులాబీ జెండాకు ఓనర్లం అంటూ ఈటల చేసిన వ్యాఖ్యలను భట్టి పరోక్షంగా గురువారం అసెంబ్లీలో ప్రస్తావించారు. మెడికల్ అండ్ హెల్త్‌‌ బడ్జెట్‌‌ కేటాయింపులపై చర్చ సందర్భంగా మంత్రి సమాధానమిస్తూ కేంద్రం నుంచి ఆశించిన బడ్జెట్ రాకపోయినా రాష్ట్రంలో ప్రజల కష్టాలను ఆలోచించి తెలంగాణ బడ్జెట్ కేటాయింపులు చేస్తున్నామన్నారు. ప్రమోటీవ్ ఆక్టివిటీలో భాగంగా గర్భిణులు, బాలింతలకు అంగన్‌‌వాడీ కేంద్రాల ద్వారా గుడ్లు, పాలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. పిల్లల ఆరోగ్య సంరక్షణలో భాగంగానే హాస్టళ్లలో సన్నబియ్యం, పోషకాహారం అందిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంలో భట్టి కలుగజేసుకుని ప్రజలు రోగాలతో బాధ పడుతున్నారని, హాస్పిటళ్లు కిటకిటలాడుతున్నాయని, ఒక్కో బెడ్‌‌పై ఇద్దరిని పడుకోబెడుతున్నారని, మరోవైపు మందులు లేవని అన్నారు.

ఈ సమస్యలను ఎలా పరిష్కరించుకుందామో చెప్పకుండా చరిత్రంతా చెబుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. దీంతో మంత్రి వేముల ప్రశాంత్‌‌రెడ్డి కలుగజేసుకుని ప్రభుత్వం చేసింది చెప్పుకోవద్దా, ఆయన మెతక మనిషి అని మధ్యలో అడ్డుపడతారా అంటూ భట్టికి కౌంటర్ ఇచ్చారు. తిరిగి ఈటల మాట్లాడుతూ ఒక్కో బెడ్డుపై ఇద్దరు ఉన్నారంటే ప్రభుత్వ దవాఖానాలపై ఎంత నమ్మకం, విశ్వాసం ఉందో అర్థం చేసుకోవాలన్నారు. రోగుల సంఖ్య పెరగడం గ్రోత్ ఇండికేషన్‌‌ కాదని, ప్రైవేటు హాస్పిటళ్లలోనూ రోగుల సంఖ్య పెరిగిందని గుర్తు చేస్తూ భట్టి కౌంటర్​ఇచ్చారు. ఈ ఆరేండ్లలో శానిటేషన్‌‌, పల్లెల పరిశుభ్రతపై దృష్టి పెడితే ఇప్పుడీ పరిస్థితి ఉండేది కాదన్నారు. ఈటల రాజేందర్‌‌‌‌ అన్ని నిజాలే చెప్తరని మంత్రులు అంటున్నారని,  జ్వరాల సమస్యను ఎలా పరిష్కరిస్తారో కూడా నిజమే చెప్పాలని భట్టి అన్నారు.

బిల్లుల నియంత్రణ చట్టం తేవాలె

కాంగ్రెస్‌‌ ఎమ్మెల్యే శ్రీధర్‌‌‌‌బాబు మాట్లాడుతూ సీజనల్‌‌ రోగాలు రాకుండా ప్రివెంటీవ్‌‌ చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. వైద్యారోగ్య శాఖలోని డైరెక్టరేట్‌‌, కమిషనరేట్‌‌ మధ్య సమన్వయ లోపం ఉందన్నారు. జ్వరంతో ప్రైవేటు హాస్పిటల్‌‌కు పోతే కనీసం రూ.30 వేల నుంచి రూ.లక్ష వరకు బిల్లు అవుతోందని, జ్వరాలను ఆరోగ్యశ్రీ కింద చేర్చాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్పొరేట్, ప్రైవేటు హాస్పిటళ్ల బిల్లుల నియంత్రణ చట్టం తేవాలన్నారు. అలాగే మెడికల్ అండ్‌‌ హెల్త్ సర్వీసులను నేషనలైజ్ చేయాల్సిన అవసరముందన్నారు. వైద్యానికి కేటాయించిన రూ.5,232.77 కోట్లు సరిపోవని, దీనిపై పునరాలోచించాలని, ముఖ్యమంత్రిపై ఒత్తిడి తెచ్చి బడ్జెట్‌‌ పెంచేందుకు ప్రయత్నించాలని మంత్రిని కోరారు. అంతకుముందు భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య మాట్లాడుతూ.. డెంగీతో ప్రజలు మరణిస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. హాస్పిటళ్లలో డాక్టర్లు, పారామెడికల్‌‌ సిబ్బంది లేక ఇబ్బంది అవుతోందని, ఖాళీలను ఎప్పుడు భర్తీ చేస్తారో చెప్పాలని ప్రశ్నించారు.

జ్వరాలు వస్తున్నమాట వాస్తవమే..

ఈటల మాట్లాడుతూ.. జ్వరాలు వస్తున్న మాట వాస్తవమేనని అన్నారు. వైరల్ ఫీవర్లు అధికంగానే ఉన్నప్పటికీ, వాటి తీవ్రత గతంలోలా లేదన్నారు. రోగాలు విస్తరించకుండా ప్రివెంటీవ్ చర్యల్లో భాగంగానే 30 రోజుల ప్రణాళికలను అమలు చేస్తున్నామన్నారు. కొత్త ఫాగింగ్, స్ర్పెయింగ్ మిషన్లు కొని నగరాల్లో దోమల నివారణ చర్యలు చేపట్టామన్నారు. అన్నిచోట్ల హెల్త్ క్యాంపులు నిర్వహిస్తున్నామని, ప్రతి రోజు సమీక్షిస్తున్నామని తెలిపారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఈవినింగ్ ఓపీ కూడా నిర్వహిస్తున్నామన్నారు. అయితే, తాము ప్రజల్లో భరోసా కల్పిస్తుంటే, కాంగ్రెస్‌‌ వాళ్లు ప్రజలు భయాందోళనకు గురయ్యేలా వ్యవహరిస్తున్నారన్నారు. ఈవినింగ్ ఓపీ నిర్వహించడం పెద్ద గొప్పేమీ కాదని, రోగుల సంఖ్య పెరిగింది కాబట్టి ఈవినింగ్ ఓపీ పెట్టాల్సి వచ్చిందన్న విషయాన్ని గుర్తెరగాలని భట్టి సమాధానమిచ్చారు.

మరోవైపు హాస్పిటళ్లలో వసతులు సరిగా లేవని, ఆపరేషన్ థియేటర్ల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. ఈ సందర్భంగా తన నియోజకవర్గంలోని ఓ హాస్పిటల్‌‌ పైకప్పు కూలి ఆర్నెళ్లవుతున్న పట్టించుకోవడం లేదన్నారు.  దీనిపై దృష్టి పెట్టాలని మంత్రిని కోరారు. కేసీఆర్‌‌‌‌ కిట్ల కోసం 2017–-18, 2018–-19లో 10,46,756 మంది గర్భిణులు రిజిస్టర్ చేసుకుంటే, కేవలం 4,40,274 మందికి మాత్రమే కిట్లు ఇచ్చారని భట్టి ప్రస్తావించారు. అయితే, కిట్ల పంపిణీకి బడ్జెట్ కేటాయింపులకు సంబంధం లేదని, ఓ పదిహేను 20 రోజులు వెనకాముందైనా అందరికీ కిట్లు ఇస్తామని మంత్రి సమాధానమిచ్చారు.